టాలీవుడ్: ఈసారి సమ్మర్ హీట్ ఎలా ఉండబోతోంది?

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సందడి ముగియగానే అందరి దృష్టి ఇప్పుడు సమ్మర్ 2026 పై పడింది.;

Update: 2026-01-22 07:19 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సందడి ముగియగానే అందరి దృష్టి ఇప్పుడు సమ్మర్ 2026 పై పడింది. ఈసారి వేసవి సెలవులను క్యాష్ చేసుకోవడానికి అరడజనుకు పైగా భారీ చిత్రాలు క్యూ కట్టాయి. పవన్ కళ్యాణ్ నుంచి నిఖిల్ సిద్ధార్థ్ వరకు ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఈ ఏడాది సమ్మర్ లైనప్ చూస్తుంటే, ఆడియన్స్‌కు ఒక ఊపిరి సలపని యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ట్రీట్ దొరకడం ఖాయంగా కనిపిస్తోంది.

మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఏప్రిల్ రిలీజ్ విండోను లాక్ చేసుకుంది. హరీష్ శంకర్ మార్క్ డైలాగులు, పవన్ కళ్యాణ్ మాస్ మేనరిజమ్స్ తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారంటీ. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' కూడా సమ్మర్ రేసులోనే ఉంది. భారీ వీఎఫ్ఎక్స్ సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా కూడా ఏప్రిల్ లేదా మే లో థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది.

యంగ్ హీరోలు కూడా ఈసారి గట్టిగానే ప్లాన్ చేశారు. సాయి దుర్గ తేజ నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా 'సంబరాల ఏటీగట్టు' మార్చి 14న రిలీజ్ కాబోతోంది. అదేవిధంగా నిఖిల్ సిద్ధార్థ్ 'స్వయంభూ' ఫిబ్రవరి 13న లేదా మార్చి చివర్లో తన గర్జన వినిపించడానికి సిద్ధమవుతోంది. చారిత్రక నేపథ్యంలో వస్తున్న సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయి ప్రభావం చూపిస్తుందోనని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

వీటితో పాటు మరికొన్ని వెరైటీ ప్రాజెక్టులు కూడా ఈ సమ్మర్ రేసులో ఉన్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'టైసన్ నాయుడు' ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే వరుణ్ తేజ్ ఇండో కొరియన్ హారర్ కామెడీ 'కొరియన్ కనకరాజు' సమ్మర్ రిలీజ్‌గా తన టైటిల్ గ్లిమ్స్‌తో ఇప్పటికే క్రేజ్ సంపాదించుకుంది. మేర్లపాక గాంధీ మార్క్ కామెడీ ఈసారి కొరియన్ బ్యాక్ డ్రాప్‌లో ఎలా ఉంటుందో చూడాలి.

నాగ చైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్‌లో వస్తున్న థ్రిల్లర్ 'వృషకర్మ' కూడా ఫిబ్రవరి లేదా మార్చి నాటికి రిలీజ్ ప్లాన్ చేస్తోంది. సుకుమార్ రైటింగ్స్ తో వస్తున్న ఈ సినిమాపై యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా ఒకరి వెనుక ఒకరు సమ్మర్ డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఈ పోటీలో ఎవరు బాక్సాఫీస్ దగ్గర నిలబడతారో, ఎవరు ఆడియన్స్ మనసు గెలుచుకుంటారో చూడాలి. 2026 వేసవి టాలీవుడ్‌కు ఒక పెద్ద పండగలా మారబోతోంది. భారీ బడ్జెట్ సినిమాలు, వైవిధ్యమైన కథలతో థియేటర్లు కళకళలాడనున్నాయి. సంక్రాంతి తర్వాత వచ్చే ఈ అతిపెద్ద రిలీజ్ సీజన్ లో ఏ సినిమా ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News