విజయ్‌కి 'పెళ్లిచూపులు'.. తిరువీర్‌కు 'ప్రీ వెడ్డింగ్ షో'!
ఈ వారం చిన్న సినిమాగా విడుదలై, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న చిత్రం 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'.;
ఈ వారం చిన్న సినిమాగా విడుదలై, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న చిత్రం 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. తిరువీర్, టీనా శ్రావ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు, ముఖ్యంగా పెయిడ్ ప్రీమియర్ల నుంచే మంచి రెస్పాన్స్ వస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమా చూసిన ఒక ప్రముఖ జర్నలిస్ట్, ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ కెరీర్‌ను మార్చేసిన 'పెళ్లిచూపులు' సినిమాతో పోల్చడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆయన మాట్లాడుతూ, "ఈ సినిమా ప్రీమియర్లు వేస్తున్నారని తెలిసినప్పుడు, ఒక చిన్న సినిమాకు ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నారా అనిపించింది. కానీ, సినిమా చూశాక నా అభిప్రాయం పూర్తిగా మారింది. అందుకే నిన్న రాత్రి ఒక ట్వీట్ కూడా వేశాను. విజయ్ దేవరకొండకు 'పెళ్లిచూపులు' ఎలాగో, తిరువీర్‌కు 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అలాంటి సినిమా" అని ఆయన గట్టిగా చెప్పారు.
కేవలం రైమింగ్ కోసం ఆ మాట అనలేదని, దానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. "పెళ్లిచూపులులో విజయ్ దేవరకొండ ఎంత సహజంగా, తన క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడో.. ఈ సినిమాలో తిరువీర్ కూడా శ్రీకాకుళం యాసలో అంత అద్భుతంగా, నాచురల్‌గా నటించాడు. కొన్నిసార్లు అసలు డైలాగ్స్ రాశారా లేక ఆయనే సొంతంగా చెప్పేశారా అనిపించింది" అని ఆయన అన్నారు.
అంతేకాదు, 'పెళ్లిచూపులు'లో ప్రియదర్శి పాత్ర ఎంత బాగా పేలిందో, ఈ సినిమాలో నరేంద్ర క్యారెక్టర్ కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంటుందని అన్నారు. అలాగే, హీరోయిన్ టీనా శ్రావ్య కూడా ఎక్కడా హీరోయినిజం చూపించకుండా, ఒక పక్కింటి అమ్మాయిలా చాలా సహజంగా చేసిందని ప్రశంసించారు.
ఈ సినిమాకు మరో బలం సురేష్ బొబ్బిలి సంగీతం అని ఆ జర్నలిస్ట్ అభిప్రాయపడ్డారు. "పెళ్లిచూపులులో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కలిసి ఎలాంటి కొత్త ప్రయోగాలు చేశారో, ఈ సినిమాలో కూడా డైలాగ్స్ లేని చోట మ్యూజిక్‌తోనే ఫీల్‌ను అద్భుతంగా పలికించారు. ప్రేక్షకులు కూడా ఆ చిన్న చిన్న మ్యూజిక్ బిట్స్‌ను బాగా ఎంజాయ్ చేశారు" అని తెలిపారు.
ముఖ్యంగా డైరెక్టర్‌ను మెచ్చుకుంటూ, "డైరెక్టర్ తాను ఏదైతే కథ అనుకున్నాడో, ఎక్కడా కమర్షియల్ హంగుల కోసం పక్కకు వెళ్లకుండా, అదే ఫ్లోలో నిజాయితీగా తీశాడు. ఇదే సినిమా మలయాళంలో వచ్చి ఉంటే, అందరూ 'మస్ట్ వాచ్' అని పొగిడేవారు. అలాంటి ఒక మంచి ఫీల్ ఉన్న సినిమా ఇది" అని ప్రశంసలు కురిపించారు.