మూవీ రివ్యూ : 'ద 100'..క్రైమ్ థ్రిల్లర్ను ఇష్టపడేవాళ్ళ కోసం!
మొగలి రేకులు సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించిన నటుడు ఆర్కే సాగర్. ఇప్పటికే హీరోగా రెండు సినిమాలు చేసినా బ్రేక్ రాలేదు.;
'ద 100' మూవీ రివ్యూ
నటీనటులు: ఆర్కే సాగర్- మిషా నారంగ్- ధన్య బాలకృష్ణన్- విష్ణు ప్రియ- ఆనంద్- కళ్యాణి నటరాజన్ తదితరులు
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు
మాటలు: సుధీర్ వర్మ పేరిచర్ల
నిర్మాతలు:రమేష్ కరుటూరి ,వెంకీ పుషడపు, జె. తారక రామ్
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్
మొగలి రేకులు సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించిన నటుడు ఆర్కే సాగర్. ఇప్పటికే హీరోగా రెండు సినిమాలు చేసినా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పుడతను 'ద 100' అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం సాగర్ కోరుకున్న విజయాన్ని అందించేలా ఉందా? చూద్దాం పదండి.
కథ:
విక్రాంత్ (ఆర్కే సాగర్) యువ ఐపీఎస్ అధికారి. ట్రైనింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ సిటీలో ఏసీపీగా చేరిన అతడికి ఒక కేసు సవాలుగా మారుతుంది. అమావాస్య రోజు దొంగతనాలు చేస్తూ బంగారం దోచుకుంటున్న ఒక ముఠా.. ఈ క్రమంలో హత్యలు కూడా చేస్తుంటుంది. ఇదే ముఠా.. ఒక ఇంటి మీద దాడి చేసినపుడు ఆర్తి (మిషా నారంగ్) అనే అమ్మాయిని రేప్ చేస్తుంది. దీంతో విక్రాంతి మరింతగా ఈ కేసు మీద ఫోకస్ చేస్తాడు. విక్రాంత్ కష్టపడి ఈ ముఠాను పట్టుకున్నాక కొన్ని సంచలన విషయాలు బయటికి వస్తాయి. ఆర్తి రేప్ వెనుక ఉన్నది వేరే వ్యక్తులని తెలుస్తుంది. ఇంతకీ ఆ వ్యక్తులెవరు.. వీరి వెనుక ఉద్దేశాలేంటి.. మొత్తంగా ఈ కేసును విక్రాంత్ ఎలా ఛేదించాడు అన్నది మిగతా కథ.
కథనం విశ్లేషణ:
ఒక క్రైమ్.. దాన్ని అనుసరిస్తూ అదే తరహాలో మరి కొన్ని నేరాలు.. ఈ కేసును పరిష్కరించడానికి వచ్చే ఒక పోలీసాఫీసర్.. తీగ లాగితే డొంక కదలడం.. ఈ క్రమంలో ట్విస్టుల మీద ట్విస్టులు.. తెర వెనుక ఏం జరిగిందో చూపించే ఒక ఫ్లాష్ బ్యాక్.. చివరగా నేరస్థుల ఆటకట్టు.. ఈ స్థాయిలో సినిమాలు తీయడంలో మలయాళ ఫిలిం మేకర్స్ గొప్ప నైపుణ్యం చూపిస్తుంటారు. ఓటీటీల విప్లవం తర్వాత మన వాళ్లకు మలయాళ థ్రిల్లర్ల రుచేంటో బాగానే తెలిసింది. అక్కడి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లను చూశాక సాదా సీదాగా సాగే థ్రిల్లర్లేవీ మన వాళ్లకు ఆనట్లేదు. ఐతే మలయాళ థ్రిల్లర్లనే స్ఫూర్తిగా తీసుకుని మన దర్శకులు కూడా అలాంటి సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ‘ద 100’లో రాఘవ్ ఓంకార్ శశిధర్ ఆ తరహా ప్రయత్నమే చేశాడు. ఒక ప్యాటర్న్ లో సాగే దోపిడీ-హత్యలకు సంబంధించిన కేసును యువ ఐపీఎస్ అధికారి ఛేదించే క్రమంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కాన్సెప్ట్ ఆసక్తికరంగానే అనిపిస్తుంది. కొన్ని ట్విస్టులు కూడా ఆసక్తి రేకెత్తిస్తాయి. కొన్ని ఎపిసోడ్ల వరకు బాగానే డీల్ చేశారు. కానీ ‘ద 100’ పూర్తి స్థాయిలో ఒక పకడ్బందీ థ్రిల్లర్ గా మాత్రం రూపొందలేకపోయింది. క్రైమ్ ఎలిమెంట్ తెర వెనుక కథ చాలా అసహజంగా.. అనాసక్తికరంగా ఉండడం దీనికి కొంత మైనస్ అయింది. దీనికి తోడు థ్రిల్లర్ సినిమాలకు అత్యంత కీలకం అయిన రేసీ స్క్రీన్ ప్లే ఇందులో మిస్ అయింది. ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేయడం అభినందనీయమే అయినా.. ఆ ప్రయత్నం జస్ట్ ఓకే అన్న ఫీలింగే కలిగిస్తుంది.
