మల్టీప్లెక్స్ థియేటర్ల వ్యాపారంలో టాప్ -5 టాలీవుడ్ స్టార్స్
మరోవైపు మాస్ మహారాజా రవితేజ దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో ఏషియన్ గ్రూప్‌తో కలిసి `ఏఆర్‌టీ సినిమాస్`ను ప్రారంభించి ఎగ్జిబిషన్ బిజినెస్‌లో తన ఉనికిని చాటుకున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు కేవలం వెండితెరపై నటనకే పరిమితం కాకుండా.. తమ సంపాదనను వ్యూహాత్మకంగా వ్యాపార రంగంలోకి మళ్లిస్తున్నారు. ముఖ్యంగా సినిమా నిర్మాణంతో పాటు అత్యాధునిక మల్టీప్లెక్స్ బిజినెస్‌లో భాగస్వాములుగా మారుతూ ఎగ్జిబిషన్ రంగాన్ని శాసిస్తున్నారు. అభిమానులకు కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా... బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్తూ వ్యాపారవేత్తలుగానూ తమ ముద్ర వేస్తున్నారు.
తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోలు పూర్తి స్థాయిలో మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టే ఈ కొత్త ట్రెండ్‌కు సూపర్‌స్టార్ మహేష్ బాబు శ్రీకారం చుట్టారు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్ కొండాపూర్- గచ్చిబౌలి సరిహద్దుల్లో అతడు నిర్మించిన `ఏఎంబీ సినిమాస్` దేశంలోనే అత్యుత్తమ మల్టీప్లెక్స్‌లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా హైదరాబాద్ సహా పలు నగరాలలో మహేష్ ఇదే తీరుగా ఏఎంబి మల్టీప్లెక్సుల నిర్మాణంలో బిజీగా ఉన్నారు. ఇదే బాటలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అమీర్‌పేట్‌లోని ఐకానిక్ సత్యం థియేటర్ స్థానంలో `ఏఏఏ సినిమాస్` ను ప్రారంభించగా, యంగ్ హీరో విజయ్ దేవరకొండ మహబూబ్‌నగర్‌లో `ఏవిడి సినిమాస్`ను నెలకొల్పి ద్వితీయ శ్రేణి నగరంలోనూ మల్టీప్లెక్స్ అనుభూతిని అందించారు.
మరోవైపు మాస్ మహారాజా రవితేజ దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో ఏషియన్ గ్రూప్‌తో కలిసి `ఏఆర్‌టీ సినిమాస్`ను ప్రారంభించి ఎగ్జిబిషన్ బిజినెస్‌లో తన ఉనికిని చాటుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి `మాన్ ఆఫ్ మాసెస్` జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరబోతున్నారు. హైదరాబాద్ ఐటీ కారిడార్ అయిన గచ్చిబౌలి ప్రాంతంలో ఏషియన్ గ్రూప్‌తో కలిసి ఒక భారీ లగ్జరీ మల్టీప్లెక్స్‌ను నిర్మించేందుకు తారక్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నటులు బ్రాండ్ అంబాసిడర్లుగా మల్టీప్లెక్స్ భాగస్వాములుగా మారుతుండగా.. దశాబ్దాలుగా ఎగ్జిబిషన్ - పంపిణీ రంగాన్ని తమ గుప్పిట్లో ఉంచుకున్న దిగ్గజాలు కొందరు ఉన్నారు. టాలీవుడ్ థియేటర్ వ్యాపారంలో ఏషియన్ సునీల్ నారంగ్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్‌లను నిర్మించారు. అలాగే డి. సురేష్ బాబు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో థియేటర్లను- లీజ్ నెట్‌వర్క్‌ను నడుపుతూ పంపిణీ రంగాన్ని ఏలుతున్నారు.
అదేవిధంగా దిల్ రాజు నైజాం పరిధిలో సగానికి పైగా థియేటర్ నెట్‌వర్క్‌ను, డిస్ట్రిబ్యూషన్‌ను శాసిస్తూ మల్టీప్లెక్స్‌ల లీజింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటు విక్టరీ వెంకటేష్ సహా పలువురు సీనియర్ స్టార్స్ కూడా భాగస్వామ్యాలు- స్టూడియోల ద్వారా ఈ వినోద వ్యాపారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలా టాలీవుడ్ ప్రముఖులు ఎగ్జిబిషన్ రంగాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నారు.