గౌర‌వ‌నీయ ముఖ్య‌మంత్రి CNBకి అల్లు బ్ర‌ద‌ర్స్ థాంక్స్

ముఖ్యమంత్రి చంద్రబాబు అల్లు కుటుంబంతో సుమారు గంటసేపు ముచ్చటించినట్లు సమాచారం.;

Update: 2026-03-15 08:24 GMT

అల్లు కుటుంబంలో ఇటీవల జరిగిన వివాహ వేడుకలు సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అల్లు శిరీష్- నయనికల వివాహం ఓ ప్ర‌యివేట్ వెన్యూలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుక ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ నివాసానికి వెళ్లడం విశేషం. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా.. తీరికలేని షెడ్యూల్ మధ్య అల్లు వారి ఇంటికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించడం అందరినీ ఆకట్టుకుంది.

సీఎం రాక‌పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆ సమయంలో తాను విదేశాల్లో ఉన్నందున వ్యక్తిగతంగా కలవలేకపోయానని.. అయితే ఫోన్ ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడటం సంతోషాన్ని ఇచ్చిందని బన్నీ పేర్కొన్నారు. ``మా సోదరుడు శిరీష్, నయనికలను ఆశీర్వదించడానికి మా ఇంటికి విచ్చేసినందుకు గౌరవనీయ సీఎం చంద్రబాబు గారికి ధన్యవాదాలు. మీ ఆత్మీయత, ఆశీస్సులు మా కుటుంబానికి ఎంతో విలువైనవి`` అంటూ తన ఎక్స్‌ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.

మరోవైపు నవ వరుడు అల్లు శిరీష్ సైతం తన ఇన్‌స్టా వేదికగా ముఖ్యమంత్రి పర్యటన ఆశీర్వాదం పై హర్షం వ్యక్తం చేశారు. ఇది తన జీవితంలో అత్యంత గౌరవప్రదమైన, చిరస్మరణీయమైన అనుభవమని శిరీష్‌ పేర్కొన్నారు. దశాబ్దాలుగా తాను ఆరాధించే దార్శనిక నాయకుడు చంద్రబాబు గారు తమ ఇంటికి రావడం ఒక గౌరవంగా భావిస్తున్నానని శిరీష్ రాసుకొచ్చారు. కేవలం ఆశీర్వదించడమే కాకుండా.. తమ కుటుంబంతో కలిసి గడిపిన సమయం ఎంతో విజ్ఞానాన్ని ఇచ్చిందని ఆయన వెల్లడించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు అల్లు కుటుంబంతో సుమారు గంటసేపు ముచ్చటించినట్లు సమాచారం. ఈ సుదీర్ఘ సంభాషణలో ఆయన తన రాజకీయ అనుభవాలను, భవిష్యత్తు విజన్ గురించి వెల్ల‌డించార‌ని శిరీష్ పేర్కొన్నారు. ఒక గొప్ప నాయకుడితో గడిపిన ఆ గంట కాలంలో తాను ఎంతో నేర్చుకున్నానని.. ఆయన ఆలోచనా విధానం స్ఫూర్తిదాయకమని శిరీష్ కొనియాడారు. ఈ మేరకు చంద్రబాబుతో కలిసి దిగిన ఫోటోలను ఆయన నెట్టింట షేర్ చేసారు.

అల్లు అరవింద్ కుటుంబానికి.. చంద్రబాబు నాయుడికి మధ్య దశాబ్దాల కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయాలు ఎలా ఉన్నా వ్యక్తిగత బంధాలకు చంద్రబాబు ఇచ్చే ప్రాముఖ్యతను ఈ పర్యటన మరోసారి నిరూపించింది. గతంలో కూడా అల్లు కుటుంబంలో జరిగిన పలు శుభకార్యాలకు ఆయన హాజరయ్యారు. ఇప్పుడు మళ్ళీ అదే అనుబంధాన్ని కొనసాగిస్తూ.. కొత్తగా పెళ్లైన జంటను ఆశీర్వదించడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మొత్తానికి అల్లు అర్జున్- శిరీష్ బ్రదర్స్ ఇద్దరూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ పెట్టిన పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ దిగ్గజాలు, సినీ స్టార్స్ మధ్య ఉండే ఇలాంటి ఆత్మీయ కలయికలు అభిమానులకు కూడా కనువిందు చేస్తున్నాయి. కొత్త దంపతులకు ముఖ్యమంత్రి ఆశీస్సులు లభించడంపై అల్లు ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News