రిలీజై వెళ్లిపోయాకా సెన్సార్‌పై సమీక్షలా?
వివాదాల కారణంగా ఇటీవల ఎక్కువగా చర్చల్లోకి వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన విజయం సాధించిందా? అంటే.. దానికి క్రిటిక్స్ పెదవి విరిచేసారు.;
విలక్షణ నటుడు పరేష్ రావల్ నటించిన `ది తాజ్ స్టోరి` పోస్టర్ దశ నుంచే వివాదాలను మోసుకొచ్చిన సంగతి తెలిసిందే. టీజర్ లో తాజ్ మహల్ మీదుగా శివాలయం గోపురాన్ని ప్రదర్శించడంతో ఇది తీవ్ర దుమారం రేపింది. వివాదాల కారణంగా ఇటీవల ఎక్కువగా చర్చల్లోకి వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన విజయం సాధించిందా? అంటే.. దానికి క్రిటిక్స్ పెదవి విరిచేసారు.
ఈ సినిమా కథాంశ ఆసక్తికరం. కోర్ట్ రూమ్ డ్రామాను రక్తి కట్టించారు. ఇందులో పరేష్ రావల్ పర్యాటక ప్రాంతంలో టూరిస్ట్ గైడ్ పాత్రను పోషించాడు. తాజ్ మహల్ నిర్మాణానికి ముందే ఆ స్థలంలో శివాలయం ఉండేదని నమ్మేవాడిగా అతడు కనిపించాడు. అయితే ఈ సినిమా ఆద్యంతం సుదీర్ఘంగా సాగే కోర్ట్ రూమ్ డ్రామాలతో విసుగెత్తించిందని సమీక్షకులు తేల్చేసారు. ఇది కేవలం ఒక సెక్షన్ ఆడియెన్ కోసం మాత్రమే. తాజ్ మహల్ స్టోరీపై ఆసక్తి ఉన్న ప్రేక్షకులు తప్ప ఇతరులు థియేటర్లకు వెళ్లేందుకు అవకాశం లేదని కూడా విశ్లేషిస్తున్నారు.
ఇదంతా ఒకెత్తు..వివాదాలు మరో ఎత్తు. సినిమా విడుదలైంది.. థియేటర్లలో ఆడుతోంది. అయినా ఇప్పటికీ ఈ సినిమాని కోర్ట్ వివాదాలు వదిలి పెట్టడం లేదు. తాజాగా `ది తాజ్ స్టోరీ`కి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్.సి) మంజూరు చేసిన సర్టిఫికేషన్‌ను సమీక్షించాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్‌లను ఢిల్లీ హైకోర్టు పరిశీలించింది. అయితే పిటిషన్లు చెల్లవని కోర్టు తిరస్కరించింది. `ది తాజ్ స్టోరి` చిత్రం కల్పిత వాస్తవాలతో రూపొందించినది. తాజ్ మహల్ గురించి తప్పుడు సమాచారాన్ని చూపించడానికి తారుమారు చేసిన చరిత్రను వ్యాప్తి చేయడానికి ఒక నిర్దిష్ట ప్రచారం అంటూ పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే సీబీఎఫ్ సి నిర్ణయాన్ని పునః సమీక్షించాలని కోరుతు కేంద్ర ప్రభుత్వాన్ని కోరవచ్చని కోర్టు సూచించింది. అనంతరం న్యాయవాదులు తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. ది తాజ్ స్టోరి చరిత్రను వక్రీకరిస్తోందని, ఈ సినిమాని రిలీజ్ ని ఆపాలని కోరుతూ గతంలోను కోర్టులో పలువురు పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే.
ఇది రెచ్చగొట్టే స్వభావం ఉన్న స్టోరి. మతపరమైన చర్చకు, వివాదాలకు కారణం కావచ్చు, మతపరమైన ఉద్రిక్తతలకు కూడా దారితీయవచ్చు అంటూ కోర్టులో పిటిషనర్లు వాదించారు. ఈ చిత్రంలో టూరిస్ట్ గైడ్ పాత్రలో నటించిన రావల్ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ స్మారక చిహ్నం అయిన తాజ్ మహల్ కి సంబంధించిన అనుమానిత రహస్యాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తాడు. చరిత్రను సరిగా అధ్యయనం చేయకుండా ఈ సినిమా తీసారని కూడా కొందరు వాదించారు. అయతే చరిత్ర రాసే ప్రతి ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండవని కోర్టు చాలా పిటిషన్లను తిరస్కరించింది.