సౌత్ ఉత్తమ దర్శకులలో అత్యుత్తమ దర్శకుడు ఎవరు?
ఈ విజేతల జాబితా చూస్తుంటే.. 2025-26 సంవత్సరంలో దక్షిణాది సినిమా కథాబలమున్న చిత్రాలకు.. కమర్షియల్ బ్లాక్‌బస్టర్లకు సమానంగా ప్రాధాన్యతనిచ్చిందని అర్థమవుతోంది.;
70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2026 వేడుకలో నాలుగు దక్షిణాది భాషలకు సంబంధించిన ఉత్తమ దర్శకుల వివరాలు ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా తమిళంలో ఇద్దరు దర్శకుల మధ్య టై అవ్వడం ఈ వేడుకలోనే ఒక ప్రత్యేకత కాగా, పుష్ప ఫ్రాంఛైజీతో కమర్షియల్ సినిమా గురువు అని నిరూపించిన సుకుమార్ టాలీవుడ్ నుంచి అగ్ర తాంబూలం అందుకోవడం ఆసక్తిని కలిగించింది.
తమిళం విభాగంలో పి.ఎస్. వినోద్‌రాజ్ తన రా అండ్ రస్టిక్ మేకింగ్ స్టైల్‌తో కొట్టుక్కాలికి... అలాగే రాజ్‌కుమార్ పెరియసామి దేశభక్తి - భావోద్వేగాల మేళవింపుతో `అమరన్` చిత్రానికి సంయుక్తంగా ఫిలంఫేర్ అవార్డును షేర్ చేసుకున్నారు. మలయాళం నుంచి మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ `బ్రహ్మయుగం` కు గాను రాహుల్ సదాశివన్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు. కన్నడం నుంచి సామాజిక అంశాల నేపథ్యంలో సాగే `హదినెలెంటు` చిత్రానికి పృథ్వీ కొననూర్ తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్నారు. అదే సమయంలో పుష్ప : ది రూల్ (పుష్ప2) చిత్రాన్ని అత్యంత ప్రతిభావంతంగా తెరకెక్కించిన సుకుమార్ ఉత్తమ దర్శకుల జాబితాలో అత్యంత ఆకర్షణీయమైన దర్శకుడిగా అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ విజేతల జాబితా చూస్తుంటే.. 2025-26 సంవత్సరంలో దక్షిణాది సినిమా కథాబలమున్న చిత్రాలకు.. కమర్షియల్ బ్లాక్‌బస్టర్లకు సమానంగా ప్రాధాన్యతనిచ్చిందని అర్థమవుతోంది. మమ్ముట్టి `బ్రహ్మయుగం`, శివకార్తికేయన్ `అమరన్`లు క్లాసిక్స్ గా నిలిచాయి. ఈ సినిమాల్లో మమ్ముట్టి, శివకార్తికేయన్ ల నట ప్రదర్శనకు గొప్ప గౌరవం దక్కింది.
ఫిలింఫేర్ 2026 అవార్డులలో హవా చాటిన...కొట్టుక్కాలికి, అమరన్, హదినెలెంటు, బ్రహ్మయుగం, పుష్ప -ది రూల్..
ఈ నాలుగు సినిమాల కథల్ని, కమర్షియల్ అంశాలను, లేదా ఇంకేదైనా ప్రత్యేకత ఏం ఉందో విశ్లేషిస్తే.. 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2026లో తమ సత్తా చాటిన ఈ ఐదు చిత్రాలు దక్షిణాది సినిమా వైవిధ్యాన్ని, ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పాయి.
పుష్ప 2: ది రూల్ (తెలుగు)
ఈ సినిమా కథాంశాన్ని పరిశీలిస్తే.. ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రపంచానికి రాజుగా ఎదిగిన `పుష్పరాజ్` తన సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు? తన శత్రువైన ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాసిల్) తో తలపడి ఎలా పైచేయి సాధించాడు? అనేదే ఈ చిత్ర కథ. ఇది కేవలం సినిమా కాదు.. ఒక బాక్సాఫీస్ సునామీ. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసి భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయింది. అల్లు అర్జున్ మేనరిజమ్స్, దేవిశ్రీ ప్రసాద్ మాస్ మ్యూజిక్ , సుకుమార్ టేకింగ్ ఈ సినిమాను ఒక గ్లోబల్ బ్రాండ్‌గా మార్చాయి.
