రోజుకు 1.5 కోట్లు నష్టం.. కోర్టు నోటీసులే కొంప ముంచాయా?
ఈ వివాద సమయంలోనే మెగాస్టార్ చిరంజీవిపైనా తప్పుడు ప్రచారం మొదలైంది.;
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఊహించని స్థబ్ధత కొనసాగుతోంది. కార్మిక సమాఖ్య (ఫెడరేషన్) సమ్మె కారణంగా షూటింగులకు తీవ్ర అంతరాయం కలిగింది. 30శాతం వేతనం పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నా, దానికి నిర్మాతలు ససేమిరా అంటున్నారు. నిర్మాతల మండలి, ఫిలింఛాంబర్ సభ్యులు ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా భావించి మెగాస్టార్ చిరంజీవిని కలవడంతో సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావించారు. కానీ దీనికి ఇప్పటికీ పరిష్కారం కుదరలేదు. చిరు ఇంకా పూర్తి స్థాయిలో ఈ ఇష్యూలో జోక్యం చేసుకోకపోవడంతో సమస్య అంతకంతకు పెద్దదవుతోందే కానీ, పరిష్కారం లభించడం లేదు.
నాలుగైదు రోజులుగా ఫెడరేషన్ ప్రముఖులతో నిర్మాతలు, సినీపెద్దలు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల అనంతరం నిర్మాతలు కొంత దిగి వచ్చారు. రూ. 1000-1200 స్థాయిలో రోజువారీ వేతనం అందుకునే కార్మికుల కోసం 15శాతం తక్షణ పెంపు వర్తిస్తుందని నిర్మాతలు ప్రకటించారు. మరో రెండు విడతలుగా 5శాతం చొప్పున పెంచుతామని పేర్కొన్నారు. 2000 అందుకునేవారికి ఇది వర్తించదు. చిన్న నిర్మాతలకు ఈ కొత్త నియమాలు వర్తించవని నిర్మాతలు పేర్కొన్నారు. అయితే తాము కోరుకున్న 30శాతం వేతన పెంపునకు అంగీకరించలేదని, యూనియన్లను విభజించి పాలిస్తున్నారని నిర్మాతలపై ఆరోపిస్తూ, ఫెడరేషన్ అధ్యక్షుడు అనీల్ వల్లభనేని సీరియస్ అయ్యారు. చర్చలు విఫలమయ్యాయని ఆయన ధృవీకరించారు.
ఈ వివాద సమయంలోనే మెగాస్టార్ చిరంజీవిపైనా తప్పుడు ప్రచారం మొదలైంది. 30శాతం పెంపునకు అంగీకరిస్తూ చిరంజీవి కార్మిక ఫెడరేషన్ కు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారని కొందరు యూనియన్ సభ్యులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చిరు స్వయంగా ఆరోపించారు. మొత్తం ఇండస్ట్రీకి చెందిన సమస్య ఇది.. తానొక్కడే పరిష్కరించడం కుదరదని కూడా అన్నారు. తప్పుడు ప్రచారం నమ్మొద్దని కూడా అభ్యర్థించారు. మరోవైపు ఫిలింఛాంబర్ సైతం కార్మిక ఫెడరేషన్ కి సహాయ నిరాకరణను ప్రకటించింది. స్టూడియోలు, ఔట్ డోర్ యూనిట్ ఆఫీసులు, ఇతర మౌళిక వసతుల యూనిట్లు వగైరా వగైరా ఫెడరేషన్ సభ్యులతో పని చేసే ముందు, షూటింగులకు వెళ్లే ముందు ఫిలింఛాంబర్ ని ముందస్తుగా సంప్రదించాలని ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఏకపక్ష నిర్ణయంతో ఫెడరేషన్ మెరుపు సమ్మె చేయడంతో నిర్మాతలకు నష్టం వాటిల్లిందని, అందుకే షూటింగులకు వెళ్లే ముందు ఛాంబర్ ని విధిగా సంప్రదించాలని కూడా అంతర్గతంగా షూటింగులు ప్లాన్ చేస్తున్న నిర్మాతలకు సమాచారం అందింది.
పీపుల్స్ మీడియా అధినేత నోటీసులతో సమస్య:
అయితే ఫెడరేషన్ వర్సెస్ ఛాంబర్ వార్ ఎలా ఉన్నా కానీ, అగ్ర నిర్మాతల్లో ఒకరైన పీపుల్స్ మీడియా అధినేత టిజి విశ్వప్రసాద్ ఫెడరేషన్ ని సూటిగా టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. ఆయన నేరుగా ఫెడరేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులకు కోర్టు నోటీసులు పంపడం చర్చనీయాంశమైంది. ఈ కోర్ట్ నోటీసులకు తాము సమాధానం ఇస్తామని ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు అన్నారు. సమ్మె కారణంగా మధ్యలో షూటింగులు ఆగిపోవడంతో రోజుకు రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లిందని నిర్మాత విశ్వప్రసాద్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఇండస్ట్రీ సమస్యలో కేవలం కొందరు ఫెడరేషన్ వ్యక్తులను మాత్రమే విశ్వప్రసాద్ టార్గెట్ చేసారని, నిర్మాతలతో చర్చలు సాగిస్తున్నా నోటీసులిచ్చారని అన్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి కాకుండా ఒక వ్యక్తి నుండి చట్టపరమైన చర్యలకు పాల్పడడాన్ని మాజీ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి ఖండించారు. ఎవరు నోటీసులు ఇచ్చినా తమ ధృఢ సంకల్పాన్ని దెబ్బ తీయలేరని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఛాంబర్, నిర్మాతలకు ముందస్తు నోటీసులు ఇచ్చాకే తాము సమ్మె చేశామని కూడా ఫెడరేషన్ వర్గాలు పేర్కొనడం విశేషం. నిర్మాతలతో అన్ని చర్చలు విఫలమయ్యాయని ఇంతకుముందు ఫెడరేషన్ అధ్యక్షుడు అనీల్ వల్లభనేని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.