నాని 'ప్యారడైజ్'.. ఈసారి రిస్క్ ఉన్నా నమ్మకంతోనే!

ఒక సినిమా థియేటర్లలో ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోతే.. ఓటీటీలోకి వచ్చేటప్పటికైనా కొన్ని ఛేంజెస్ చేస్తారని ఆశిస్తారు.

Update: 2026-10-10 17:20 GMT

ఒక సినిమా థియేటర్లలో ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోతే.. ఓటీటీలోకి వచ్చేటప్పటికైనా కొన్ని ఛేంజెస్ చేస్తారని ఆశిస్తారు. ముఖ్యంగా ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చిన సీన్స్ తొలగించడం, సినిమా రన్ టైమ్ తగ్గించడం వంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్ విషయంలో అదే జరుగుతుందని వార్తలు వచ్చినా.. అది నిజం కాదట.

థియేట్రికల్ వెర్షన్ లోని లేని ఓ పాటను ఓటీటీ వెర్షన్ కు యాడ్ చేస్తారని, కొన్ని సీన్స్ తిరిగి ఎడిట్ చేస్తున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. వారం రోజుల క్రితమే సినిమాను నెట్‌ ఫ్లిక్స్‌ కు అందించామని, ఓటీటీ వెర్శన్ కోసం ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు అంటే థియేటర్లలో చూసిన సినిమానే సినీ ప్రియులు ఓటీటీలో కూడా చూడబోతున్నారన్నమాట.

నిజానికి దసరా మూవీ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలిసి చేసిన సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్‌ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో నాని జడల్ రోల్ లో కనిపించారు. 1980ల నాటి హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఆ స్టోరీలో కొన్ని వర్గాల హక్కుల కోసం పోరాటాన్ని చూపించారు. నాని లుక్, యాక్టింగ్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనిరుధ్ సంగీతానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే సినిమా మొత్తం ఇదే స్థాయిలో మెప్పించలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో స్టోరీ స్లో అవ్వడం, కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్స్ సరిగా పండకపోవడం విమర్శలకు కారణమయ్యాయి. సినిమా రన్ టైమ్ ఎక్కువగా ఉండటంతో కొన్ని చోట్ల సాగదీసినట్లు అనిపించిందని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీ కోసం ఎలాంటి ఛేంజెస్ చేయకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా థియేటర్లలో వచ్చే రెస్పాన్స్ ను బట్టి ఓటీటీ వెర్షన్‌ లో చిన్నచిన్న మార్పులు చేస్తుంటారు మేకర్స్. అవసరమైన చోట రన్ టైమ్ తగ్గిస్తారు. ప్రేక్షకులకు నచ్చని సీన్స్ ను రిమూవ్ చేస్తుంటారు. దీనివల్ల ఇంట్లో సినిమా చూసే ఆడియన్స్ కు మరింతగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ‘ది ప్యారడైజ్ మూవీ టీమ్ మాత్రం అదే వెర్షన్‌ పై నమ్మకంతో ముందుకు వెళ్తోంది.

అయితే ఆ నిర్ణయంలో కొంత రిస్క్ కూడా ఉంది. థియేటర్లలో వచ్చిన విమర్శలే ఓటీటీలోనూ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంట్లో సినిమా చూసే ఆడియన్స్ నచ్చని సీన్స్ ను స్కిప్ చేయడంతోపాటు స్టోరీలో స్పీడ్ తగ్గితే వెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది. మరోవైపు, థియేటర్లలో సినిమా చూడలేకపోయిన ప్రేక్షకులకు ఓటీటీ మంచి ఛాన్స్ గా మారొచ్చు. కొందరు ప్రేక్షకులు సినిమాను మరో యాంగిల్ చూసి ఆదరించే అవకాశం కూడా ఉంది. అందుకే ఓటీటీ విడుదల తర్వాత ప్యారడైజ్ మూవీకి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు వేచి చూడాలి.

Tags:    

Similar News