ఆ ప్లాన్ పాటిస్తే మ‌ళ్లీ మంచి రోజులు : ఎస్‌కెఎన్‌

తాజా ప‌రిస్థితుల‌పై తాజాగా యువ నిర్మాత ఎస్‌కెఎన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాజా ప‌రిస్థితుల వ‌ల్ల థియేట‌ర్‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల క‌ల్చ‌ర్ చచ్చిపోతుందన్నారు.;

Update: 2025-05-23 10:10 GMT

క‌రోనా స‌మ‌యంలో ఇండియ‌న్ సినిమా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంది. క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టిన త‌రువాత ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తారా? అనే చ‌ర్చ మొద‌లైంది. బాలీవుడ్ ఇండ‌స్ట్రీ సైతంభ‌య‌ప‌డుతున్న స‌మ‌యంలో మేమున్నా మంటూ తెలుగు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌చ్చారు. తెలుగు సినిమాకు అండ‌గా నిలిచారు. అయితే ఆ త‌రువాత నుంచే ప‌రిస్థితులు మారిపోతూ వ‌చ్చాయి. ఆర్టిస్ట్‌ల పారితోషికాలు, టికెట్ రేట్లు పెంచ‌డం,థియేట‌ర్ల‌లో ల‌భించే పాప్ కార్న్‌, కూల్ డ్రింక్స్‌పై జీఎస్టీ త‌దిత‌ర అంశాలు ప్రేక్ష‌కుల్ని క్రమ క్ర‌మంగా థియేట‌ర్ల‌కు దూరం చేశాయి.

దీంతో థియేట‌ర్ వ్య‌వ‌స్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయింది. చాలా మంది ఎగ్జిబిట‌ర్ల తాజా ప‌రిస్థితుల‌కు భ‌య‌ప‌డి థియేట‌ర్ల‌ను షాపింగ్ మాల్స్‌గా, ఫంక్ష‌న్ హాల్స్‌గా మార్చేశారు. దీంతో సింగిల్ థియేట‌ర్ల సంఖ్య గ‌న‌నీయంగా త‌గ్గుతూ వ‌స్తోంది. తాజా ప‌రిస్థితుల వ‌ల్ల థియేట‌ర్ల‌కు ఆడియ‌న్ వ‌చ్చే క‌ల్చ‌ర్ చ‌చ్చిపోతోంది. ఈ నేప‌థ్యంలోనే ఎగ్జిబిట‌ర్లు థియేట‌ర్ల బంద్‌కు పిలుపునివ్వ‌డం, ప‌ర్సెంటేజ్‌ని డిమాండ్ చేస్తుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తాజా ప‌రిస్థితుల‌పై తాజాగా యువ నిర్మాత ఎస్‌కెఎన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాజా ప‌రిస్థితుల వ‌ల్ల థియేట‌ర్‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల క‌ల్చ‌ర్ చచ్చిపోతుందన్నారు. ఈ ప‌రిస్థితి మారాలంటే ఒక్క‌టే మార్గ‌మ‌ని తెలిపారు. థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కుల రాక‌పోవ‌డానికి గ‌ల కార‌ణం ఏంటంటే రెండు వారాల‌కు, మూడు వారాల‌కే ఓటీటీల్లోకి వ‌చ్చేన్నాయి. అలాంట‌ప్పుడు థియేట‌ర్‌కు మ‌నం అంత ఖ‌ర్చు పెట్టి వెళ్ల‌డం అవ‌స‌ర‌మా? అని ప్రేక్ష‌కులు ఆలోచిస్తున్నార‌న్నారు.

హిందీలోనూ, త‌మిళంలోనూ అనుకుంటున్న‌ట్టు ఎనిమిది వారాల పాటు సినిమా ఓటీటీలోకి రాక‌పోతే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అయితే దీని వ‌ల్ల పెద్ద సినిమాలు చేసే నిర్మాత‌ల‌కు ఓటీటీల నుంచి భారీ మొత్తం రాక‌పోవ‌చ్చు. దాని వ‌ల్ల వారు ఈ విష‌యంలో ముందుకు రాకపోవ‌చ్చు. అలా వారు రార‌ని మిగ‌తా వాళ్లు కూడా రెండు మూడు వారాల‌కే సినిమాల‌ని ఓటీటీల‌కు ఇచ్చుకుంటూ పోతే థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు రారు. ఎంత ఎక్కువ స‌మ‌యం తీసుకుని సినిమాల‌ని ఓటీట‌ల‌కు అమ్మితేనే థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు వ‌స్తారు. ఈ సినిమా ఓటీటీకి ఇప్ప‌ట్లో రావ‌ట్లేదు కాబ‌ట్టి థియేట‌ర్ల‌కే వెళ్లి సినిమా చూడాల‌నే క‌ల్చ‌ర్ పెరుగుతుంది.

లేదు రెండు మూడు వారాల‌కే సినిమాల‌ని ఓటీట‌ల‌కు ఇచ్చేస్తూ పోతే ఇండ‌స్ట్రీ ప్ర‌మాదంలో ప‌డిపోతుంది. ప్ర‌స్తుతం ఓటీటీ బిజినెస్ అంత‌గా లేదు. కానీ వీటిని చూసుకునే ఆర్టిస్ట్‌లు త‌మ పారితోసికాల‌ను పెంచేశారు. ఇప్ప‌టికీ ఎవ‌రూ త‌గ్గ‌డం లేదు. వీటిపై చ‌ర్చ జ‌రిగితే ఇండ‌స్ట్రీకి మంచి జ‌రుగుతుంది. ప్ర‌స్తుత ఇండ‌స్ట్రీ ప‌రిస్థితి ఎలా ఉందంటే హార్ట్ ఎటాక్ వ‌చ్చిన పేషెంట్‌కి ఫేషియ‌ల్ చేద్దామ‌ని ఆలోచిస్తున్నారే కానీ ప్ర‌ధాన స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోలేక‌పోతున్నారు. ఇదే ఇప్పుడు ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింద‌ని ఎస్‌కెఎన్ చ‌మ‌త్క‌రించారు.

Tags:    

Similar News