టాలీవుడ్ లో నిర్మాతల పరిస్థితి.. ఒక్కొక్కొరు ఒక్కోలా..
టాలీవుడ్ నిర్మాతల పరిస్థితి కోసం ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ఒకప్పుడు సినిమాల వ్యాపారంలో ఓటీటీ డీల్స్ కీలక పాత్ర పోషించేవి.;
టాలీవుడ్ నిర్మాతల పరిస్థితి కోసం ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ఒకప్పుడు సినిమాల వ్యాపారంలో ఓటీటీ డీల్స్ కీలక పాత్ర పోషించేవి. థియేటర్లలో సినిమా ఎలా ఆడుతుందన్న దానికంటే ముందే, ఓటీటీలు భారీ మొత్తాలు చెల్లించడంతో నిర్మాతలకు రిస్క్ చాలా వరకు తగ్గిపోయేది. ఆ పరిస్థితిని ఆసరాగా చేసుకుని హీరోలు తమ రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా సిద్ధపడేవారు. దీంతో హీరోల పారితోషికాలు క్రమంగా భారీ స్థాయికి చేరుకున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఓటీటీ సంస్థలు గతంలా భారీ డీల్స్ కు ముందుకు రావడం లేదు. సినిమాల కంటెంట్, మార్కెట్ పరిస్థితులు, థియేట్రికల్ కలెక్షన్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తక్కువ రేట్లకే డీల్స్‌ను ఖరారు చేస్తున్నాయి.
కొన్ని సందర్భాల్లో నిర్మాతలు ఆశించిన స్థాయిలో ఓటీటీ ఒప్పందాలే జరగడం లేదు. దీంతో ప్రొడ్యూసర్లకు ఆదాయ మార్గాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు పూర్తిగా థియేట్రికల్ కలెక్షన్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే థియేటర్లలో అన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధిస్తాయని ఎవరూ చెప్పలేం. ఒక్కో మూవీ ఒక్కోలా రాబడుతుంది.
ముఖ్యంగా ప్రేక్షకుల అభిరుచులు మారడం, కంటెంట్ కు ప్రాధాన్యం పెరగడం, టికెట్ ధరలు, ఇతర ఖర్చులు వంటి అంశాలు కూడా నిర్మాతలను ఆలోచనలో పడేస్తున్నాయి. ఫలితంగా బడ్జెట్ అదుపు తప్పకుండా ఉండేలా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు ప్రొడ్యూసర్స్. హీరోల రెమ్యూనరేషన్లపై చర్చలు చేపడుతున్నారు. భారీ పారితోషికం ఇస్తే సినిమాపై భారం పడుతోందని భావిస్తున్నారు.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో భారీ పారితోషికం సాధ్యం కాదని కొందరు నిర్మాతలు హీరోలకు స్పష్టంగా చెప్పేస్తున్నారు. కొంతమంది నిర్మాతలు హీరోలతో చర్చించి, ఫిక్స్ డ్ రెమ్యూనరేషన్ కు బదులు లాభాల షేర్ పద్ధతిలో సినిమాలు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. సినిమా విజయవంతమైతే లాభాల్లో హీరోలకు వాటా ఇచ్చే విధానానికి కొంతమంది హీరోలు కూడా అంగీకరిస్తున్నారు.
ఇది నిర్మాతలకు రిస్క్ తగ్గించే మార్గంగా మారుతోంది. అయితే అన్ని సందర్భాల్లో పరిస్థితి ఇదేలా ఉండటం లేదు. కొందరు స్టార్ హీరోలు మాత్రం తమ పారితోషికాల్లో తగ్గింపునకు ఒప్పుకోవడం లేదు. అలాంటి సందర్భాల్లో నిర్మాతలు భారీ రిస్క్ తీసుకుని సినిమాలు చేయాల్సి వస్తోంది. ఏదేమైనా ఓటీటీ డీల్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం, థియేట్రికల్ వసూళ్లపై పూర్తి ఆధారపడాల్సి రావడంతో నిర్మాతలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మొత్తానికి టాలీవుడ్ లో ప్రస్తుతం మారుతున్న వ్యాపార పరిస్థితులు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. భవిష్యత్తులో పరిస్థితి ఎలా మారుతుందో, ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.