హైదరాబాద్‌లో వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్‌తో 'మెగా మల్టీప్లెక్స్'
| మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్‌తో భారీ థియేటర్ ప్రాజెక్ట్ నిర్మించాలనేది తన తండ్రి కలని నిర్మాత ఏషియన్ సునీల్ నారంగ్ వెల్లడించారు. థియేటర్లతో పాటు కన్వెన్షన్ హాల్, భారీ సీటింగ్ సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టేందుకు స్థలం వెతుకుతున్నట్లు తెలిపారు. తొలి అడుగుగా చిరంజీవి కుమార్తె సుష్మితతో కలిసి సాలూరులో మూడు స్క్రీన్ల థియేటర్‌ను పునరుద్ధరిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ నారంగ్ తన తండ్రి కలలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ తో పాటు మెగా ప్రాజెక్టును నిర్మించాలనేది తన తండ్రి కల అని సునీల్ నారంగ్ వెల్లడించారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను థియేటర్లతో పాటు, కన్వెన్షన్ హాల్ సహా భారీ సీటింగ్ కెపాసిటీతో రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అందుకు తగిన అనువైన స్థలం కోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నామని.. త్వరలోనే ఆ స్థలం ఖరారై ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ భారీ ప్రాజెక్ట్‌కు నాందిగా ఒక ప్రాజెక్ట్‌పై ఇప్పటికే పనిచేస్తున్నట్లు సునీల్ నారంగ్ పేర్కొన్నారు. చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల భాగస్వామ్యంతో ఇప్పటికే సాలూరులో ఉన్న మూడు స్క్రీన్ల థియేటర్ సముదాయాన్ని పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. తొలి అడుగుగా ఈ ప్రాజెక్ట్ ఎంతో అవసరమని.. ఇదే సమయంలో మెగా థియేటర్ కోసం అనువైన లొకేషన్‌ను కూడా చురుగ్గా వెతుకుతున్నట్లు వివరించారు.
భవిష్యత్తులో భారీ స్థాయిలో థియేటర్, కన్వెన్షన్ సెంటర్‌ను ఒకేచోట అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో తాము ముందుకు సాగుతున్నామని సునీల్ నారంగ్ స్పష్టం చేశారు. తన తండ్రి ఆశయానికి.. మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దేందుకు తగిన స్థలం త్వరలోనే దొరుకుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
మెగా ప్రాజెక్టు కంటే ముందే...!
ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ తెలుగు సినీ ప్రముఖులతో కలిసి పలు అధునాతన శైలిలో భారీ మల్టీప్లెక్సులు (మాల్స్) నిర్మించి ఎగ్జిబిషన్ రంగంలో కొత్త ఒరవడి సృష్టించారు. సూపర్‌స్టార్ మహేష్ బాబుతో కలిసి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి వద్ద ఏఎంబీ సినిమాస్ ను ప్రారంభించి.. ప్రీమియం సౌండ్-స్క్రీనింగ్ అనుభవంతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త మల్టీప్లెక్స్ స్టాండార్డ్స్ ను పరిచయం చేశారు. అదే తరహాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ భాగస్వామ్యంతో ఏవీడీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ వెంచర్‌ను ప్రారంభించి.. మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాల్లోనూ అత్యాధునిక థియేటర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు.
వీటికి కొనసాగింపుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ లోని సత్యం థియేటర్ ప్రాంగణంలో AAA సినిమాస్ ను అత్యాధునిక మల్టీప్లెక్స్‌గా తీర్చిదిద్దారు. వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాల్స్, వినోద కేంద్రాలతో కూడిన ఈ మల్టీప్లెక్స్ ప్రాజెక్టులు కేవలం సినిమా ప్రదర్శనలకే పరిమితం కాకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ డెస్టినేషన్లుగా నిలిచాయి. స్టార్ హీరోల బ్రాండ్ ఇమేజ్‌కు ఏషియన్ సినిమాస్ ఎగ్జిబిషన్ నైపుణ్యం తోడవడంతో.. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ మల్టీప్లెక్స్ సంస్కృతి వేగంగా విస్తరించింది.