త్రిష కృష్ణన్ 100 కోట్ల సామ్రాజ్యం: 25 ఏళ్ల సినీ ప్రస్థానంలో అరుదైన మైలురాయి!
దక్షిణాది సినీ పరిశ్రమలో `ఎవర్ గ్రీన్ క్వీన్`గా వెలుగొందుతున్న త్రిష కృష్ణన్ తన 25 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో కేవలం నటిగానే కాకుండా ఒక బ్రాండ్‌గా ఎదిగారు.;
దక్షిణాది సినీ పరిశ్రమలో `ఎవర్ గ్రీన్ క్వీన్`గా వెలుగొందుతున్న త్రిష కృష్ణన్ తన 25 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో కేవలం నటిగానే కాకుండా ఒక బ్రాండ్‌గా ఎదిగారు. ప్రస్తుతం త్రిష నికర ఆస్తి విలువ సుమారు 100 కోట్ల రూపాయలకు చేరుకోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 1999లో `జోడి` చిత్రంతో సహాయ నటిగా ప్రయాణం మొదలుపెట్టిన త్రిష.. నేటికీ అగ్ర కథానాయికగా కొనసాగుతూ తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఒక నటిగా ఇన్ని దశాబ్దాల పాటు తన క్రేజ్‌ను కాపాడుకుంటూ ఆర్థికంగా ఇంతటి ఉన్నత స్థితికి చేరుకోవడం ఆమె పట్టుదలకు నిదర్శనం.
త్రిష ఆదాయ వనరులను పరిశీలిస్తే.. ఒక్కో సినిమాకు సుమారు 3 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. `పొన్నియిన్ సెల్వన్` వంటి భారీ విజయాల తర్వాత డిమాండ్ మరింత పెరిగింది. సినిమాలతో పాటు కార్పొరెట్ సంస్థల ప్రకటనల ద్వారా కూడా ఆమె భారీగానే ఆర్జిస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాలకు పైగా టాప్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. స్థిరమైన ఆదాయాన్ని గడించారు. ఈ సంపాదనను తెలివిగా వివిధ రంగాల్లో పెట్టుబడిగా మలిచారు.
త్రిష ఆస్తిపాస్తుల్లో ప్రధానమైనవి హైదరాబాద్ - చెన్నైలలోని విలాసవంతమైన నివాసాలు. ముఖ్యంగా చెన్నైలోని ఆమె సొంత ఇల్లు అత్యంత ఖరీదైన ఇంటీరియర్స్‌తో సకల సౌకర్యాలతో కూడి ఉంది. దీని విలువ దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. ఇవే కాకుండా.. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా భారీగా పెట్టుబడులు ఉన్నాయి. పలు నగరాల్లో విలువైన భూములు - వాణిజ్య సముదాయాల్లో భాగస్వామ్యం ఉండటం త్రిష ఆర్థిక భవిష్యత్తుకు మరింత భరోసాగా నిలిచాయి.
విలాసవంతమైన జీవనశైలికి మారుపేరైన త్రిషకు లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టం. గ్యారేజీలో బిఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. కేవలం భౌతిక సంపాదనే కాకుండా..జంతు సంరక్షణ .. పలు సేవా కార్యక్రమాల కోసం తన సంపాదనలో కొంత భాగాన్ని వెచ్చిస్తూ సమాజం విషయంలో తన బాధ్యతను చాటుకుంటున్నారు. త్రిష లైఫ్ స్టైల్ నేటి తరం యువ నటీమణులకు ఒక రోల్ మోడల్‌గా నిలుస్తోంది.
వృత్తిపరమైన ఒడిదుడుకులు ఎదురైనా.. వ్యక్తిగత జీవితంలో ఎన్ని విమర్శలు వచ్చినా కుంగిపోకుండా తన కెరీర్‌ను విజయవంతంగా మలుచుకున్న త్రిష ప్రయాణం స్ఫూర్తిదాయకం. 40 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తూ..మరోవైపు వంద కోట్ల ఆస్తిని కూడబెట్టడం చూస్తుటే.. త్రిష వృత్తి గతంగా చూపే అంకితభావానికి ప్రతిఫలం.