హీరో ఇమేజ్‌ను మించి.. రేపటి సినిమాలో విజన్‌దే రాజ్యాధికారం
ఒకప్పుడు టాలీవుడ్ పూర్తి స్థాయిలో స్టార్ డమ్ పునాదుల మీదే నడిచేది. వెండితెరపై అభిమాన హీరో పేరు పడితే చాలు థియేటర్ల వద్ద పాలాభిషేకాలతో పండుగ వాతావరణం కనిపించేది.
ఒకప్పుడు టాలీవుడ్ పూర్తి స్థాయిలో స్టార్ డమ్ పునాదుల మీదే నడిచేది. వెండితెరపై అభిమాన హీరో పేరు పడితే చాలు థియేటర్ల వద్ద పాలాభిషేకాలతో పండుగ వాతావరణం కనిపించేది. కథలో సత్తా ఎంత ఉందనే దానికంటే? తమ అభిమాన నటుడు తెరపై ఎంత మాస్‌గా కనిపించాడనేదే ప్రేక్షకుల ప్రాధాన్యతగా ఉండేది. కానీ మారుతున్న కాలంతో పాటు ప్రేక్షకుల సినిమా వీక్షణ అభిరుచిలోనూ విప్లవాత్మక మార్పులు ప్రారంభమయ్యాయి.
కొంత కాలంగా రిలీజ్ అవుతున్న సినిమాలు ఈ విషయాన్ని స్పష్టంగా నిరూపిస్తున్నాయి. కథలో బలం లేకపోతే ఎంతటి అగ్ర కథానాయకుడి చిత్రమైనా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతోంది. అదే సమయంలో కొత్త నటులతో.. పరిమిత బడ్జెట్‌తో వచ్చినప్పటికీ బలమైన కథాంశం ఉన్న చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ పరిణామం సినిమా పరిశ్రమలో నటుడి కంటే కథ మాత్రమే అసలైన హీరో అని స్పష్టం చేస్తోంది.
మరో ఐదేళ్ల కాల వ్యవధిని పరిశీలిస్తే ఈ ధోరణి మరింత తీవ్రస్థాయికి చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డిజిటల్ విప్లవం, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల విస్తృతి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంటెంట్‌ను ప్రేక్షకులు రోజూ వీక్షిస్తున్నారు. దీంతో సాధారణ సినిమా ప్రేమికుడి కథా గ్రహణ శక్తి ఊహించని రీతిలో పెరిగింది. కేవలం స్టార్ హీరోల గ్లామర్, నాలుగు ఫైట్లు, ఆరు పాటలతో కూడిన పాత మూస ఫార్ములాలు ఐదేళ్ల తర్వాత పూర్తిగా కాలం చెల్లినవిగా మారడం ఖాయం.
ఈ మార్పుతో తెరవెనుక ఉండే దర్శకులు, రచయితలే అసలైన మాస్ హీరోలుగా అవతరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రేపటి తరంలో అభిమానులు థియేటర్‌కు వచ్చేది కథానాయకుడి కోసం కాదు. ఆ కథను సృష్టించిన రచయిత ఆలోచన కోసం, దానిని తెరపై ఆవిష్కరించే దర్శకుడి విజన్ కోసం మాత్రమే. రాజమౌళి, ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్ వంటి దర్శకుల పేర్లు నేడు ఏ విధంగా బిజినెస్‌ను తిరగరాస్తున్నాయో.. ఐదేళ్ల తర్వాత ఆ సంస్కృతి పరిశ్రమ వ్యాప్తంగా కనిపించే ఛాన్స్ ఉంది.
కథనాన్ని ఆసక్తికరంగా మలచడం, సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించడం, పాత్రల్లో లోతును చొప్పించడం వంటివి రాబోయే రోజుల్లో అతిపెద్ద నైపుణ్యాలుగా మారతాయి. దర్శకుడి మేకింగ్ స్టైల్, రచయిత ప్రతిభను బట్టే సినిమా ఓపెనింగ్స్ ఆధారపడి ఉంటాయి. హీరోలు కూడా వ్యక్తిగత ఇమేజ్ కంటే కథలోని పాత్రకు ఎంతవరకు న్యాయం చేయగలమనే దానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
మొత్తానికి రాబోయే ఐదేళ్లలో చిత్ర పరిశ్రమ ఓ సరికొత్త రొటేషన్ సైకిల్ లోకి వెళ్లనుంది. వెండితెరపై మెరిసే నటులు కేవలం రచయితలు, దర్శకుల ఊహలకు రూపాన్ని ఇచ్చే వాహకాలుగా మాత్రమే ఉంటారు. ఆ ఊహలకు ప్రాణం పోసే సృష్టికర్తలే ప్రేక్షకుల దృష్టిలో నిజమైన సూపర్‌స్టార్లుగా నిలుస్తారనడంలో సందేహం లేదు. పూరి, వర్మ, రాజమౌళి రేంజ్ లో క్రియేటర్స్ అంతా ఫేమస్ అవ్వడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి.