ఇక టాక్ బట్టి మార్కెట్ రిజల్ట్‌ అంచనా వేయలేమా?

సినిమా బాగుంది.. టాక్ అదిరిపోయింది.. ఇక బాక్సాఫీస్ దగ్గర తిరుగుండదనే అంచనాలు ఒకప్పుడు ఉండేవి. పాజిటివ్ టాక్ వస్తే వసూళ్లు పెరుగుతాయని, నెగెటివ్ టాక్ వస్తే కలెక్షన్లు తగ్గుతాయని లెక్కలు వేసేవారు.

Update: 2026-07-05 12:30 GMT

సినిమా బాగుంది.. టాక్ అదిరిపోయింది.. ఇక బాక్సాఫీస్ దగ్గర తిరుగుండదనే అంచనాలు ఒకప్పుడు ఉండేవి. పాజిటివ్ టాక్ వస్తే వసూళ్లు పెరుగుతాయని, నెగెటివ్ టాక్ వస్తే కలెక్షన్లు తగ్గుతాయని లెక్కలు వేసేవారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్‌ లో పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తోంది. ఒకే సినిమాకు టాక్ బాగున్నా.. అన్ని చోట్లా ఒకే రేంజ్ కలెక్షన్లు రావడం లేదు. దీంతో ఇక టాక్‌ బట్టి మార్కెట్ రిజల్ట్‌ ను అంచనా వేయలేమా? అనే చర్చ మొదలైంది.

సాధారణంగా సినిమా విడుదలైన మొదటి షో నుంచే టాక్ బయటకు వస్తుంది. సినిమా ఎలా ఉంది? ఏ అంశాలు బాగున్నాయి? ఎక్కడ నిరాశపరిచింది? అనే విషయాలు ప్రేక్షకులకు చేరుతున్నాయి. ఆ టాక్ ఆధారంగానే సినిమా ఫ్యూచర్ అంచనా వేసే పరిస్థితి ఉండేది. కానీ ఇటీవల కొన్ని సినిమాల వసూళ్లను పరిశీలిస్తే టాక్ ఒక్కటే విజయాన్ని నిర్ణయించే అంశం కాదని తెలుస్తోంది. ఒకే సినిమాకు కొన్ని చోట్ల మంచి రెస్పాన్స్ లభిస్తుంటే.. మరికొన్ని చోట్ల ఆశించిన స్పందన కనిపించడం లేదు.

టాక్ ఒకటే అయినా వసూళ్లలో మాత్రం డిఫరెన్స్ కనిపిస్తోంది. దీనికి ప్రేక్షకుల టేస్ట్ లో వచ్చిన మార్పు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇప్పుడు అన్ని వర్గాల ఆడియెన్స్ ఒకే లాంటి సినిమాలను ఇష్టపడటం లేదు. కొందరు మాస్, యాక్షన్ చిత్రాలపై ఆసక్తి చూపిస్తుంటే.. మరికొందరు ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, కామెడీ సినిమాలను ఎంచుకుంటున్నారు. ఇంకొందరు కొత్త, విభిన్నమైన కథలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పాజిటివ్ టాక్ వచ్చినంత మాత్రాన ప్రతి సినిమా అందరినీ థియేటర్లకు రప్పించలేకపోతోంది.

ఇక్కడ సినిమా జానర్ కూడా కీలకంగా మారుతోంది. ఒక తరహా కథకు కొన్ని చోట్ల ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంటే.. అదే కంటెంట్ మరోచోట అంతగా కనెక్ట్ కావడం లేదు. దీంతో టాక్ బాగున్నా బాక్సాఫీస్ రిజల్ట్ మాత్రం ఒకేలా ఉండటం లేదు. మరోవైపు హీరోల మార్కెట్ వసూళ్లను ప్రభావితం చేస్తోంది. స్టార్ క్రేజ్, గత సినిమాల ఫలితాలు.. ఇలా అనేక అంశాలు కలెక్షన్లపై ప్రభావం చూపుతున్నాయి. దీనికి టికెట్ ధరలు, థియేటర్ల అందుబాటు, ప్రమోషన్స్ వంటి అంశాలు కూడా తోడవుతున్నాయి.

ముఖ్యంగా ఓటీటీ ప్రభావంతో ప్రేక్షకులు మరింత సెలెక్టివ్‌ గా మారారు. సినిమా బాగుందనే టాక్ వచ్చినా.. అది థియేటర్‌ లోనే చూడాల్సిన చిత్రమా? లేక ఓటీటీలో చూసినా పర్లేదా? అని ఆలోచిస్తున్నారు. దీంతో పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా అన్ని చోట్లా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు రావడం లేదు. ఆ పరిస్థితి ట్రేడ్ వర్గాలకు కొత్త సవాల్‌ గా మారుతోంది.

గతంలో తొలి రోజు టాక్, ఓపెనింగ్స్ చూసి సినిమా లాంగ్ రన్‌ ను అంచనా వేసేవారు. ఇప్పుడు మాత్రం ఆ లెక్కలు వర్కౌట్ కావడం లేదు. ఒకచోట బలమైన వసూళ్లు సాధిస్తున్న సినిమా.. మరోచోట అదే జోరు కొనసాగించలేకపోతోంది. ఇటీవల విడుదలైన పెద్ది, మా ఇంటి బంగారం, రావు బహదూర్ చిత్రాల లెక్కలు చర్చకు కారణమవుతోంది. అందుకే ఇక టాక్‌ బట్టి మొత్తం మార్కెట్ రిజల్ట్‌ అంచనా వేయడం అంత ఈజీ కాదనే అభిప్రాయం వినిపిస్తోంది.

Tags:    

Similar News