థియేటర్ల పర్సెంటేజ్ పంచాయితీ ఏం తేల్చుతారు?
తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల పర్సంటేజ్ -అద్దెల వివాదం రోజురోజుకూ ముదురుతోంది.
తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల పర్సంటేజ్ -అద్దెల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఒకవైపు ఎగ్జిబిటర్లు, మరోవైపు నిర్మాతలు ఎవరి వాదనలకు వారు కట్టుబడి ఉండటంతో వ్యవహారంలో ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు. ముఖ్యంగా 2026లో విడుదలయ్యే చిత్రాలకు సంబంధించి ఏ విధానాన్ని అమలు చేయాలనే దానిపై ఇండస్ట్రీలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత తరుణంలో పంచాయితీ ఏ తీరానికి చేరుతుందనేది? అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ వివాదానికి ప్రధాన కారణం సంప్రదాయ అద్దె (రెంటల్) విధానం .. కొత్తగా ప్రతిపాదిస్తున్న `పర్సంటేజ్ సిస్టం మధ్య ఉన్న వ్యత్యాసమే. ఇన్నేళ్లుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా ఆడినా? ఆడకపోయినా? ఎగ్జిబిటర్లు ముందుగా మాట్లాడుకున్న ఫిక్స్‌డ్ అద్దెను నిర్మాతలకు లేదా డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించాల్సి వచ్చేది. అయితే మల్టీప్లెక్స్‌ల తరహాలో వసూలైన టికెట్ డబ్బుల్లో వారం వారీగా వాటాలు పంచుకునే పర్సంటేజ్ విధానాన్ని సింగిల్ స్క్రీన్లలోనూ అమలు చేయాలని యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి.
అయితే నిర్మాతలు మాత్రం ఎగ్జిబిటర్ల డిమాండ్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా 2026లో రాబోయే చిత్రాలకు పర్సంటేజ్ విధానం ఏమాత్రం వద్దని దానివల్ల తమకు కచ్చితమైన ఆదాయం ఉండదని వారు వాది స్తున్నారు. సినిమా ఫ్లాప్ అయితే పర్సంటేజ్ విధానంలో నిర్మాతలకు వచ్చే షేర్ దారుణంగా పడిపోతుందని, కనుక పాత అద్దె విధానమే శ్రీరామరక్ష అని ప్రొడ్యూసర్స్ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ఎగ్జిబిటర్లు తమ కష్టాలను ఏకరువు పెడుతున్నారు. థియేటర్ల నిర్వహణ ఖర్చులు, కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతాలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఫిక్స్‌డ్ అద్దెలు కట్టడం తమ వల్ల కాదని తేల్చి చెబుతున్నారు. సినిమా పరాజయం పాలైతే థియేటర్ల యజమానులు జేబులోంచి డబ్బులు తీసి అద్దెలు కట్టాల్సిన దుస్థితి వస్తోందని అందుకే సినిమా వసూళ్లలో మొదటి వారం 60 శాతం, రెండవ వారం 50 శాతం చొప్పున పర్సంటేజ్ వాటా ఇవ్వాలని కోరుతున్నారు.
ఈ ప్రతిష్ఠంభనను తొలగించేందుకు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు రంగంలోకి దిగారు. త్వరలోనే థియేటర్ల అద్దెలపై స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తామని చెబుతున్నారు. దీనిలో భాగంగా ఎగ్జిబిటర్లు కొత్త ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నారు. అన్ని సినిమాలకు ఒకే రూల్ కాకుండా.. సినిమాలో నటించే హీరో స్టార్ డమ్, సినిమా నిర్మాణ బడ్జెట్ ఆధారంగా అద్దెలను లేదా పర్సంటేజీలను శాస్త్రీయంగా నిర్ణయించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఈ రెంటల్ ..పర్సంటేజ్ వివాదం ఆర్థిక లావాదేవీలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది మొత్తం సినీ పరిశ్రమ మనుగడనే ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే పెరిగిన టికెట్ ధరలు, ఓటీటీల ప్రభావంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు పట్టింపులకు పోయి సినిమాల ప్రదర్శనను నిలిపివేస్తే అది ఇండస్ట్రీకే తీరని నష్టం చేకూరుస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
సమస్య పరిష్కారానికి నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఇద్దరూ పట్టువిడుపులు ప్రదర్శించి మధ్యేమార్గాన్ని ఎంచుకోవడం అత్యవసరం. కేవలం ఆదాయ పంపకాలపైనే కాకుండా కంటెంట్ నాణ్యత, థియేట్రికల్ విండో పెంపు వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాలి. హీరో, బడ్జెట్ ప్రాతిపదికన రాబోయే ఈ కొత్త అద్దె విధానమైనా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండి 2026 ముగింపు నాటికి పంచాయితీ ఓ కొలిక్కి వస్తుందో లేదో చూడాలి.