టాలీవుడ్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్న నాని!
బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కల్కి 2898ఏడీ వంటి సినిమాల సక్సెస్‌ల తర్వాత తెలుగు హీరోలు, డైరెక్టర్లు పాన్ ఇండియా మార్కెట్‌ను మెయిన్ టార్గెట్ గా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు
ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన టాలీవుడ్ మార్కెట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కల్కి 2898ఏడీ వంటి సినిమాల సక్సెస్‌ల తర్వాత తెలుగు హీరోలు, డైరెక్టర్లు పాన్ ఇండియా మార్కెట్‌ను మెయిన్ టార్గెట్ గా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. స్టోరీ సెలక్షన్ నుంచి ప్రమోషన్స్ వరకు ప్రతి అంశాన్ని జాతీయ స్థాయిని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రెండ్‌ను ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా మరింత దూకుడుగా అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది.
నాని తన కెరీర్ స్టార్టింగ్ నుంచే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన కూడా తెలుగు మార్కెట్‌ను దాటి ఇతర భాషల ఆడియన్స్ ను చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా దసరా సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి దేశవ్యాప్తంగా ప్రమోట్ చేశారు. ఆ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ, ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న, హిట్3 సినిమాలకు కూడా నాని ఇతర భాషల్లో ప్రమోషన్స్ చేసినప్పటికీ రిజల్ట్ మాత్రం పరిమితంగానే వచ్చాయి.
అయితే ఈ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న నాని ఇప్పుడు ది ప్యారడైజ్ విషయంలో మరింత వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేవలం తెలుగు సినిమా కాకుండా నేషనల్ లెవెల్ ప్రాజెక్టుగా నిలబెట్టాలన్న టార్గెట్ తో మేకర్స్ పనిచేస్తున్నారు. అందుకోసం భారీ స్థాయిలో పాన్ ఇండియా ప్రమోషన్స్‌కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ది ప్యారడైజ్ పై ఇప్పటికే మంచి బజ్ ఉంది. అయితే ప్యారడైజ్ మేకర్స్ అసలు దృష్టి నార్త్ మార్కెట్‌పైనే ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. హిందీ బెల్ట్‌లో రికార్డు రేంజ్ లో రిలీజ్ చేయాలనే ప్లాన్స్ కూడా రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇందుకోసం ట్రైలర్, సాంగ్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ ను అన్ని భాషల ఆడియన్స్ కు చేరేలా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అనిరుధ్ మ్యూజిక్ కూడా ప్యారడైజ్ సినిమాకు ఎక్స్‌ట్రా బలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌత్ తో పాటూ నార్త్ లోనూ ఆయనకు ఉన్న గుర్తింపు సినిమాకు ఉపయోగపడుతుందనే అంచనాలున్నాయి. ఇక ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఆ రేసు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అయితే రిలీజ్ డేట్ కంటే ముందు ట్రైలర్, మ్యూజిక్ ఎంతటి రెస్పాన్స్ తెచ్చుకుంటాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే పాన్ ఇండియా మార్కెట్‌లో కేవలం ప్రమోషన్స్ సరిపోవు. కంటెంట్‌తో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే ప్రమోషన్స్ కూడా అవసరం. టాలీవుడ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న పాన్ ఇండియా ధోరణిలో నాని కూడా తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. ది ప్యారడైజ్ ఆ ప్రయత్నాన్ని ఎంతవరకు సక్సెస్ చేస్తుందో చూడాలి.