యువ దర్శకుల భారీ లక్ష్యాలు!
టాలీవుడ్ లో సరికొత్త మార్పు కనిపిస్తోంది. అగ్ర కథానాయకులు ఇమేజ్‌ను పక్కన పెట్టి కొత్త ఆలోచనలతో వస్తోన్న యువ దర్శకులకు అవకాశాలు కల్పిస్తున్నారు.;
టాలీవుడ్ లో సరికొత్త మార్పు కనిపిస్తోంది. అగ్ర కథానాయకులు ఇమేజ్‌ను పక్కన పెట్టి కొత్త ఆలోచనలతో వస్తోన్న యువ దర్శకులకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఒకప్పుడు అనుభవం ఉన్న దర్శకులకే ప్రాధాన్యత ఇచ్చిన హీరోలిప్పుడు పంథా మార్చి ప్రయాణం చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోల నుంచి తర్వాత తరం నటుల వరకూ యువ దర్శకుల విజన్ పై నమ్మకం తో ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో యువ దర్శకులు భారీ లక్ష్యాలతో అగ్ర హీరోలను విభిన్నమైన పాత్రల్లో ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి చూపు ఎక్కువగా యువ ప్రతిభపైనే ఉంది.
ఇప్పటికే వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో `విశ్వంభర` చిత్రంలో చిరంజీవి నటించిన సంగతి తెలిసిందే. సినిమాని భారీ సక్సెస్ చేయాలనే లక్ష్యంతో వశిష్ట ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పనిచేస్తున్నాడు. విడుదల ఆలస్యమైనా? మెగా అభిమానులకు బ్లాక్ బస్టర్ ఇస్తాం అన్న కాన్పిడెంట్ తో ముందుకెళ్తున్నాడు. అలాగే `దసరా` లాంటి మాస్ క్లాసిక్ అందించిన శ్రీకాంత్ ఓదెలతో కూడా చిరంజీవి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ మార్క్ రా అండ్ రస్టిక్ మేకింగ్ లో చిరంజీవిని మెగా అభిమానులు చూడబోతన్నారు.
మారుతితో కూడా ఓ సినిమా చేయాలని మెగాస్టార్ ఆశపడుతోన్న సంగతి తెలిసిందే. పబ్లిక్ గానే మారుతితో ఓ సినిమా చేస్తానని ప్రకటించిన సంగతి విధితమే. నటసింహ బాలకృష్ణ పంథా గురించైతే చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడిపై నమ్మకం కలిగిందంటే మొండిగా ముందుకెళ్లిపోతారు. కథ కూడా వినకుండా సినిమా చేయడం బాలయ్య ప్రత్యేకత. `బ్రోచేవారెవరురా`, `సరిపోదా శనివారం` వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన వివేక్ ఆత్రేయతో బాలయ్య జతకట్టబోతున్నారు. ఇద్దరిదీ అన్‌లైక్లీ కాంబినేషన్ అయినా వివేక్ ఆత్రేయ రాసుకున్న కథ బాలయ్యకు బాగా నచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ మరో ఏడాదిలో పట్టాలెక్కే అవకాశం ఉంది. బాలయ్య మాస్ ఇమేజ్‌కు వివేక్ క్లాస్ అండ్ ఇంటెలిజెంట్ ట్రీట్‌మెంట్ తోడైతే ఫలితం ఎలా ఉంటుందోనని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అలాగే `రాజ రాజ చోర`తో ప్రతిభను చాటుకున్న హర్షిత్ గోలి మాస్ మహారాజా రవితేజతో భారీ సినిమా చేయబోతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. రవితేజ ఎనర్జీకి హర్షిత్ గోలి అందించే వినోదం తోడైతే బాక్సాఫీస్ వద్ద విజయం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు.
యువ దర్శకులు స్టార్ హీరోల బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కథనంలో కొత్తదనాన్ని జోడించడం తో ఈ సినిమాలు క్రేజీ ప్రాజెక్టులుగా మారుతున్నాయి. అగ్ర హీరోలతో పని చేయడం యువ దర్శకులకు అగ్ని పరీక్ష లాంటిదే. ఎందుకంటే హీరోల అభిమానుల అంచనాలను అందుకోవడంతో పాటు తమదైన ముద్ర వేయడం అంత సులభం కాదు. ప్రస్తుత టెక్నాలజీ , గ్లోబల్ సినిమా మార్పుల పట్ల అవగాహన ఉన్న ఈ తరం దర్శకులు మూస పద్ధతులను పక్కన పెట్టి సరికొత్త కథనాలను సిద్ధం చేస్తున్నారు. ఈ ధైర్యమే వారిని అగ్ర హీరోల దగ్గరకు తీసుకెళ్లిందన్నది కాదనలేని నిజం.