ప్రదీప్ 'PR Show'.. సూపర్ క్రియేటివ్‌ గా ప్లాన్ చేశారే!

కోలీవుడ్ లో నటుడు, దర్శకుడిగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడు నిర్మాతగానూ కొత్త జర్నీ ప్రారంభించారు.

Update: 2026-07-06 09:16 GMT

కోలీవుడ్ లో నటుడు, దర్శకుడిగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడు నిర్మాతగానూ కొత్త జర్నీ ప్రారంభించారు. తన సొంత నిర్మాణ సంస్థ పీఆర్ షో బ్యానర్‌ పై తొలి సినిమా ప్రకటించారు. సాధారణంగా ఓ ప్రొడక్షన్ హౌస్‌ ను ప్రారంభించి, కొత్త సినిమాను ప్రకటించినట్లుగా కాకుండా.. తొలి ప్రాజెక్ట్ నుంచే స్పెషాలిటీ చూపించే ప్రయత్నం చేశారు ప్రదీప్. సినిమా కాన్సెప్ట్ నుంచి దర్శకుల ఎంపిక వరకు అన్నింటిలోనూ కొత్తదనం కనిపించేలా ప్లాన్ చేశారు.

సినిమాకు ఒకరు కాదు.. ఏకంగా ఆరుగురు దర్శకత్వం వహిస్తున్నారు. ది ఆల్ఫా యూనిట్ పేరుతో విశాల్ టీఆర్, యశ్ వీ, నరేన్ సౌదా, చాణక్యన్ ఆర్, ధనుష్ కుమార్, ఇళంపరితి కలిసి తెరకెక్కించనున్నారు. సాధారణంగా ఒక సినిమాకు ఒక దర్శకుడు ఉండటం చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో ఇద్దరు దర్శకులు కలిసి పనిచేసిన చిత్రాలు కూడా వచ్చాయి. కానీ ఆరుగురితో కూడిన టీమ్ ఓ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం విశేషం.

మరోవైపు కథ అందించింది కూడా ప్రదీప్ రంగనాథనే. కోమాలి, లవ్ టుడే, డ్రాగన్ వంటి చిత్రాలతో యూత్ ఆడియన్స్ పల్స్ పట్టుకున్న ప్రదీప్.. నిర్మాతగా తన తొలి సినిమాకు కూడా అదే స్థాయిలో ఉండేలా చూసుకున్నట్లు అనిపిస్తోంది. తాను రాసిన కథను ఆరుగురు దర్శకుల టీమ్ చేతిలో పెట్టడం ద్వారా కొత్త తరహా మేకింగ్‌ ను పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో మమిత బైజు హీరోయిన్‌ గా నటించనున్నారు.

ప్రేమలు సినిమాతో సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ సంపాదించుకున్న మమిత.. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ఇక దర్శకుడు అశ్వత్ మారిముత్తు హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు నటుడిగా కనిపించనుండటం మరో ఆసక్తికర అంశం. శివాజీ సొంటినేని, స్వాసిక, అనామిక మహి, లిజ్జీ ఆంటోనీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా ప్రకటన విషయంలోనూ మేకర్స్ రొటీన్ పద్ధతిని ఎంచుకోలేదు. ఓ పోస్టర్‌ తోనో, టైటిల్ అనౌన్స్‌మెంట్‌ తోనో సరిపెట్టకుండా.. క్రియేటివ్ వీడియోను రూపొందించారు.

ప్రాజెక్ట్‌ లో భాగమైన ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ చివర్లో ప్రదీప్ తన నిర్మాణ సంస్థను ప్రకటించిన విధానం ఆకట్టుకుంది. సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని పూర్తిగా వెల్లడించకుండానే.. ప్రాజెక్టుపై ఆసక్తి పెరిగేలా అనౌన్స్మెంట్ వీడియోను తీర్చిదిద్దారు. వీడియోకు సాయి అభ్యంకర్ అందించిన ఎనర్జిటిక్ మ్యూజిక్ మెయిన్ అసెట్ గా నిలిచింది.. విజువల్స్‌ కు తగ్గట్లుగా ఆయన అందించిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ అనౌన్స్మెంట్‌ కు మరింత స్టైల్ తీసుకొచ్చింది.

అనౌన్స్మెంట్ వీడియోతోనే సినిమాపై పాజిటివ్ బజ్ తీసుకురావడంలో పీఆర్ షో టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. అయితే ఆరుగురు దర్శకులతో సినిమా తెరకెక్కించడం ఎంత క్రియేటివ్‌ గా కనిపిస్తుందో.. అదే స్థాయిలో సవాల్‌ తో కూడుకున్న విషయం కూడా. మరి కొత్త ప్రయోగం తెరపై ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఏదేమైనా నిర్మాతగా ప్రదీప్ రంగనాథన్ తొలి షో మాత్రం క్రియేటివ్‌ గా, ప్రామిసింగ్‌ గా మొదలైందనే చెప్పొచ్చు.




Tags:    

Similar News