థగ్ లైఫ్ నష్టం కమల్‌కా? కన్నడిగులకా?
మొత్తం మీద కర్ణాటక వివాదంతో థగ్ లైఫ్ సినిమాకు ఊహించని పబ్లిసిటీ దక్కింది. నాయగన్ సినిమా తర్వాత మణిరత్నం, కమల్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.;
సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న థగ్ లైఫ్ రిలీజ్ డే వచ్చేసింది. అప్పుడెప్పుడో 38 ఏళ్ల కిందట కమల్ హాసన్, మణిరత్నం కలిసి చేసిన నాయగన్ సినిమా తర్వాత ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి పని చేసింది లేదు. నాయగన్ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
అయితే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత వీరి కలయికలో థగ్ లైఫ్ సినిమా వచ్చింది. ఈ సినిమా నాయగన్ ను మించి ఉంటుందని మీడియా ముందుకొచ్చిన ప్రతీసారీ చెప్తూ సినిమాపై అంచనాలను పెంచాడు కమల్ హాసన్. దానికి తోడు కన్నడ భాషకు సంబంధించి కమల్ చేసిన కామెంట్స్ థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో బ్యాన్ చేసే వరకు తీసుకెళ్లాయి.
మొత్తం మీద కర్ణాటక వివాదంతో థగ్ లైఫ్ సినిమాకు ఊహించని పబ్లిసిటీ దక్కింది. నాయగన్ సినిమా తర్వాత మణిరత్నం, కమల్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అడ్వాన్సు బుకింగ్స్ కూడా బాగానే జరిగాయి. యూఎస్ ప్రీమియర్ల నుంచి మిక్డ్స్ టాక్ వేకువఝాముకే రాగా, ఇండియాలో కూడా థగ్ లైఫ్ ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయిందనే మాటే వినిపిస్తోంది.
కర్ణాటక వివాదంలో సారీ చెప్పకుండా వివాదాన్ని కోర్టు వరకు తీసుకెళ్లిన కమల్ ఆ రాష్ట్రంలో బ్యాన్ కావడం కన్నడిగులకే నష్టమని నిరూపించాలంటే థగ్ లైఫ్ సినిమా బ్లాక్ బస్టర్ కావాలి. సినిమాకు మంచి టాక్ వచ్చి భారీ వసూళ్లను అందుకుంటేనే అది సాధ్యమవుతుంది. కానీ థగ్ లైఫ్ టాక్ చూస్తుంటే అలా లేదు. దీంతో ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాకు ట్రోలింగ్ తప్పదనే భావిస్తున్నారంతా. చూస్తుంటే ఇండియన్2 డిజాస్టర్ తర్వాత థగ్ లైఫ్ కూడా కమల్ కు మరో చేదు ఫలితాన్నే మిగిల్చేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఆడియన్స్ నుంచి ఒరిజినల్ టాక్ రావాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.