సీక్వెల్ బకెట్ పెరిగిపోతోంది.. ఎప్పటికి వస్తాయో?

అయితే.. ఒక్కసారి ఫ్రాంచైజ్ సెట్ అయితే.. కాసుల వర్షమే అన్న ఆశ వారి చేత సీక్వెల్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేలా చేస్తోంది.

Update: 2026-09-26 11:06 GMT

జక్కన్న పుణ్యమా అని తెలుగు సినిమాలో సీక్వెల్ సీజన్ మొదలైంది. బాహుబలితో మొదలైన సీక్వెల్ సీజన్.. తెలుగులో అనుకున్నంత సక్సెస్ కాకపోవటం కనిపిస్తుంది. కొన్ని ప్రాజెక్టులు మినహాయిస్తే.. మిగిలిన వాటిపై బజ్ కూడా పెద్దగా లేని పరిస్థితి. ఒక సినిమాతో రెండు కలెక్షన్లు కొల్లగొట్టేయొచ్చన్న ఆలోచన బాగానే ఉన్నా.. ప్రేక్షకుడ్ని థ్రిల్ కు గురి చేయకపోతే.. మొదటి సినిమాలోనే చతికిలపడాల్సిన పరిస్థితి. ఈ రిస్క్ ను టాలీవుడ్ దర్శక నిర్మాతలకు అర్థమవుతోంది. అయితే.. ఒక్కసారి ఫ్రాంచైజ్ సెట్ అయితే.. కాసుల వర్షమే అన్న ఆశ వారి చేత సీక్వెల్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేలా చేస్తోంది.

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుగా.. సీక్వెల్ తో భారీగా సొమ్ములు చేసుకోవచ్చన్న ఆలోచన బాగానే ఉన్నా.. చివరకు ఆ ప్రభావం పడుతోంది ప్రేక్షకుడి మీదనే. మొదటి భాగం పూర్తై.. రెండో భాగం కోసం ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇందుకు రాజమౌళి మినహాయింపుగా చెప్పాలి. బాహుబలి సీక్వెల్ విషయంపై ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చేవారు. సీక్వెల్ మీద ఉన్న ఆసక్తిని అంతకంతకూ పెంచేలా ఆయన ప్లానింగ్ ఉండేది. ఆయన్ను అనుకరిస్తూ సీక్వెల్ తీసేందుకు సిద్ధమైనోళ్లు.. జక్కన్న మాదిరి ప్లానింగ్ విషయంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారని చెప్పాలి.

సీక్వెల్ ఉంటుందని ప్రకటించి.. ఆ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను ఆర్నెల్లకు ఒకసారి కూడా ఇవ్వని పరిస్థితి. సీక్వెల్ కోసం ఎదురుచూసే ప్రేక్షకులు విసుగెత్తి పోయేలా పరిస్థితి మారింది. కల్కి 2898ఏడీ సినిమానే తీసుకుందాం. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందన్న విషయాన్ని యూనిట్ అస్సలు చెప్పలేదు. ఆ మాటకు వస్తే.. ఆ సినిమా క్లెమాక్స్ సంగతి తర్వాత.. కథ మధ్యలో ఆగిపోతుంది. 2024లో విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన పార్ట్ 2 షూటింగ్ ఈ ఏడాది అక్టోబరులో షురు అవుతుందని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది విడుదల అవుతుందని చెబుతున్నా.. అదంతా జరిగే పనేనా? అన్నది ప్రశ్న.

సలార్ 2 విషయానికి వసతే.. ఈ సినిమా 2023 సెప్టెంబరులో విడుదలైంది. దీని సీక్వెల్ కు సంబంధించిన విషయానికి వస్తే.. పార్ట్ 2 శౌర్యాంగ పర్వం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉంది. ఈ సినిమాకు సంబంధించి దాదాపు 20 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తైనట్లు చెబుతున్నారు. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత నీల్ ఎన్టీఆర్ తో తీస్తున్న డ్రాగన్ ప్రాజెక్టు అనూహ్య పరిస్థితుల్లో ఆగటం తెలిసిందే. ఎన్టీఆర్ భుజానికి గాయం కావటంతో ఈ చిత్రం ఆలస్యమవుతున్న వేళ.. నీల్ ఇప్పుడు తన ఫోకస్ ను సలార్ 2 మీద పెట్టినట్లుగా చెబుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ మొత్తాన్ని 2027 నాటికి పూర్తి చేయాలన్న ప్లాన్ తో ఉన్నట్లు చెబుతున్నారు.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తెలుగు హీరోల్లో సీక్వెల్ సినిమాలు బాకీ ఉన్న కథానాయకుడిగా డార్లింగ్ ప్రభాస్ నిలుస్తారు. కల్కి.. సలార్ రెండు సినిమాలే కాదు.. డిజాస్టర్ రాథేశ్యామ్ కు సీక్వెల్ ఉంటుందని చెప్పినా.. ఆ సినిమా తుది ఫలితం నేపథ్యంలో సీక్వెల్ అటకెక్కినట్లే. ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ సీక్వెల్ అప్టేట్ కోసం చాలా కాలమే ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ మధ్యనే ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించిన వివరాల్ని చిత్ర నిర్మాత వెల్లడించటం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే దీని రెగ్యులర్ షూట్ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం భుజం గాయంతో ఇబ్బంది పడుతున్న తారక్.. దాని నుంచి కోలుకోవటం.. అనంతరం ఆయన ఇప్పటికే కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలు పూర్తి చేసిన తర్వాతే దేవర 2 మీద ఫోకస్ చేస్తారని చెప్పొచ్చు.

పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన బజ్ వచ్చి.. సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న మూవీల్లో యానిమల్ పార్క్ నిలుస్తుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్ బీర్ కపూర్ కథానాయకుడిగా నటించటం.. ఈ సినిమా బాక్సాఫీస్ ను ఎంతలా షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మొత్తం మూడు భాగాల్లో ఉండేలా దర్శకుడి ఆలోచనలు ఉన్నట్లుగా రణ్ బీర్ కపూర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పటం తెలిసిందే. సీక్వెల్ షూట్ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మొదలువుతుందని చెబుతున్నారు. విడుదల 2028లో ఉంటుందని తెలుస్తోంది. ఇదంతా చూస్తే.. యానిమల్ విడుదలైన దగ్గర దగ్గర నాలుగేళ్లకు పైనే పార్టు 2 షూటింగ్ కు వెళ్లటం కనిపిస్తుంది.

ఇటీవల సీక్వెల్ ట్రెండ్ నడుస్తుండటంతో.. ప్రేక్షకుల సీక్వెల్ బకెట్ బరువు పెరుగుతోంది. ఒకటి తర్వాత ఒకటి చొప్పున సినిమాలు చేరిపోతున్నాయి. బకెట్ లో చేరే వాటితో పోలిస్తే.. ఆ బరువు తగ్గేలా సీక్వెల్స్ విడుదల కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితే కొనసాగితే.. ప్రేక్షకుల్లో సీక్వెల్ మీద ఉన్న ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందన్నది మర్చిపోకూడదు. సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న పుష్ప2 ఎండింగ్ లో పార్ట్ 3 ఉంటుందని హింట్ ఇవ్వటం తెలిసిందే. చిత్ర హీరో, దర్శకుడు ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్టులను పూర్తి చేసి.. దీని మీద ఫోకస్ చేస్తారని చెబుతున్నారు. ఇందుకు మరికొన్ని ఏళ్లు పడుతుందని చెప్పక తప్పదు.

ఇలా చెప్పుకుంటూ పోతే సీక్వెల్ జాబితా భారీగా పెరుగుతోంది. జైహనుమాన్, గూఢచారి 2, హిట్, కార్తికేయ 3, విరూపాక్ష 2, బింబిసార 2, మంగళవారం 2, మా ఊరిపొలిమేర 3, టిల్లు3 ఇలా జాబితా అంతకంతకూ పెరుగుతోంది. భారీ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ కు స్వీకెల్ ఉంటుంది కానీ అదెప్పుడు అన్న దానిపై స్పష్టత రాని పరిస్థితి. ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న కథలకు కొనసాగింపు ధోరణి పెరుగుతోంది. అయితే.. ఈ ఆత్రుతలో అడ్డంగా దొరికిపోయిన సినిమాలు లేకపోలేదు. ప్రభాస్ రాధే శ్యామ్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు సీక్వెల్ ఉండదు. అదే తరహాలో మరికొన్ని ఉన్నాయి.

అఖిల్ అక్కినేని ఏజెంట్, రామ్ పోతినేని స్కంద, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పెదకాపు, సందీప్ కిషన్ మైఖేల్, బాలీవుడ బ్రహ్మాస్త లాంటి సినిమాలకు కొనసాగింపు ఉంటుందని మొదటి సినిమాలో చెప్పినా.. దాని తుది ఫలితం తర్వాత.. సీక్వెల్ ఆలోచనల్ని విరమించుకున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే.. సీక్వెల్ ట్రెండ్ తో ప్రేక్షకుడికి కలుగుతున్న ఇబ్బంది.. ఏళ్లకు ఏళ్ల పాటు తాను ఇష్టపడిన సినిమా కొనసాగింపు కోసం ఎదురుచూడటం. ఈ నిరీక్షణ కాలాన్ని ఎంత తగ్గిస్తే.. ప్రేక్షకుడిలో అంత ఉత్సుకత పెరుగుతుందన్నది మర్చిపోకూడదు.

Tags:    

Similar News