థియేటర్లో కన్నీళ్లు.. ఓటీటీలో ఆనందం!

అయితే, ఆ దర్శకుడి కన్నీళ్లకు ఇప్పుడు సమాధానం దొరికింది. థియేటర్లలో ఆడియన్స్‌ను రీచ్ అవ్వడంలో విఫలమైన 'బార్బరిక్' చిత్రం, ఇప్పుడు ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.;

Update: 2025-10-21 11:23 GMT

కొన్ని రోజుల క్రితం, 'బార్బరిక్' సినిమా దర్శకుడు మోహన్ శ్రీవత్స చెప్పుతో కొట్టుకున్న వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాను ఎంతో కష్టపడి తీసిన సినిమాను థియేటర్లలో జనం చూడటం లేదని, మంచి సినిమాను ఆదరించడం లేదంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పిన మాట ప్రకారం, సినిమా ఆడనందుకు తనను తానే చెప్పుతో కొట్టుకుని ఒక వీడియో విడుదల చేయడం పెద్ద దుమారమే రేపింది.

అయితే, ఆ దర్శకుడి కన్నీళ్లకు ఇప్పుడు సమాధానం దొరికింది. థియేటర్లలో ఆడియన్స్‌ను రీచ్ అవ్వడంలో విఫలమైన 'బార్బరిక్' చిత్రం, ఇప్పుడు ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఆనాడు కన్నీళ్లు పెట్టుకున్న ఆ దర్శకుడే, ఇప్పుడు ఆనందంతో ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ మరో వీడియోను రిలీజ్ చేశారు.

ఈ కొత్త వీడియోలో మోహన్ శ్రీవత్స ఎంతో సంతోషంగా కనిపించారు. "అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీరందరూ 'బార్బరిక్'ను అమెజాన్ ప్రైమ్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలబెట్టారు. నాకు ఎన్నో కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి" అని ఆనందంగా చెప్పారు. అతని మాటల్లో ఒక రకమైన సంతృప్తి స్పష్టంగా కనిపించింది.

థియేటర్లలో మిస్ అయినందుకు చాలామంది సారీ చెబుతున్నారని, కానీ అందులో ప్రేక్షకుల తప్పు లేదని మోహన్ శ్రీవత్స అన్నారు. "మేమే మిమ్మల్ని కరెక్ట్ టైమ్‌లో రీచ్ అవ్వలేకపోయాం. ఆ టైమ్‌లో నేను ఎమోషనల్ అవ్వడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి" అని పాత సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఒక కళాకారుడికి, తన సినిమా ఏ ప్లాట్‌ఫామ్‌లో అయినా ఎక్కువ మంది చూసినప్పుడే అసలైన ఆనందం దొరుకుతుందని అన్నారు.

"ఈ రోజు నేను ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. గత 10, 11 రోజులుగా నా సినిమా ట్రెండింగ్‌లో ఉంది" అని చెబుతూ, ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులకు నచ్చిందని అర్థమైందని అన్నారు.

చివరగా, ప్రేక్షకులను ఒక చిన్న కోరిక కోరారు. "ఇంకా సినిమా చూడని వాళ్లు ఉంటే దయచేసి చూడండి. చూసి, మీకు నచ్చితే, మరో పది మందికి చెప్పి ఎంకరేజ్ చేయండి" అని మోహన్ శ్రీవత్స రిక్వెస్ట్ చేశారు.

Tags:    

Similar News