బాలయ్యకు డిసెంబర్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..
| బాలకృష్ణకు డిసెంబర్ సీజన్ గతంలో విజయాలు, పరాజయాలు రెండింటినీ అందించింది. 'అఖండ'తో భారీ హిట్ అందుకున్న ఆయనకు 'అఖండ 2' నిరాశ మిగిల్చింది. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దాదా' డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన 'వీరసింహారెడ్డి' హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
సినిమా విడుదలకు సరైన సీజన్ ఎంచుకోవడం ఒక ఎత్తయితే, ఆ సమయంలో ప్రేక్షకులను మెప్పించడం మరో ఎత్తు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు సెలవులు ఎంత ఉపయోగపడతాయో, నెగెటివ్ టాక్ వస్తే అంతే వేగంగా వసూళ్లు పడిపోతాయి. బాలకృష్ణ గత సినిమాలను చూస్తే ఇందుకు కొన్ని డిఫరెంట్ పరిస్థితులు కనిపిస్తాయి. ఒకే నెలలో బ్లాక్‌బస్టర్లు అందుకున్న సందర్భాలు ఉన్నాయి. భారీ అంచనాలతో వచ్చి దెబ్బతిన్న సినిమాలు కూడా ఉన్నాయి.
బాలయ్య కెరీర్‌లో డిసెంబర్‌లో వచ్చిన సినిమాల జాబితా చాలానే ఉంది. 1988లో 'రక్తాభిషేకం' హిట్ కాగా, 1990లో 'లారీ డ్రైవర్' సూపర్ హిట్ అందుకుంది. కానీ 1992లో వచ్చిన 'అశ్వమేధం', 2004లో విడుదలైన 'విజయేంద్ర వర్మ' నిరాశపరిచాయి. 2019 డిసెంబర్ 20న వచ్చిన 'రూలర్' కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. అప్పట్లో బాలయ్య మార్కెట్‌పైనా ఆ సినిమా ప్రభావం పడింది.
అయితే 2021 డిసెంబర్ 2న వచ్చిన 'అఖండ'తో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా బాలయ్యకు భారీ విజయం అందించింది. కరోనా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు మళ్లీ ప్రేక్షకులను రప్పించిన సినిమాల్లో 'అఖండ' ఒకటిగా నిలిచింది. ఆ విజయంతో బాలయ్య కెరీర్ మరోసారి ఊపందుకుంది. అక్కడి నుంచి వరుస సినిమాలతో మంచి వసూళ్లు అందుకున్నారు.
కానీ గత ఏడాది డిసెంబర్‌లో అదే బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'అఖండ 2' మాత్రం మొదటి భాగం స్థాయిలో మెప్పించలేకపోయింది. భారీ బడ్జెట్, పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేసినప్పటికీ ఆశించిన విజయం దక్కలేదు. 2025 డిసెంబర్ 12న విడుదలైన ఈ సినిమా బాలయ్యకు నిరాశ మిగిల్చింది. మొదటి భాగం అంతటి విజయాన్ని అందుకుంటుందని భావించిన అభిమానులకు కూడా ఫలితం షాక్ ఇచ్చింది.
ఇప్పుడు మరోసారి డిసెంబర్‌లోనే బాలయ్య సినిమా రాబోతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దాదా'ను డిసెంబర్ 24న విడుదల చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'వీరసింహారెడ్డి' మంచి విజయం అందుకుంది. అయితే ఈసారి కథ పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. 1980ల ముంబై గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో బాలయ్యను చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి పాటకు వచ్చిన రెస్పాన్స్ తో ప్రమోషన్లు మొదలయ్యాయి.
మరోవైపు ఈసారి డిసెంబర్‌లో పోటీ కూడా గట్టిగానే ఉండబోతోంది. అదే నెలలో ఇతర భాషల భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. క్రిస్మస్ సెలవులు ముగిసిన కొద్దిరోజులకే సంక్రాంతి సినిమాల హడావుడి మొదలవుతుంది. దీంతో 'దాదా'కు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ సమయం దొరికే పరిస్థితి లేదు. గత డిసెంబర్‌లో బోయపాటితో ఇవ్వలేకపోయిన హిట్ ను ఈ డిసెంబర్‌లో గోపీచంద్ మలినేని ఇస్తాడో లేదో చూడాలి.