క్రైమ్ థ్రిల్లర్లలో ఇన్వెస్టిగేషన్ జరిగే తీరు ఉత్కంఠభరితంగా సాగడం ఒకెత్తయితే.. క్రైమ్ వెనుక నేపథ్యం ఆసక్తికరంగా ఉండడం మరో ఎత్తు. ఐతే ‘ద 100’లో తొలి పాయింట్ విషయంలో మెప్పిస్తుంది. అనవసర బిల్డప్పులు.. డీవియేషన్లు లేకుండా తొలి సన్నివేశం నుంచే కథను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఒకే ప్యాటర్న్ లో జరిగే క్రైమ్స్ ను ఐపీఎస్ అయిన హీరో ఇన్వెస్టిగేట్ చేసే సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. చిన్న చిన్న క్లూస్ ఆధారంగా ఈ కేసు గుట్టును ఛేదించే విధానం ఆకట్టుకుంది . ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్ కూడా క్యూరియాసిటీ పెంచుతుంది. ఐతే ఈ ట్విస్ట్ తర్వాత ఉత్కంఠ మరో స్థాయికి వెళ్తుందని ఆశిస్తాం. కానీ అలా జరగదు. ముందు చెప్పుకున్న రెండో పాయింట్ విషయంలో ‘ద 100’ కొంచెం నిరాశకు గురి చేస్తుంది.
క్రైమ్ వెనుక నేపథ్యాన్ని దర్శకుడు సరిగా ప్రెజెంట్ చేయలేకపోయాడు. ఒక కార్పొరేట్ కంపెనీ కేవలం అమ్మాయిల అందాల మీద పెట్టుబడి పెట్టి తమ సంస్థను రన్ చేయడం.. ప్రాజెక్టులు దక్కించుకోవడం అన్నది చాలా అసహజంగా అనిపిస్తుంది. దాని మీద పెద్ద స్కామ్ నడవడం.. ఇదే కథకు కీలకమైన క్రైమ్ కి దారితీయడం.. ఇదంతా ఏమాత్రం కన్విన్సింగ్ గా అనిపించదు. కథ మధ్యలో వచ్చే ట్విస్ట్ చూసి భలేగా ఉందనిపిస్తుంది కానీ.. తర్వాత రెండు వేర్వేరు నేరాలకు ముడిపెట్టిన తీరు కూడా కొంచెం కృత్రిమంగానే తోస్తుంది. ప్రథమార్ధంలో మాదిరి కథనంలో వేగం లేకపోవడం కూడా మైనస్ అయింది. అవసరం లేని రొమాంటిక్ ట్రాక్ పెట్టి సినిమా ఫ్లోను మరింత దెబ్బ తీశాడు దర్శకుడు. విలన్ గా తారక్ పొన్నప్ప పెర్ఫామెన్స్ బాగున్నా.. ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగా లేదు. ఈ సెటప్ కన్విన్సింగ్ గా సాగకపోవడం వల్ల ద్వితీయార్ధం బలహీనపడిపోయింది. ఈ ఎపిసోడ్ ను ఆసక్తికరంగా తీర్చిదిద్దుకుని ఉంటే.. ‘ద 100’ ఒక పకడ్బందీ థ్రిల్లర్ గా రూపుదిద్దుకునేది. అయినప్పటికీ.. క్రైమ్ థ్రిల్లర్ను ఇష్టపడేవాళ్లు ‘ద 100’ను ఒకసారి ట్రై చేయొచ్చు. కొన్ని లోపాలున్నప్పటికీ.. ఈ జానర్ ప్రియులు చూడ్డానికి ఓకే.
నటీనటులు:
ఐపీఎస్ అధికారి పాత్రలో ఆర్కే సాగర్ మెప్పించాడు. పాత్రకు తగ్గట్లు ఫిట్ గా తయారై కనిపించిన సాగర్.. నటన పరంగానూ ఆకట్టుకున్నాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. హీరోయిన్ మిషా నారంగ్ చూడ్డానికి చాలా యావరేజ్ గా అనిపిస్తుంది. తన నటన పర్వాలేదు. ధన్య బాలకృష్ణన్ పాత్ర తక్కువ నిడివే అయినప్పటికీ.. తన పెర్ఫామెన్స్ బాగుంది. విలన్ పాత్రలో ‘పుష్ప-2’ ఫేమ్ తారక్ పొన్నప్ప మరోసారి మెప్పించాడు. సీనియర్ నటుడు ఆనంద్ తన పాత్ర పరిధిలో బాగానే చేశాడు.
సాంకేతిక వర్గం:
‘ద 100’కు పేరున్న సాంకేతిక నిపుణులే పని చేశారు. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ తన స్థాయికి తగ్గ మ్యూజిక్ ఇవ్వలేకపోయాడు. ఒక పాట వినడానికి బాగుంది. మిగతావన్నీ సోసోగా అనిపిస్తాయి. హర్షవర్ధన్ నేపథ్య సంగీతం ఓకే. శ్యామ్ కె.నాయుడు ఛాయాగ్రహణం ఓ మోస్తరుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సుధీర్ వర్మ రాసిన డైలాగులు పర్వాలేదు. ఇక కథకుడు-దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్.. మలయాళం సినిమాల తరహాలో డిఫరెంట్ థ్రిల్లర్ తీయాలని ప్రయత్నించాడు. అతను ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ.. ఎగ్జిక్యూషన్లో కొంచెం తడబడ్డాడు. ఒక దశ వరకు ఆసక్తి రేకెత్తించినా.. కథ మలుపు తిరిగిన దగ్గర్నుంచి కథనం గాడి తప్పింది. ద్వితీయార్ధంలో అసహజమైన సెటప్ తో నిరాశపరిచాడు. కొన్ని ఎపిసోడ్ల వరకు అతను బాగా డీల్ చేశాడు.
చివరగా: 'ద 100'..క్రైమ్ థ్రిల్లర్ను ఇష్టపడేవాళ్ళ కోసం
రేటింగ్: 2.5/5