థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. డిజిటల్/ సాటిలైట్ రంగంలో సూపర్ హిట్ అయిన చిత్రాలివే!
అయితే, అవే సినిమాలు టీవీల్లో వచ్చినప్పుడు లేదా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి వచ్చినప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి.;
సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు, కానీ అది ఎప్పుడు అనేది మాత్రం ఒక్కోసారి కాలమే నిర్ణయిస్తుంది. కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైనప్పుడు సరైన టైమింగ్ లేకనో, లేదా అప్పటి ప్రేక్షకుల అభిరుచికి భిన్నంగా ఉండటం వల్లనో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటాయి. అయితే, అవే సినిమాలు టీవీల్లో వచ్చినప్పుడు లేదా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి వచ్చినప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే, థియేటర్లు మిస్ చేసుకున్న ఒక 'కల్ట్' క్లాసిక్‌ను డిజిటల్ వేదికలు అక్కున చేర్చుకుంటున్నాయి.
డిజిటల్ విప్లవం - మారిన ప్రేక్షకుల తీర్పు:
ప్రస్తుతం ఓటీటీల కాలం నడుస్తోంది. ఒకప్పుడు థియేటర్ రన్ ముగిస్తే సినిమా పని అయిపోయింది అనుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. 'వన్ నేనొక్కడినే', 'డియర్ కామ్రేడ్', 'అంతరిక్షం' వంటి సినిమాలు థియేటర్లలో కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో మిలియన్ల వ్యూస్ సాధించాయి. ప్రేక్షకుడికి ప్రశాంతంగా, తనకి నచ్చిన సమయంలో సినిమా చూసే వెసులుబాటు కలగడంతో, అప్పుడు మిస్ అయిన పాయింట్స్ ఇప్పుడు అర్థమవుతున్నాయి. దీంతో అప్పట్లో ప్లాప్ అని ముద్ర పడ్డ సినిమాలు, ఇప్పుడు 'మాస్టర్ పీస్'లుగా కీర్తించబడుతున్నాయి. ఈ మార్పు కేవలం సినిమా మేకింగ్ మీద మాత్రమే కాదు, విశ్లేషించే విధానం మీద కూడా గొప్ప ప్రభావం చూపుతోంది.
కాలం దాటిన కథలు:
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'అతడు' సినిమా థియేటర్లలో యావరేజ్‌గా ఆడినా, టీవీల్లో మాత్రం ఒక రికార్డు. ఎన్నిసార్లు వేసినా బోర్ కొట్టని స్క్రీన్ ప్లే దాని సొంతం.అసలు మా టీవీ లో ఎక్కువ సార్లు ప్లై చేసిన మూవీ కూడ ఇదే. ఇక 'ఖలేజా' పరిస్థితి మరీ విచిత్రం. థియేటర్లలో ఫ్లాప్ అనిపించుకున్న ఈ మూవీ, ఇప్పుడు మీమ్స్ రాయుళ్లకు, యూత్ కు ఫేవరెట్. త్రివిక్రమ్ మార్క్ డైలాగులు ఇప్పుడు అందరికీ అమితంగా నచ్చుతున్నాయి. ఇక అలాగే రామ్ చరణ్ 'ఆరెంజ్'. ప్రేమలోని నిజాయితీని చాటి చెప్పిన ఈ సినిమా విడుదలైనప్పుడు డిజాస్టర్ అయ్యింది. కానీ నేటి తరం ప్రేమికులకు ఇది ఒక గైడ్ లాంటిది. విశేషం ఏమిటంటే అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి.అందుకే రీ-రిలీజ్‌లో కూడా ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ రావడం విశేషం. ఇలాంటి చిత్రాలు బాక్సాఫీస్ లెక్కలకు అతీతంగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి.
బాక్సాఫీస్ కలెక్షన్లు మాత్రమే సినిమా స్థాయిని నిర్ణయించలేవు అనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. థియేటర్ లో పరాజయం పాలైనా, ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ సినిమాలు నిజమైన విజేతలు.