మహేష్ బాబుతో బంధుత్వం.. విజయనగరంతో అనుబంధం.. 'సహజనటి' సీక్రెట్స్!
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుతో తనకు ప్రత్యేకమైన బంధుత్వం ఉందని జయసుధ తెలిపారు.
టాలీవుడ్ లో `సహజనటి`గా దశాబ్దాల పాటు తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటి జయసుధ వ్యక్తిగత జీవితం - పరిశ్రమ బంధుత్వాలు- సినీ ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తాజాగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ఉన్న బంధుత్వం నుండి తన బాల్యపు జ్ఞాపకాల వరకు ఎన్నో విషయాలను జయసుధ తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రత్యేకించి తన మూలాలు ముడిపడి ఉన్న విజయనగరంతో ఉన్న అనుబంధాన్ని ఈ సీనియర్ నటి ఎంతో మధురంగా గుర్తుచేసుకున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుతో తనకు ప్రత్యేకమైన బంధుత్వం ఉందని జయసుధ తెలిపారు. ఘట్టమనేని కుటుంబానికి చెందిన దివంగత ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల తనకు మేనత్త (పిన్ని) అవుతారని ఆమె వెల్లడించారు. చిన్నతనంలో విజయనిర్మల షూటింగ్‌లకు వెళ్లడం.. ఆమె వేసుకునే మేకప్, హెయిర్‌స్టైల్ .. నటనను దగ్గరుండి గమనించడం వల్లే తనలో సినిమాలపై ఆసక్తి విపరీతంగా పెరిగిందని చెప్పారు. ఆ రోజుల్లో మేనత్తలాగే డ్రెస్ చేసుకోవాలని..తనలాగే ఉండాలని ఎంతగానో కలలు కనేదాన్నని నాటి జ్ఞాపకాలను రివైండ్ చేసుకున్నారు.
ఇక తన కుటుంబ మూలాలు- బాల్యం గురించి చెబుతూ.. జయసుధ విజయనగరంతో ఉన్న విడదీయరాని అనుబంధాన్ని బయటపెట్టారు. తమ కుటుంబం గొప్ప విద్యావంతులు, రచయితల (రైటర్స్) నేపథ్యం కలిగి ఉందని తెలిపారు. అమ్మ తరఫున విజయనగరం.. నాన్న తరఫున మద్రాసు నేపథ్యాలు తమ కుటుంబానికి ఉన్నాయని.. తన బాల్యం ఎక్కువగా విజయనగరం- మద్రాసు నగరాల మధ్యే గడిచిందని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ కుటుంబానికి బ్రహ్మ సమాజ్ నేపథ్యం గల బలమైన సాంస్కృతిక మూలాలు ఉన్నాయని వివరించారు.
సినీ రంగంలో 50 వసంతాలు పూర్తి చేసుకోవడానికి ఇంకెంతో కాలం లేదు. ఇప్పటికే నాలుగున్నర దశాబ్ధాల నటిగా ప్రజల హృదయాల్ని గెలుచుకున్న జయసుధ తనకు సహజనటి అనే బిరుదును ఇవ్వడాన్ని అలంకారమని అన్నారు. పండంటి కాపురం మొదలు ఎన్నో చిత్రాలలో జయసుధ తన అద్భుత నటనతో మెప్పించారు. వందలాది చిత్రాలలో అత్యుత్తమ నటనతో ఆకట్టుకున్న జయసుధను కెరీర్ లో ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు వరించాయి.
ఇక టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుతో కలిసి జయసుధ ఇప్పటివరకు పలు పెద్ద చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అందులో కుటుంబ కథా చిత్రాలైన `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`లో తల్లిగా, బ్రహ్మోత్సవం (2016) చిత్రంలో మహేష్ బాబు పిన్ని పాత్రలో మెప్పించగా.. బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన `మహర్షి` (2019) చిత్రంలో మహేష్ బాబు (రిషి) తల్లి యశోద పాత్రలో అద్భుతమైన భావోద్వేగం పండించే నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించారు. ఈ విధంగా రియల్ లైఫ్, రీల్ లైఫ్‌లోను కూడా వారిద్దరి మధ్య ఒక మంచి అనుబంధం కొనసాగుతుండటం విశేషం.