స్క్రీన్ టైమ్ కాదు.. ప్రెస్టీజ్ ముఖ్యం!
భారీ బడ్జెట్ సినిమాల్లో నటించే ప్రతి స్టార్‌కు ఎక్కువ స్క్రీన్ టైమ్ దక్కాల్సిందే అనేది తప్పనిసరి ఫార్ములా ఏమీ కాదు.
భారీ బడ్జెట్ సినిమాల్లో నటించే ప్రతి స్టార్‌కు ఎక్కువ స్క్రీన్ టైమ్ దక్కాల్సిందే అనేది తప్పనిసరి ఫార్ములా ఏమీ కాదు. ముఖ్యంగా పురాణ కథల ఆధారంగా రూపొందే మల్టీ స్టారర్ సినిమాల్లో పాత్రల ప్రాధాన్యం కథ అవసరాలకే పరిమితమవుతుంది. అయినప్పటికీ అలాంటి ప్రాజెక్ట్‌లో భాగమవడం చాలామంది నటీనటులు తమ కెరీర్‌లో స్పెషల్ మైల్‌స్టోన్ గా భావిస్తుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ విషయంలో కాజల్ అగర్వాల్ తీసుకున్న వైఖరి కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.
ఈ సినిమాలో మండోదరి క్యారెక్టర్ లో కనిపించనున్న కాజల్, తన పాత్రకు ఎక్కువ నిడివి ఉండదని స్వయంగా చెప్పడం ఆసక్తికర చర్చకు దారితీసింది. సాధారణంగా స్టార్ హీరోయిన్లు తమ క్యారెక్టర్ల గురించి రిలీజ్‌కు ముందే ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడరు. కానీ కాజల్ మాత్రం పాత్ర పరిమితిని దాచిపెట్టకుండా ముందుగానే చెప్పడం ద్వారా ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ను బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.
ఇటీవలి కాలంలో ఇదో కొత్త ప్రమోషనల్ ట్రెండ్‌గా మారుతోందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. సినిమా రిలీజ్ తర్వాత పాత్ర చిన్నదనే విమర్శలు రావడం కంటే, ముందే క్లారిటీ ఇవ్వడం వల్ల ఫ్యాన్స్ ను సిద్ధం చేయడం కొంతమంది నటీనటులు ఎంచుకుంటున్న స్ట్రాటజీగా మారుతోంది. దీంతో సినిమా రిలీజైన తర్వాత అనవసరమైన నిరాశ, సోషల్ మీడియా డిస్కషన్స్ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. మరోవైపు, కాజల్ కెరీర్‌ను పరిశీలిస్తే ఇది సహజమైన పరిణామంగానే కనిపిస్తోంది. ఎన్నో సంవత్సరాల పాటూ స్టార్ హీరోయిన్‌గా అగ్రహీరోలతో సక్సెస్‌ఫుల్ సినిమాలు చేసిన ఆమె, ఇప్పుడు క్యారెక్టర్ కు ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్ట్‌లను ఎంచుకునే దశలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. మార్కెట్ పరిస్థితులు, వయసు, పరిశ్రమలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్లే ప్రయత్నంగా దీనిని చూడవచ్చు.
అంతేకాదు, భారీ పాన్ ఇండియా సినిమాల్లో చిన్న పాత్రైనా నటిగా తన ప్రొఫైల్‌ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే ప్రాజెక్ట్‌లో భాగమవడం ద్వారా ఫ్యూచర్‌లో మరిన్ని ప్రతిష్ఠాత్మక అవకాశాలకు తలుపులు తెరుచుకునే అవకాశాలుంటాయి. అందుకే స్క్రీన్ టైమ్ కంటే సినిమా స్థాయి, దాని ప్రభావానికే చాలా మంది ప్రాధాన్యం ఇస్తుంటారు. సినీ హిస్టరీను పరిశీలించినా, కొద్ది నిమిషాల పాత్రలే ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కథలో బలమైన ముద్ర వేసే పాత్ర అయితే నిడివి పెద్దగా ప్రభావం చూపదనే విషయాన్ని అనేక సినిమాలు ఇప్పటికే ప్రూవ్ చేశారు. అందుకే పాత్ర ఎంతసేపు కనిపించింది అనే దానికంటే, ఎంత ఇంపాక్ట్ చూపిందన్నదే చివరికి ప్రేక్షకులు గుర్తుంచుకునే అంశంగా మారుతుంది.
కాజల్ కామెంట్స్ లో కూడా ఇదే ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. పాత్ర చిన్నదైనా, భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్ట్‌లో భాగమవడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు. అంటే ఆమె దృష్టిలో ఇది కేవలం మరో సినిమా మాత్రమే కాదు, తన కెరీర్‌లో ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చే ఛాన్స్ కూడా. రామాయణ రిలీజ్ తర్వాత మండోదరి పాత్రకు ఎంత స్క్రీన్ టైమ్ దక్కుతుందన్నదానికంటే, ఆ పాత్ర ప్రేక్షకులపై ఎంత ఇంపాక్ట్ చూపుతుందన్నదే అసలు పరీక్షగా మారనుంది.