అఖిల్ 'లెనిన్' బిజినెస్ ఇలా..!
సోషల్ మీడియాలో లెనిన్ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో లెనిన్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అంటూ కొన్ని లెక్కలు కనిపిస్తున్నాయి.
అఖిల్ అక్కినేని 'లెనిన్' సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 'ఏజెంట్' వంటి డిజాస్టర్ తర్వాత అఖిల్ నుంచి సినిమా అంటే సహజంగానే ప్రేక్షకుల్లో కాస్త అనుమానాలు ఉండటం ఖాయం. కానీ అఖిల్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఏళ్లు గ్యాప్ తీసుకుని, దాదాపుగా రెండేళ్లు కనీసం మీడియా ముందుకు రాకుండా, అభిమానులను కలువకుండా చేసిన మూవీ 'లెనిన్'. దాంతో లెనిన్‌పై అంచనాలు పెరిగాయి. అంతే కాకుండా లెనిన్ సినిమాను ప్రకటించినప్పటి నుంచి కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతూ వచ్చింది. అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారు అఖిల్ ఈసారి లెనిన్‌తో హిట్ కొట్టేలా ఉన్నాడు అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకే అన్ని ఏరియాల్లోనూ అఖిల్ మార్కెట్ రేంజ్‌ను మించి లెనిన్ బిజినెస్ చేసిందని బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
లెనిన్ ప్రీ రిలీజ్ బిజినెస్...
సోషల్ మీడియాలో లెనిన్ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో లెనిన్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అంటూ కొన్ని లెక్కలు కనిపిస్తున్నాయి. వాటిల్లో కొన్ని నమ్మదగ్గ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి తీసుకున్న లెక్కల ప్రకారం లెనిన్ సినిమా మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.30 కోట్లుగా తెలుస్తోంది. అఖిల్ గత చిత్రాలు తీవ్రంగా నిరాశ పరిచినప్పటికీ కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారా ఏకంగా రూ.30 కోట్లు బిజినెస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ మధ్య కాలంలో యంగ్ హీరోల సినిమాల బిజినెస్‌తో పోల్చితే అఖిల్ లెనిన్ మూవీ చేసిన బిజినెస్ చాలా బాగుంది అనేది విశ్లేషకుల మాట. థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.30 కోట్లు రావడంతో నిర్మాతకు చాలా పెద్ద రిలీఫ్‌గా చెప్పుకోవచ్చు. సినిమా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో రూ.35 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. సినిమాకు హిట్ టాక్ వస్తే ఆ రూ.35 కోట్లు పెద్ద కష్టం కాకపోవచ్చు అనేది కొందరి మాట.
అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రిలీజ్..
ఇండస్ట్రీ వర్గాల వారు, బాక్సాఫీస్ వర్గాల వారి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ లెనిన్ మూవీని నైజాం ఏరియా కి గాను దాదాపుగా రూ.8.5 కోట్లకు ప్రముఖ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసింది. అఖిల్ కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో నైజాంలో రూ.10 కోట్లు ఖాయం అని అంటున్నారు. ఇక ఆంధ్రాలో లెనిన్ సినిమాకు గాను 9 కోట్లకు కొనుగోలు చేయడం జరిగిందట. సీడెడ్‌లో సినిమాను నాలుగు కోట్లకు ప్రముఖ పంపిణీదారుడు కొనుగోలు చేశాడని సమాచారం అందుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.22 కోట్ల నుంచి రూ.23 కోట్ల వరకు లెనిన్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లెనిన్ విడుదల కాబోతుంది, అంతే కాకుండా ఓవర్సీస్‌లోనూ సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేయబోతున్నారు. అలా మొత్తంగా థియేట్రికల్ రైట్స్ ద్వారా అటు ఇటుగా లెనిన్ రూ.30 కోట్లకు చేరువ అయ్యిందని తెలుస్తోంది.
లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున...
ఈ రూ.30 కోట్లకు ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ ద్వారా వచ్చే మొత్తం అధనం అనే విషయం తెల్సిందే. నిర్మాతలకు లెనిన్ విడుదలకు ముందే దాదాపుగా రూ.50 కోట్లు తెచ్చి పెట్టి ఉంటుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. సినిమా హిట్ అయితే అప్పుడు ఈ నెంబర్స్ పూర్తిగా మారిపోయి నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టే అవకాశం ఉంది. అఖిల్‌కు జోడీగా ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ సినిమాను నాగవంశీ, నాగార్జున లు సంయుక్తంగా నిర్మించారు. జులై 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాతో అఖిల్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంటాడు అనే నమ్మకం ను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం సాధ్యం అయినంత వరకు కష్టపడ్డాడు అని, తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందని నాగార్జున ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. అందుకే లెనిన్ ఫలితం ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.