ఏనుగు దంతాల కేసులో మోహన్‌లాల్‌కు షాక్!

మలయాళ సినీ పరిశ్రమలో అగ్ర నటుడిగా గుర్తింపు పొందిన మోహన్‌లాల్‌కు సంబంధించిన ఏనుగు దంతాల కేసు మరో కీలక దశకు చేరుకుంది.

Update: 2026-07-06 09:13 GMT

మలయాళ సినీ పరిశ్రమలో అగ్ర నటుడిగా గుర్తింపు పొందిన మోహన్‌లాల్‌కు సంబంధించిన ఏనుగు దంతాల కేసు మరో కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే దశాబ్దానికి పైగా న్యాయపరమైన వివాదంలో కొనసాగుతున్న ఈ వ్యవహారంలో, ఆయన స్వచ్ఛందంగా చేసిన తాజా ఆస్తుల వెల్లడి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన వైల్డ్‌లైఫ్ అమ్నెస్టీ పథకం కింద తన వద్ద ఉన్న ఐవరీ వస్తువుల వివరాలను అధికారికంగా నమోదు చేయడం కేసు దిశను ప్రభావితం చేసే అంశంగా భావిస్తున్నారు.

మోహన్‌లాల్ సమర్పించిన వివరాల ప్రకారం, తన వద్ద మొత్తం 10 ఏనుగు దంతాలు, వాటితో రూపొందించిన 13 ఐవరీ విగ్రహాలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ విగ్రహాల్లో హిందూ దేవతలకు సంబంధించిన ప్రతిమలు కూడా ఉన్నాయని సమాచారం. అయితే ఈ వస్తువులన్నీ తనకు కుటుంబ వారసత్వంగా లేదా బహుమతుల రూపంలో అందాయని ఆయన గతం నుంచే చెబుతూ వస్తున్నారు. వన్యప్రాణులకు సంబంధించిన వస్తువుల చట్టపరమైన నిబంధనలపై పూర్తి అవగాహన లేదన్న వాదనను కూడా ఆయన తరఫు న్యాయవాదులు వినిపిస్తున్నారు.

ఈ కేసులో ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం వస్తువుల ఉనికి కంటే వాటి చట్టబద్ధమైన యాజమాన్యం. ఏనుగు దంతాలు ఎప్పటి నాటివి? అవి చట్టబద్ధంగా సంపాదించబడినవేనా? వాటికి అవసరమైన అనుమతులు, ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. అందుకే అటవీ శాఖ ఈ దంతాలు, విగ్రహాలపై డీఎన్ఏ టెస్టులు నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. అవసరమైతే డీఎన్ఏ విశ్లేషణ ద్వారా వాటి మూలాన్ని నిర్ధారించే ప్రక్రియ కూడా చేపట్టవచ్చని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

ఈ వివాదం 2011లో ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన సోదాల తర్వాత ప్రారంభమైంది. ఆ సమయంలో మోహన్‌లాల్ నివాసంలో బయటపడిన ఏనుగు దంతాల ఆధారంగా అటవీ శాఖ కేసు నమోదు చేసింది. అనంతరం ప్రభుత్వం కొన్ని దశల్లో మోహ‌న్‌లాల్ కు అనుకూలంగా వ్యవహరించేందుకు ప్రయత్నించినప్పటికీ, న్యాయస్థానాలు మాత్రం విచారణ కొనసాగాలని స్పష్టం చేశాయి. గతంలో జారీ చేసిన యాజమాన్య ధ్రువీకరణ పత్రాలపై కూడా కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రస్తుతం అమ్నెస్టీ పథకం కింద చేసిన స్వచ్ఛంద వెల్లడి మోహన్‌లాల్‌కు చట్టపరంగా ఎంతవరకు ఉపశమనం కలిగిస్తుందన్నదే ఆసక్తికర అంశంగా మారింది. ఈ పథకం ఉద్దేశం అక్రమంగా దాచిపెట్టిన వన్యప్రాణి సంబంధిత వస్తువులను అధికారుల ముందుకు తీసుకురావడమే అయినప్పటికీ, ఇప్పటికే కోర్టు విచారణలో ఉన్న కేసులపై దాని ప్రభావం ఎలా ఉంటుందన్నది న్యాయస్థానం తుది నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అంతిమంగా ఈ కేసు ఒక ప్రముఖ నటుడి వ్యక్తిగత వివాదంగా మాత్రమే కాకుండా, వన్యప్రాణి సంరక్షణ చట్టాల అమలు, వారసత్వంగా లభించిన ఐవరీ వస్తువుల చట్టబద్ధత, ప్రభుత్వ అమ్నెస్టీ పథకాల పరిధి వంటి కీలక అంశాలపై ఫ్యూచ‌ర్ లో మార్గనిర్దేశం చేసే కేసుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News