బడ్టెట్ తో కాదు..కంటెంట్ తో కొట్టిన మొనగాళ్లు!
నట సింహ బాలయ్య కూడా అదే సీజన్ లో `డాకు మహారాజ్` తో వచ్చారు. ఈ సినిమా కూడా డివైడ్ టాక్ నే సొంతం చేసుకుంది.;
కంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేదని తెలుగింట ఎన్నో పరభాషా చిత్రాలు ప్రూవ్ చేసాయి. టాలీవుడ్ లో అలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు పరిమితంగానే కనిపిచడంతో? ఆ సంఖ్య పెరిగేదెప్పుడు? అనే అసం తృప్తి కనిపించేది. కానీ 2025 లో ఇప్పటి వరకూ ఆ అసంతృప్తి కాస్త సంతృప్తిగానే కనిపిస్తుంది. భారీ బడ్జెట్ చిత్రాలు కంటే మీడియం బడ్జెట్ చిత్రాలే మంచి ఫలితాలు సాధించాయి. ఏడాది రంభంలో రామ్ చరణ్ నటించిన `గేమ్ ఛేంజర్` భారీ బడ్జెట్ తో నిర్మాణమైంది. 300 కోట్ల ప్రాజెక్ట్ ఇది. కానీ సినిమా ఫలితం కనీసం రికవరీ కూడా చేయలేకపోయింది.
బోల్తా కొట్టిన అగ్ర హీరోలు:
నట సింహ బాలయ్య కూడా అదే సీజన్ లో `డాకు మహారాజ్` తో వచ్చారు. ఈ సినిమా కూడా డివైడ్ టాక్ నే సొంతం చేసుకుంది. 100 కోట్ల బడ్జెట్ సినిమా లాంగ్ రన్ లో 130 కోట్లే రాబట్టింది. ఈ వసూళ్లు నిర్మాతకు ఏమాత్రం సంతోషాన్ని కలిగించేవి కాదు. ఇదే సీజన్ లో వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం 'రిలీజ్ అయింది. 30 కోట్ల బడ్జెట్ సినిమా ఏకంగా 300 కోట్ల వసూళ్లను రాబట్టింది. 25 ఏళ్ల తర్వాత వెంకటేష్ కు ఇండస్ట్రీ హిట్ అందించింది. సరిగ్గా ఆరు నెలల తర్వాత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'వార్-2', 'కూలీ' రిలీజ్ అయ్యాయి.
రికార్డు వసూళ్లతో కాక పుట్టించిన చిత్రాలు:
అటుపై పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' పాన్ ఇండియలో రిలీజ్ అయింది. ఇవన్నీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలే. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినవే. వీటీ వైఫల్యానికి కారణం ఏంటి? అంటే రకరకాల కారణాలు తెరపైకి వచ్చినా? కంటెంట్ వైఫల్యం అన్నది ప్రధానంగా హైలైట్ అయింది. వీటితో పాటే మీడియం బడ్జెట్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి.నాగ చైతన్య నటించిన 'తండేల్', ముగ్గురు యువ హీరోలు నటించిన 'మ్యాడ్ స్క్వేర్', నాని నటించిన 'హిట్ 3', ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన 'కోర్టు' లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు చిత్రాలు రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేసాయి.
దాసరి చెప్పింది నిజమైన వేళ:
ఇవి సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే అందులో కంటెంట్ అన్నది ప్రధానంగా హైలైట్ అ యింది కాబట్టే సక్సెస్ సాధ్యమైంది. అందులో నటించిన నటులెవరూ వందల కోట్లు మార్కెట్ ఉన్న వారు కాదు. పాన్ ఇండియా స్టార్లు అంతకన్నా కాదు. కేవలం కంటెంట్ ఆధారంగా మాత్రమే ప్రేక్షకుల్ని థియేటర్ కు రప్పించగలిగారు. ఇటీవల రిలీజ్ అయిన `లిటిల్ హార్స్ట్` ,` కొత్త లోక్ చాప్టర్ వన్` సిని మాలకు కూడా ప్రేక్షకుల నుంచి గొప్ప స్పందన వస్తోంది.తెలుగు ఇండస్ట్రీ సహా ప్రేక్షకుల్లో మార్పు ఏ స్థాయిలో వచ్చిందనడానికి ఈ విజయాలు ఓ మచ్చుతునక లాంటివి. ఇండస్ట్రీ సేవియర్స్ గా నిలిచేవి దాసరి నారాయణరావు చెప్పినట్లు చిన్న చిత్రాలు మాత్రమేనని మరోసారి రుజువైంది.