అమరన్ (తమిళం):
ఇది భారత సైనిక వీరుడు, అశోక చక్ర గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత కథ. దేశం కోసం ఆయన చేసిన ప్రాణత్యాగం, ఆయన భార్య ఇందు రెబెక్కా వర్గీస్‌తో ఆయనకున్న ప్రేమానుబంధాన్ని ఈ సినిమా హృద్యంగా చూపించింది. శివకార్తికేయన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.340 కోట్లకు పైగా వసూళ్లతో తమిళంలో 2024-25 టాప్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. యాక్షన్ సన్నివేశాలతో పాటు సాయి పల్లవి, శివకార్తికేయన్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కన్నీరు పెట్టించాయి.
బ్రహ్మయుగం (మలయాళం):
ఈ సినిమా కథ ఆద్యంతం ఆసక్తికరం. 17వ శతాబ్దపు మలబార్ నేపథ్యంలో సాగే హారర్ థ్రిల్లర్. దారి తప్పిన ఒక జానపద గాయకుడు (తేవన్) ఒక పాత కాలపు రాజభవనంలో చిక్కుకోవడం.. అక్కడ ఉండే మాయావి కొడుమన్ పొట్టి (మమ్ముట్టి) నుంచి తప్పించుకోవడమే ఈ కథ. ఇది ఒక ఎక్స్‌పెరిమెంటల్ హిట్. మలయాళ సినిమా మేకింగ్ స్థాయిని ప్రపంచానికి చూపించి.. భారీ లాభాలను తెచ్చిపెట్టింది. సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్‌లో ఉండటం దీని అతిపెద్ద సాహసం. మమ్ముట్టి నటన చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఇది అధికారం, కుల వివక్షపై ఒక గూఢార్థంతో కూడిన కథ.
కొట్టుక్కాలి (తమిళం):
వేరే కులం అబ్బాయిని ప్రేమించిందన్న కోపంలో తన కూతురికి దెయ్యం పట్టిందని భ్రమించే ఒక తండ్రి ఆమెను మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్లే ప్రయాణమే ఈ సినిమా. పితృస్వామ్య వ్యవస్థపై ఇది ఒక నిశిత విమర్శ. ఇది కమర్షియల్ సినిమాల కంటే విమర్శకుల మెప్పు పొందిన చిత్రం. అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో (బెర్లిన్ ఫెస్టివల్స్ ) ప్రశంసలు అందుకుంది. ఇందులో నేపథ్య సంగీతం (బీజీఎం) ఉండదు. కేవలం సహజ సిద్ధమైన శబ్దాలతో సినిమా సాగుతుంది. నటుడు సూరి తన కామెడీ ఇమేజ్‌ను మార్చుకుని చేసిన సీరియస్ రోల్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
హదినెలెంటు (కన్నడ):
ఇద్దరు టీనేజర్ల ప్రైవేట్ వీడియో లీక్ అయినప్పుడు సమాజం, చట్టం, కుల వివక్ష వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయనేది ఈ చిత్ర సారాంశం. `హదినెలెంటు` అంటే కన్నడలో 18 అని అర్థం. చిన్న బడ్జెట్‌తో రూపొంది ఓటీటీలో అలాగే థియేటర్లలో విపరీతమైన ఆదరణ పొందింది. కాలేజీ గొడవలు, కుల వివక్ష, మన దేశపు న్యాయ వ్యవస్థలోని లోపాలను ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.
ఈ ఐదు సినిమాలు చూస్తే దక్షిణాది సినిమా ఇప్పుడు కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా, ప్రయోగాత్మక కథలతో కూడా మెప్పిస్తోందని స్పష్టమవుతోంది. అదే సమయంలో ఆయా సినిమాలను తెరకెక్కించిన దర్శకుల విజన్ కూడా ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా కమర్షియల్ ఫార్మాట్ లో బంపర్ హిట్టును తెరకెక్కించి, వాణిజ్య పంథా సినిమాతో కూడా అవార్డులను రివార్డులను సొంతం చేసుకోవచ్చని నిరూపించిన తెలుగు దర్శకుడు సుకుమార్ పనితనాన్ని ప్రపంచం గుర్తించింది. అందుకే ఈ ప్రత్యేక సమయంలో అతడికి దక్కిన ఈ గౌరవం చూస్తుంటే, కమర్షియల్ ఫార్మాట్ సినిమాకి గురువుగా భివర్ణిస్తే తప్పేమీ లేదు. ఎందుకంటే నిర్మాతను సంతోషంగా ఉంచే లేదా సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తేలా అతడు 1800 కోట్ల వసూళ్లను అందించిన ఘనుడిగా చరిత్రకెక్కాడు. భారతదేశంలో ఎస్.ఎస్.రాజమౌళి, ప్రశాంత్ నీల్ తరహాలో ఈ స్థాయి వసూళ్లను అందించగల సత్తా తనకు కూడా ఉందని సుకుమార్ నిరూపించాడు.