పరాకాష్ఠకు డ్యాన్సర్స్ వివాదం: చంపేస్తామని బెదిరించారంటూ సుమలత PSలో ఫిర్యాదు
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ పరిసరాల్లో తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) జనరల్ బాడీ సమావేశం తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్ర బిందువైంది.
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ పరిసరాల్లో తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) జనరల్ బాడీ సమావేశం తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్ర బిందువైంది. ప్రముఖ గెస్ట్ హౌస్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. తోపులాటలు, వాగ్వాదాలు, కేకలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా రణరంగంగా మారడంతో తోటి సినీ కార్మికులు, పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. అసోసియేషన్ అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవిపై కొందరు వ్యక్తులు ముందస్తు ప్రణాళికతో భౌతిక దాడికి పాల్పడటమే కాకుండా, ప్రాణహాని బెదిరింపులకు దిగారని ఆరోపించడం కలకలం రేపింది.
సమావేశాన్ని అడ్డుకోవడంతో పాటు అసోసియేషన్‌కు సంబంధించిన కీలక రికార్డులను అక్రమంగా తస్కరించేందుకు కొందరు వ్యూహాత్మకంగా వ్యవహరించారని సుమలతా దేవి ఆరోపించారు. మినిట్స్ బుక్, అజెండా పత్రాలు .. ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను కొందరు బయటకు తీసుకెళ్లేందుకు యత్నించగా తాను వారిని అడ్డుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కొందరు మహిళలు, వ్యతిరేక వర్గీయులు తనను చుట్టుముట్టి మూకుమ్మడిగా దాడి చేశారని పేర్కొన్నారు. ఈ అడ్డుకునే ప్రయత్నంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు ఎం. రాములు, సమిలి అనే మహిళపై కూడా దాడి చేసి గాయపరిచారని ఫిర్యాదులో వివరించారు.
ఈ దాడి వెనుక పెద్ద ఎత్తున కుట్ర జరిగిందని రఘు మాస్టర్ తరఫున ఉన్న లేడీ డ్యాన్సర్లు పక్కా పథకం ప్రకారమే తనపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించారని సుమలతా దేవి ఆరోపించారు. ఈ ఘటనలో లిఖిత, పూజిత, కళ్యాణి, సుమతి, విమల, కోకిల, మాధుర్య, శృతి, శ్రీదేవి, ఏడుకొండల శ్రీను తదితరులు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సుమలత పేర్కొన్నారు. మరోవైపు శేఖర్ మాస్టర్, రఘు మాస్టర్, భాను మాస్టర్, అజయ్ సాయి మాస్టర్, జోసెఫ్ ప్రకాష్ మాస్టర్లు సమాంతరంగా మరో అసోసియేషన్ ఏర్పాటు చేసేందుకు యత్నిస్తూ ప్రస్తుత వర్గంలో చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. ఈ మొత్తం పరిణామాల వెనుక ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని ప్రోత్సాహం ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు.
అధ్యక్ష పదవికి వెంటనే రాజీనామా చేయాలని లేదంటే చంపేస్తామని నిందితులు తీవ్రంగా బెదిరించినట్లు సుమలతా దేవి బంజారాహిల్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసుల నుంచి తక్షణ రక్షణ కోరారు. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు రాఘవ గెస్ట్ హౌస్‌లోని సీసీటీవీ ఫుటేజ్, మీటింగ్‌కు సంబంధించిన మొబైల్ వీడియోలు, ఆడియో రికార్డులను సేకరించి పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అపహరించిన మినిట్స్ బుక్‌లు.. ఇతర అసోసియేషన్ రికార్డులను తక్షణమే రికవరీ చేయాలని కోరారు.
ఈ ఘటనపై బాధ్యులైన వారిపై బీఎన్‌ఎస్ చట్టంతో పాటు వర్తించే వివిధ సెక్షన్ల కింద కఠిన కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుమలతా దేవి పోలీసులను అభ్యర్థించారు. ఇండస్ట్రీలో కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన సంఘాల్లో ఇటువంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం సినీ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఈ వ్యవహారంపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి తగు చర్యలు తీసుకుంటారని సినీ కార్మికులు భావిస్తున్నారు.