గుణశేఖర్ మాట నిలబడుతుందా?

సంక్రాంతి సినిమాల తర్వాత బాక్సాఫీస్‌లో స్లంప్ రావడం మామూలే. పండక్కి భారీ చిత్రాలకు ఎక్కువ డబ్బులు పెట్టేసిన ప్రేక్షకులు.. మళ్లీ థియేటర్లకు రావడానికి టైం తీసుకుంటారు.;

Update: 2026-02-06 10:13 GMT

సంక్రాంతి సినిమాల తర్వాత బాక్సాఫీస్‌లో స్లంప్ రావడం మామూలే. పండక్కి భారీ చిత్రాలకు ఎక్కువ డబ్బులు పెట్టేసిన ప్రేక్షకులు.. మళ్లీ థియేటర్లకు రావడానికి టైం తీసుకుంటారు. అందుకే తర్వాతి వారాల్లో వచ్చే సినిమాలు జనం లేక ఇబ్బంది పడుతుంటాయి. ఒక వారం సినిమాలే లేకపోగా.. ఇంకోవారం వచ్చిన ‘ఓం శాంతి శాంతి శాంతి:’ కూడా ప్రభావం చూపలేకపోయింది. ఇక ఈ వారం బాక్సాఫీస్ విషయానికి వస్తే రెండంకెల సంఖ్యలో సినిమాలు రిలీజవుతున్నాయి. వాటిలో చాలా సినిమాల గురించి ప్రేక్షకులకు ఏమాత్రం పట్టింపు లేదు. అవి నామమాత్రంగానే రిలీజవుతున్నాయి. ఉన్న వాటిలో ఆసక్తి రేకెత్తిస్తున్న కాస్ట్ అండ్ క్రూ అంటే ‘యుఫోరియా’ చిత్రానిదే. ఇది సీనియర్ దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన చిత్రం. భూమిక కీలక పాత్ర పోషించింది. ‘దురంధర్’ ఫేమ్ సారా అర్జున్‌‌ది దాదాపు లీడ్ రోల్ అని చెప్పొచ్చు.

దర్శకుడిగా గుణశేఖర్‌ది ఆసక్తికర ప్రయాణం. ‘సొగసు చూడతరమా’ లాంటి విభిన్న చిత్రంతో పరిచయమై.. ‘బాల రామాయణం’ లాంటి సాహసోపేత చిత్రం తీసి.. ఆపై చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్ ‌బస్టర్లు కొట్టాడు. ఐతే ఆ తర్వాత తడబడ్డ ఆయన.. స్వీయ నిర్మాణంలో ‘రుద్రమదేవి’ తీసి పెద్ద సాహసమే చేశాడు. అది మంచి ఫలితాన్నే ఇచ్చినా.. ‘శాకుంతలం’ ఆయనకు పెద్ద షాకిచ్చింది. అది కూడా ఆయన సొంత చిత్రమే. ఇప్పుడు ‘యుఫోరియా’ను కూడా సొంత బేనర్లోనే తీశాడు. కాకపోతే బడ్జెట్ తక్కువ. అయినా సరే ఇందులోనూ రిస్క్ ఉంది. స్టార్ల మీద ఆధారపడకుండా కంటెంట్‌ను నమ్మి సినిమా చేశాడు. ఆ సినిమా స్థాయిలో బాగానే ఖర్చు పెట్టాడు. ఈసారి కంటెంపరరీ సబ్జెక్ట్, సామాజిక అంశాలు తీసుకుని మోడర్న్ టచ్‌తో సినిమా తీశాడు. ఐతే రిలీజ్ టైమింగ్, ఇతర కారణాల వల్ల సినిమాకు హైప్ అయితే లేదు. ఈ సినిమాకు ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా చేయకపోవడంపై గుణశేఖర్ స్పందిస్తూ.. అందులో ఒకరినొకరు పొగుడుకోవడమే కదా, దాని బదులు సినిమానే కంటెంట్‌తో రప్పిస్తుంది అని ధీమా వ్యక్తం చేశాడు. మరి ఆయన మాట నిలబడి.. ‘యుఫోరియా’ మంచి టాక్‌తో జనాల్ని థియేటర్లకు రప్పిస్తుందేమో చూడాలి

Tags:    

Similar News