'రిసార్ట్ కు రమ్మన్నారు'.. తెలుగు యువతి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు

సోషల్ మీడియాతోపాటు సినీ వర్గాల్లో క్యాస్టింగ్ కౌచ్ పై ఇప్పుడు మరోసారి చర్చలు మొదలయ్యాయి.;

Update: 2026-04-03 08:32 GMT

సోషల్ మీడియాతోపాటు సినీ వర్గాల్లో క్యాస్టింగ్ కౌచ్ పై ఇప్పుడు మరోసారి చర్చలు మొదలయ్యాయి. ఒక తెలుగు ఇన్ ఫ్లుయెన్సర్ చేసిన తీవ్ర ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో వెంటనే స్పందించిన యాంకర్ ఝాన్సీ.. ఫిర్యాదు చేయాలని సూచించారు.

న్యూయార్క్‌ కు చెందిన పికు నేమలి అనే ఇన్‌ స్టాగ్రామ్ యూజర్‌ నేమ్‌ తో ఉన్న ఓ ఎన్నారై తెలుగు యువతి, ఇటీవల తనకు ఎదురైన అనుభవాలు వీడియో రూపంలో పంచుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించే క్రమంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులు ఆమె వివరించింది. తనకు తెలిసిన వారి ద్వారా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తో పరిచయం ఏర్పడినట్లు తెలిపారు.

అయితే తాను నటిగా అవకాశాలు దక్కించుకోవాలనే ఉద్దేశంతో తన ఫోటోలు, పోర్ట్‌ ఫోలియోను ఆ వ్యక్తికి పంపారట. ఆ ప్రక్రియలో వారి మధ్య ఫోన్ సంభాషణ కూడా జరిగినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో తాను సినీ ఇండస్ట్రీపై పూర్తి ఆసక్తి ఉన్నట్లు తెలియజేశానని చెప్పింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తనను కలచివేశాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ వ్యక్తి ఫోన్ చేసి, ఒక ప్రముఖ నిర్మాతను కలవడానికి భారత్‌ లోని ఓ రిసార్ట్‌ కు రావాలని ఆహ్వానించారని సదరు యువతి ఆరోపించారు. ఆ ఆహ్వానం వెనుక ఉన్న అసలు ఉద్దేశం తనకు అర్థమైన తర్వాత వెంటనే ఆ వ్యక్తిని బ్లాక్ చేసినట్లు చెప్పారు. ఆ విషయంలో తాను తీవ్ర నిరాశకు గురయ్యానని, ఇలాంటి అనుభవాల కారణంగా ఎంతో మంది టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలు సినిమా రంగంలోకి రావడానికి వెనకడుగు వేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

పరిశ్రమలో ఉన్న ఈ తరహా పరిస్థితులు మారాలని, నిజమైన ప్రతిభకు అవకాశాలు కల్పించాలని కోరారు. ఆమె మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారగా.. అనేక మంది నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమె ధైర్యాన్ని అభినందిస్తుండగా.. మరికొందరు ఆమె ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్ ఝాన్సీ వెంటనే స్పందించారు. ఘటనపై అధికారికంగా ఫిర్యాదు చేయాలని సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా, తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే ఇలాంటి ఆరోపణలు రావడం కొత్త విషయం కాదు. గతంలో కూడా కాస్టింగ్ కౌచ్‌ పై పలువురు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ప్రతి ఘటనను సీరియస్‌ గా తీసుకుని, నిజానిజాలను వెలికితీయడం అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి తెలుగు యువతి ఆరోపణల విషయంలో చివరకు ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.



Tags:    

Similar News