ప్రముఖ నిర్మాతపై కార్మిక ఫెడరేషన్ గుస్సా
కొద్దిరోజులుగా ఫెడరేషన్ సమ్మెతో షూటింగులు స్థంభించిపోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం సీరియస్ గా మారడంతో నిర్మాతల కంటికి కునుకుపట్టడం లేదు.;
కొద్దిరోజులుగా ఫెడరేషన్ సమ్మెతో షూటింగులు స్థంభించిపోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం సీరియస్ గా మారడంతో నిర్మాతల కంటికి కునుకుపట్టడం లేదు. చాలా మంది మొత్తం షెడ్యూళ్లు తారుమారయ్యాయని ఆవేదన చెందుతున్నారు. త్వరగా సినీపెద్దలు ఏదో ఒక పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నారు.
అయితే ఫిలింఛాంబర్ పెద్దల ప్రతిపాదనలను కార్మిక ఫెడరేషన్ వినే పరిస్థితి కనిపించడం లేదు. ఫెడరేషన్ 30 శాతం పెంపు నియమాన్ని అందరు కార్మికులకు సమానంగా వర్తింపజేయాలని కోరుకుంటోంది. డ్యాన్సర్స్, ఫైటర్స్ సహా ఇతర టెక్నీషియన్లు అందరికీ దీనిని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. యూనియన్లను విభజించి పాలిస్తామంటే కుదరదని హుకుం జారీ చేసారు.
అయితే ఫిలింఛాంబర్‌తో మంతనాలు సాగించేందుకు తమకు అభ్యంతరాలేవీ లేవని కూడా ఫెడరేషన్ అధ్యక్షుడు అనీల్ వల్లభనేని తాజా మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. కోర్టు పరమైన ఇబ్బందులేవైనా ఉంటే తమ న్యాయవాదులు దీనిని చూసుకుంటారని కూడా వ్యాఖ్యానించారు. పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ తమ కార్మికులకు 90లక్షలు బకాయి పడ్డారని, దానిని చెల్లించాలని ఈ సందర్భంగా అన్నారు. ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని మా కార్మికులు కోరుకుంటున్నారని కూడా వ్యాఖ్యానించారు. నిర్మాతలు ఎవరైనా ఇబ్బంది ఉంటే ఛాంబర్ కి చెప్పుకోవాలి కానీ ఎలా పడితే అలా మాట్లాడకూడదని కూడా అన్నారు.
చిరంజీవి గారు ఎప్పటికప్పుడు మా నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కార్మికుల తరపున నిలిచినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వపెద్దలు ఇన్వాల్వ్ అయితే వారు కొన్ని సూచనలు చేస్తారు. ఏదైనా ఛాంబర్ నిర్ణయం ఫైనల్.. అని కూడా ఫెడరేషన్ అధ్యక్షుడు అన్నారు. మాకు 24000 మంది కార్మికుల బలం ఉంది. అవసరమైతే ఆమరణ నిరాహార ధీక్ష చేస్తాం. ఛాంబర్ పిలిస్తే వెళ్లి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని కూడా అధ్యక్షుడు అనీల్ వల్లభనేని అన్నారు.
ఫెడరేషన్ అధ్యక్షకార్యదర్శులు, కోశాధికారికి నిర్మాత విశ్వప్రసాద్ ఇంతకుముందు లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఫెడరేషన్ సమ్మె కారణంగా నిర్మాతలకు రోజుకు కోటిన్నర నష్టం వాటిల్లుతోందని ఆ ముగ్గురికీ నోటీసులు పంపడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా చట్టపరమైన సమస్యల్ని తమ న్యాయవాదులు చూసుకుంటారని అనీల్ వల్లభనేని కౌంటర్ ఇవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు వచ్చింది.