'ఫేమ్' కంటే 'టాలెంట్‌'కే జై కొడుతున్నారా?

సాధారణంగా ఒక కొత్త దర్శకుడు తన కథతో నిర్మాత దగ్గరకు వెళ్లినప్పుడు.. ముందుగా ఎక్స్పీరియన్స్ గురించి ప్రశ్నలు వస్తాయి. ఇంతకుముందు ఏ సినిమా చేశాడు?

Update: 2026-09-04 16:30 GMT

సినిమా తీయాలంటే కథ కావాలి.. ఆ స్టోరీని తెరకెక్కించే టాలెంట్ ఉండాలి. కానీ ఇవన్నీ ఉన్నా ఒక కొత్త దర్శకుడికి మూవీ ఛాన్స్ రావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయనకు మార్కెట్ ఉండదు. గత సినిమాల రికార్డు ఉండదు. నిర్మాతకు పూర్తి నమ్మకం ఉండదు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌ లో ఆ లెక్క కాస్త మారుతున్నట్టు కనిపిస్తోంది. ఫేమ్ కంటే టాలెంట్‌ ను నమ్మి కొత్త దర్శకులకు ఛాన్స్ ఇవ్వడం ఆసక్తికరంగా మారుతోంది.

సాధారణంగా ఒక కొత్త దర్శకుడు తన కథతో నిర్మాత దగ్గరకు వెళ్లినప్పుడు.. ముందుగా ఎక్స్పీరియన్స్ గురించి ప్రశ్నలు వస్తాయి. ఇంతకుముందు ఏ సినిమా చేశాడు? ప్రేక్షకులకు ఎలా నచ్చుతుంది? పెట్టుబడి తిరిగి వస్తుందా? అనే సందేహాలు ఉంటాయి. కథ బాగున్నా.. దర్శకుడి పేరు తెలియకపోవడంతో ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం కష్టమవుతుంది. ఇలాంటి సమయంలో ఇప్పటికే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న ఫిల్మ్‌ మేకర్లు కొత్తవాళ్లపై నమ్మకం పెట్టుకోవడం వారికి పెద్ద అవకాశంగా మారుతోంది.

ఒక కొత్త దర్శకుడి కథను నమ్మి నిర్మాణ పరంగా అండగా నిలిస్తే.. ఆ ప్రాజెక్టుకు మొదటి నుంచే ఒక గుర్తింపు వస్తుంది. అంతేకాదు.. కొత్త దర్శకుడికి తన ఆలోచనను పూర్తి స్థాయిలో స్క్రీన్ పై చూపించే అవకాశం లభిస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కొత్త దర్శకుడి పేరు పెద్దది కాకపోయినా, కథలో ఉన్న కొత్తదనం ముఖ్యంగా మారుతోంది. ఇంతకాలం హీరో, హీరోయిన్, దర్శకుడి మార్కెట్ ఆధారంగా సినిమాలపై అంచనాలు ఏర్పడేవి. ఇప్పుడు కొన్ని ప్రాజెక్టుల్లో మాత్రం కథ ఏంటి? కొత్త దర్శకుడి ఆలోచన ఏంటి? అనే ప్రశ్నలకు ప్రాధాన్యం పెరుగుతోంది.

కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడం వెనుక మరో కారణం కూడా ఉంది. ఇప్పటికే విజయాలు అందుకున్న దర్శకులకు ఇండస్ట్రీలో ఒక రేంజ్ ఏర్పడుతుంది. నిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్లతో సంబంధాలు పెరుగుతాయి. అలాంటి సమయంలో తమకు వచ్చిన అవకాశాన్ని మరొకరికి అందించడం సాధ్యమవుతుంది. దీంతో ఒకరి కెరీర్‌ మరో వ్యక్తికి మార్గం చూపించే పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఫుల్ ఫేమ్ ఉన్న వ్యక్తి అండగా నిలిచినంత మాత్రాన సినిమా విజయం సాధిస్తుందనే గ్యారంటీ లేదు.

ఆ పేరు సినిమాకు ప్రేక్షకుల్లో హైప్ తీసుకురావచ్చు. కాస్త నమ్మకం కలిగించవచ్చు. కానీ థియేటర్‌ లో సినిమా మొదలైన తర్వాత స్టోరీ, యాక్టింగ్ దర్శకత్వం, మేకింగ్‌ నే ప్రేక్షకులు చూస్తారు. అక్కడ కొత్త దర్శకుడు తన సత్తా చూపించాల్సిందే. అందుకే ఇది కేవలం కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వడం అనే విషయం మాత్రమే కాదు. ఇండస్ట్రీలో టాలెంట్‌ ను గుర్తించే విధానంలో వస్తున్న మార్పుగా కూడా చూడొచ్చు.

ఫేమ్ లేని వ్యక్తికి అవకాశం ఇవ్వడం రిస్క్ కావచ్చు. కానీ అదే వ్యక్తిలో ఉన్న టాలెంట్ ముందుగానే గుర్తిస్తే.. మంచి దర్శకుడిని పరిచయం చేసినట్టవుతుంది. టాలీవుడ్‌ లో ఇప్పుడు కనిపిస్తున్న ప్రయత్నాల అసలు ప్రత్యేకత కూడా ఇదే. ముందుగా ఫేమ్ సంపాదించాలి.. ఆ తర్వాతే అవకాశం రావాలనే పాత లెక్కకు బదులుగా.. అవకాశం వస్తేనే ఫేమ్ సంపాదించగలరనే కొత్త ఆలోచన కొంతమేర పుడుతోంది.

Tags:    

Similar News