సమ్మర్ 2027.. తప్పుకునేది ఎవరు?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నడూ లేని విధంగా 2027 సమ్మర్ సీజన్ కోసం భారీ చిత్రాలు క్యూ కడుతున్నాయి.;
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నడూ లేని విధంగా 2027 సమ్మర్ సీజన్ కోసం భారీ చిత్రాలు క్యూ కడుతున్నాయి. ఒకే ఏడాది, అదీ కేవలం మూడు నాలుగు నెలల గ్యాప్ లోనే టాలీవుడ్ టాప్ హీరోలందరూ బాక్సాఫీస్ బరిలోకి దిగడం అంటే మామూలు విషయం కాదు. వెయ్యి కోట్ల బడ్జెట్ సినిమాలు, పాన్ వరల్డ్ స్థాయి కథలతో మన దర్శకులు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ ప్రకటనలు వినడానికి బాగానే ఉన్నా, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అనుకున్న టైమ్ కి ఈ సినిమాలన్నీ రావడం కష్టమనే చర్చ ఫిలిం నగర్ లో మొదలైంది.
రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ జూన్ 11న వస్తుందని క్లారిటీ ఇచ్చారు. దీనికంటే ముందే ప్రభాస్ సందీప్ వంగా ‘స్పిరిట్’ మార్చి 5న, మహేష్ బాబు రాజమౌళి ‘వారణాసి’ ఏప్రిల్ 7న విడుదల చేయాలని ప్లాన్ లో ఉన్నారు. ఈ లెక్కన చూస్తే ప్రతి నెలా ఒక భారీ సినిమా థియేటర్లను ఊపేయాలి. కానీ షూటింగ్ ప్రోగ్రెస్, నటీనటుల డేట్స్ గమనిస్తే, ఈ షెడ్యూల్స్ అన్నీ తారుమారయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
ప్రభాస్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ కోసం తీసుకుంటున్న టైమ్ వల్ల ‘స్పిరిట్’ సమ్మర్ రేసు నుంచి తప్పుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది..ప్రస్తుతానికి రాజమౌళి ‘వారణాసి’ మరియు ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ మాత్రమే పక్కాగా సమ్మర్ విండోను లాక్ చేసుకున్నట్లు కనిపిస్తున్నాయి. రాజమౌళి సినిమా అంటే ప్లానింగ్ వేరే లెవల్లో ఉంటుంది కాబట్టి, ఆయన చెప్పిన టైమ్ కి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అల్లు అర్జున్ అట్లీ కాంబోలో వస్తున్న ‘రాకా’ మాత్రం హెవీ వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా 2027 సమ్మర్ కి రావడం అసాధ్యమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఒకవేళ స్పిరిట్ గనుక వాయిదా పడితే, మహేష్ బాబు సినిమాకు సోలోగా లక్కీ ఛాన్స్ దక్కుతుంది. సాధారణంగా ఇలాంటి భారీ చిత్రాల మధ్య కనీసం 30 రోజుల గ్యాప్ ఉంటేనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ఇంపాక్ట్ ఉండదు. మార్చిలో స్పిరిట్ వచ్చి, ఏప్రిల్ లోనే వారణాసి వస్తే థియేటర్ల షేరింగ్, వసూళ్ల పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే మేకర్స్ కూడా ఈ క్లాష్ ఉండకూడదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, షూటింగ్ స్పీడ్ ను బట్టి రిలీజ్ డేట్స్ లో మరిన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. ఏ హీరో సినిమా ఎప్పుడు వస్తుందో అనే ఉత్కంఠ ఇప్పుడు అభిమానుల్లో మొదలైంది. ఏదేమైనా 2027 సమ్మర్ రేసు చాలా ఆసక్తికరంగా మారనుంది. కొందరు హీరోలు రికార్డుల వేటలో ఉంటే, మరికొందరు క్వాలిటీ కోసం వెనక్కి తగ్గేలా కనిపిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాల్లో ఏది నిలబడుతుంది, ఏది వాయిదా పడుతుందనేది మరికొన్ని నెలల్లో తేలిపోనుంది.