డిబేట్.. టాలీవుడ్‌కే నంబర్ వన్ స్థానం!
ఒకప్పుడు హాలీవుడ్.. బాలీవుడ్ అని ప్రస్థావించిన తర్వాతే టాలీవుడ్ గురించి మాట్లాడేవారు! కానీ ఇప్పుడు సీన్ మారుతోంది.;
ఒకప్పుడు హాలీవుడ్.. బాలీవుడ్ అని ప్రస్థావించిన తర్వాతే టాలీవుడ్ గురించి మాట్లాడేవారు! కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. హాలీవుడ్ తర్వాత టాలీవుడ్ అని చెప్పుకున్నా ఇది గొప్పలు పోవడం కాదు. తెలుగు సినిమా బడ్జెట్ల పరంగా, సాంకేతికత పరంగా ఆ స్థాయికి ఎదుగుతోంది. బాలీవుడ్ లో ఇతర సినీపరిశ్రమల్లో భారీ బడ్జెట్లు పెడుతున్నా, టెక్నాలజీని సద్వినియోగం చేస్తున్నా తెలుగు చిత్రసీమ అందుకున్న సక్సెస్ రేటును అందుకోలేకపోవడంతో ఒక రకంగా టాలీవుడ్ డామినేషన్ కొనసాగుతోంది.
మునుముందు ముంబై కంటే హైదరాబాద్ కే ఎక్కువ గుర్తింపు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. చాలా మంది బాలీవుడ్ స్టార్లు హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతున్నారు. అక్కడ ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు సౌత్ కి వెళ్లిపోతున్నానని బహిరంగంగా ప్రకటించాడు. చాలా మంది నటీనటులు బాలీవుడ్ లో స్థిరపడాలని ఆశించినా, ఇప్పుడు తెలుగు సినిమా వైపు చూస్తున్నారు. బాలీవుడ్ అగ్ర కథానాయికలు సైతం తెలుగు స్టార్ ల సరసన నటించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ పరిణామం చాలా స్పష్ఠంగా కనిపిస్తోంది. తెలుగు సినిమాల సక్సెస్ రేటు అమాంతం పెరగడం, భారీ చిత్రాల నిర్మాణంలో ధీటుగా దూసుకెళుతుండడంతో హైదరాబాద్ కి మహర్ధశ మొదలైంది.
ప్రస్తుతం టాలీవుడ్ దర్శకరచయితలు, క్రియేటర్ల క్రేజ్ అంతకంతకు పెరుగుతోంది. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోల రేంజు అమాంతం పాన్ ఇండియాలో పెరిగింది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు మన స్టార్లను తమ సినిమాల్లో నటింపజేస్తున్నాయి. మన దర్శకరచయితలకు గొప్ప అవకాశాల్ని కల్పిస్తున్నాయి. బడ్జెట్లు, స్టార్ కాస్టింగ్, ఉపయోగిస్తున్న సాంకేతికత, సక్సెస్ రేటు ఇలా చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుంటే టాలీవుడ్ దేశంలోని అన్ని సినీపరిశ్రమల కంటే ముందంజలో ఉంది. ఈ పరిణామం చూస్తుంటే హైదరాబాద్ భారతీయ సినిమాకి ముఖంగా మారుతోందని అంగీకరించాలి.