'బిగ్ బాస్' టాప్ సీక్రెట్స్.. అన్నీ చెప్పేసిన కృష్ణుడు

ఈ సందర్భంగా హౌస్‌లో జరిగిన పరిణామాలు, తన ఆరోగ్య సమస్యలు.. భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల గురించి పలు రహస్యాలను కృష్ణుడు బట్టబయలు చేశారు.

Update: 2026-09-22 03:59 GMT

టాలీవుడ్‌లో `వినాయకుడు` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన నటుడు కృష్ణుడు తాజాగా `బిగ్ బాస్` విశేషాలు .. తన సినీ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసారు. ఈ సందర్భంగా హౌస్‌లో జరిగిన పరిణామాలు, తన ఆరోగ్య సమస్యలు.. భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల గురించి పలు రహస్యాలను కృష్ణుడు బట్టబయలు చేశారు.

బిగ్ బాస్ హౌస్‌లో తాను గడిపిన 14 రోజుల ప్రయాణం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన అనుభూతి అని కృష్ణుడు తెలిపారు. బిగ్ బాస్ ఆట తీరుపై స్పందిస్తూ.. అందరినీ తన ఇష్టం వచ్చినట్లు ఆడించే శ్రీకృష్ణుడి లాంటి వాడని.. వేర్వేరు మనస్తత్వాలు ఉన్న వ్యక్తులతో బిగ్ బాస్ ఒక సైకలాజికల్ గేమ్ ఆడిస్తాడని అత‌డు అభిప్రాయపడ్డారు.

అయితే హౌస్‌లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తనకు స్వీట్స్ అంటే విపరీతమైన ఇష్టమని.. హౌస్‌లో వాటికి దూరంగా ఉండటం వల్ల తీవ్రమైన తలనొప్పి, నీరసం వచ్చి సరిగా ఆడలేకపోయానని ఆయన స్పష్టం చేశారు. తనకు ఎలాంటి షుగర్ వ్యాధి లేదని క్లారిటీ ఇస్తూనే.. పరిమితమైన ఆహారంతో ఆక‌లి బాధ‌.. నిరంతరం లైట్స్ ఆన్ చేసి ఉండటం వల్ల నిద్రలేమి సమస్యలను ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. ఈ ప్రయాణంలో రోహిత్ తో తనకు మంచి ఎమోషనల్ బాండింగ్ ఏర్పడిందని... త్రిగుణ్ అద్భుతమైన ఎనర్జీ ఉన్న బలమైన ప్లేయర్ అని ప్రశంసించారు.

సినిమా కెరీర్ విషయానికి వస్తే... గతంలో తాను 150 కిలోల బరువు ఉండటం వల్ల వచ్చిన ప్రతీ సినిమా చేశానని... అయితే మూస ధోరణి రావడం వల్ల సినిమాలకు కొంతకాలం గ్యాప్ తీసుకున్నానని కృష్ణుడు వివరించారు. ప్రస్తుతం తాను బరువు తగ్గి 108 కిలోలకు వచ్చానని.. ఇకపై తన వయసుకు, అనుభవానికి తగ్గ మంచి క్యారెక్టర్ రోల్స్ ఎంచుకొని చేస్తానని చెప్పారు. అవకాశాల కోసం ఎవరినీ అడగనని.. తనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యమని.. ప్రభాస్ `రాధేశ్యామ్` లో అవకాశం మిస్ అయినా దాన్ని పాజిటివ్ గానే తీసుకున్నానని తెలిపారు. సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ.. ఎంత ట్రోల్ చేస్తే అంత పాపులర్ అవుతానని.. ఆ ట్రోలింగ్‌ను తాను చాలా ఇష్టపడతానని సరదాగా పేర్కొన్నారు.

ప్రస్తుతం కృష్ణుడి చేతిలో పలు ఆసక్తికర ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్-ఈటీవీ భాగస్వామ్యంలో రాబోతున్న ఒక ప్రేమ‌క‌థా చిత్రంలో తాను మంచి క్యారెక్టర్ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఇప్పటివరకు ఇన్నోసెంట్ పాత్రల్లో చూసిన తనను.. త్వరలో `అమెరికాలో వినాయకుడు`అనే డార్క్ కామెడీ థ్రిల్లర్ సినిమాలో మెయిన్ లీడ్ గా ఒక పూర్తిగా కొత్త కోణంలో చూడబోతున్నారని తెలిపారు.

అలా ఎలిమినేట్ అయ్యాడు:

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 రెండో వారంలో ఊహించినట్లుగానే నటుడు కృష్ణుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. హౌస్‌లో ఎక్కువగా సైలెంట్‌గా ఉండటం.. టాస్కుల్లో పూర్తిస్థాయిలో యాక్టివ్‌గా పాల్గొనలేకపోవడం అత‌డి ఎలిమినేషన్‌కు ప్రధాన కారణాలుగా నిలిచాయి. వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ప్రకటించిన ఈ ఎలిమినేషన్ ప్రకటనతో కృష్ణుడి బిగ్ బాస్ ప్రయాణం ముగిసింది. అయితే తాను రోజుకు పది కేజీల స్వీట్లు తినే అలవాటు క‌లిగి ఉన్నానని.. కానీ హౌస్‌లోకి వచ్చాక గత కొన్ని రోజులుగా షుగర్ పూర్తిగా మానేయడం వల్ల శరీరం నీరసించి గేమ్‌పై ప్రభావం చూపిందని తెలిపారు. హౌస్ నుంచి బయటకు వచ్చే సమయంలో రోహిత్, త్రిగుణ్ వంటి తోటి కంటెస్టెంట్లు త‌న‌తో గడిపిన క్షణాలను తలుచుకుంటూ కంటతడి పెట్టుకోవడం ఆ ఎపిసోడ్‌ను ఎమోషనల్‌గా మార్చింది.

Tags:    

Similar News