కూతురి కోసం తండ్రి పోరాటం.. 'నాన్నకుట్టి' ట్రైలర్ ఎలా ఉందంటే!
| విజయ్ ఆంటోనీ నటించిన ‘నాన్నకుట్టి’ ట్రైలర్ విడుదలైంది. తల్లి లేని కూతురు దియాను పెంచే సింగిల్ ఫాదర్‌గా విజయ్ కనిపించనున్నారు. కూతురి కోసం తండ్రి చేసే పోరాటం, కోర్టు రూమ్ డ్రామా, యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి. ము మారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
విజయ్ ఆంటోనీ సినిమాలంటేనే సెంటిమెంట్, సస్పెన్స్ కలగలిసిన కథలు గుర్తొస్తాయి. ఇప్పుడు ఆయన మరోసారి అలాంటి ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఎంయు మారన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నాన్నకుట్టి' ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజైంది. తల్లి లేని చిన్నారి దియాను కంటికి రెప్పలా చూసుకునే ఓ సింగిల్ ఫాదర్ జీవితంలో ఎదురైన కష్టమైన పరిస్థితుల చుట్టూ ఈ కథ నడుస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ట్రైలర్ ఆరంభంలో తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సహజంగా హైలెట్ అయ్యాయి. కూతురిని అమ్మలా చూసుకుంటూ పెంచే తండ్రి పాత్రలో విజయ్ ఆంటోనీ ఒదిగిపోయారు. పాపకు స్కూల్ టీచర్ గా ప్రీతి అస్రానీ కనిపిస్తున్నారు. దియా భవిష్యత్తు కోసం మరో పెళ్లి చేసుకోమని ఆమె సలహా ఇవ్వడం, కానీ తన కూతురికి అమ్మలా నేనే ఉండిపోతానని హీరో చెప్పే డైలాగ్స్ కథలోని ఎమోషనల్ యాంగిల్ ను చూపించాయి.
అయితే సాఫీగా సాగుతున్న వీళ్ల జీవితంలో అనుకోని చిక్కులు ఎదురవడంతో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. కూతురి కోసం తండ్రి చేసే పోరాటం కాస్తా పోలీస్ స్టేషన్, కోర్ట్ రూమ్ వరకు వెళ్తుంది. ముఖ్యంగా పాపకు మెడికల్ చెకప్ చేయించాలని లాయర్ అడిగే సీన్, దానికి కోపంతో హీరో కోర్టులోనే అతని గొంతు పట్టుకునే షాట్ ట్రైలర్ లో మెయిన్ హైలైట్ గా నిలిచింది. యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు మేకర్స్ పేర్కొన్నారు.
ఎమోషన్స్ తో పాటు విజయ్ ఆంటోనీ మార్క్ యాక్షన్ బ్లాక్స్ కూడా ఇందులో బాగానే దట్టించారు. బస్టాండ్ ఫైట్, బీచ్ దగ్గర వచ్చే యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే తండ్రీకూతుళ్ల సెంటిమెంట్, కోర్ట్ రూమ్ డ్రామా అనేది మన ప్రేక్షకులకు కొత్త పాయింట్ ఏమీ కాదు. ఆ తెలిసిన ఫార్మాట్ ను దర్శకుడు ఎంత గ్రిప్పింగ్ గా నడిపించారన్న దానిపైనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది.
విజయ్ ఆంటోనీ స్వయంగా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు సన్నివేశాల్లోని ఎమోషన్ ను బాగా క్యారీ చేశాయి. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై మీరా విజయ్ ఆంటోనీ, రామాంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ ఎంటర్ టైన్ మెంట్ ద్వారా ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.
నవంబర్ 27న 'నాన్నకుట్టి' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్ లో చూపించిన సెంటిమెంట్, కోర్ట్ రూమ్ ట్విస్టులు ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. మరి ఇప్పటికే బాక్సాఫీస్ బరిలో ఉన్న ఇతర సినిమాల పోటీని తట్టుకుని విజయ్ ఆంటోనీ ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.