సినిమా పిచ్చి.. తెలుగోళ్ల శాపం

తమ సినిమాల ప్రమోషన్ల కోసం తెలుగు రాష్ట్రాలకు వచ్చే పరభాషా నటులు, సాంకేతిక నిపుణులందరూ కచ్చితంగా ఒక మాట చెబుతుంటారు.;

Update: 2025-09-29 16:30 GMT

తమ సినిమాల ప్రమోషన్ల కోసం తెలుగు రాష్ట్రాలకు వచ్చే పరభాషా నటులు, సాంకేతిక నిపుణులందరూ కచ్చితంగా ఒక మాట చెబుతుంటారు. తెలుగు ప్రేక్షకులకు సినిమాల మీద ఉన్నంత అభిమానం ఇంకెవ్వరికీ ఉండదని, వాళ్లు సినిమాను సెలబ్రేట్ చేసే తీరు అద్భుతమని. ఈ మాటలు విని మన వాళ్లు పొంగిపోతుంటారు. కానీ ఈ వెర్రి అభిమానమే మన వాళ్లకు శాపంలా మారుతోందని చెప్పాలి. అందరూ సినిమాల పట్ల వాళ్ల ప్రేమను క్యాష్ చేసుకోవడానికి చూసేవాళ్లే తప్ప.. వాళ్ల కోణంలో ఆలోచించే వాళ్లు అరుదు.

దక్షిణాదిన మరే రాష్ట్రంలో లేనంత అధిక టికెట్ ధరలను తెలుగు రాష్ట్రాల్లో చూడొచ్చు. జగన్ సర్కారు మరీ దారుణంగా టికెట్ల ధరలను తగ్గిస్తే.. సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. తర్వాత రేట్లను పెంచారు. పెంచిన రేట్లు రీజనబుల్‌గానే అనిపించాయి. వాటి మీద జనాల్లో ఏమీ వ్యతిరేకత లేదు. కానీ కాస్త క్రేజున్న సినిమా వచ్చిందంటే చాలు.. ఆ పెంచిన రేట్ల మీద అదనపు రేట్లు వడ్డిస్తుండడం మాత్రం ఆమోదయోగ్యంగా లేదు. చివరికి డబ్బింగ్ సినిమాలకు సైతం ఎక్కువ రేట్లు పెట్టడం.. ప్రేక్షకులను దోచుకోవడం కాక మరేంటి?

మేకింగ్ వల్ల కాకుండా ఏవేవో కారణాలతో సినిమాల బడ్జెట్లు పెరిగితే.. ఆ భారాన్నంతా ప్రేక్షకుల మీద వేయాలని చూడడం ఎంత వరకు సమంజసం? మేకింగ్ మీద వందల కోట్లు ఖర్చు చేసి విజువల్ ఫీస్ట్‌లా రూపొందించిన ఈవెంట్ సినిమాలకు రేట్లు పెంచినా అర్థం ఉందనుకోవచ్చు. కానీ సగటు మాస్ మసాలా సినిమాలను ప్రేక్షకులు ఎందుకు అదనపు రేట్లు పెట్టాలో లాజిక్ కనిపించదు. ఇప్పుడు ‘ఓజీ’ ఆడుతోంది కాబట్టి దాన్ని టార్గెట్ చేయడం కాదు. అంతకుముందు వార్-2, కూలీ చిత్రాలను ఎందుకు ఎక్కువ రేటు పెట్టి చూడాలి? రేప్పొద్దున అఖండ-2, మన శంకర వరప్రసాద్‌కైనా ఎక్స్‌ట్రా రేట్ ఎందుకు అన్నది ప్రశ్న. కూలీ తమిళ సినిమా. దాన్ని తమిళనాట మల్టీప్లెక్స్ లో 200 లోపు రేటుతో చూశారు అక్కడి ప్రేక్షకులు. కానీ ఆ డబ్బింగ్ సినిమాను మనవాళ్ళు 300-400 మధ్య రేటుతో చూడాల్సి రావడాన్ని ఏమనాలి?

తెలుగు ప్రేక్షకుల సినిమా పిచ్చిన క్యాష్ చేసుకోవడం తెలుగు రాష్ట్రాలకు పరిమితం కాదు. యుఎస్‌లో కూడా అంతే. గత నెల ‘వార్-2’ బేసిగ్గా హిందీ సినిమా. హృతిక్ లాంటి టాప్ స్టార్ నటించిన ఆ చిత్రాన్ని హిందీ ప్రేక్షకులు 15 డాలర్ల రేటుతో చూశారు. కానీ అదే చిత్రాన్ని తెలుగులో చూడాలంటే మన వాళ్లు 25-30 డాలర్ల దాకా పెట్టాల్సి వచ్చింది. యుఎస్‌లో ‘ఓజీ’ సినిమా తెలుగు, హిందీ వెర్షన్లకు అంతరం చాలా ఎక్కువే. ఈ వారాంతంలో రాబోతున్న ‘కాంతార’ సినిమా తెలుగు వెర్షన్ టికెట్ రేటు 20 డాలర్లు కాగా.. కన్నడ వెర్షన్‌ మాత్రం 10 డాలర్లతో అందుబాటులో ఉండడం గమనార్హం. దీన్ని బట్టి సినిమా అంటే పిచ్చి ఉండడం తెలుగు ప్రేక్షకుల శాపం అని కాక ఇంకేమనాలి?

Tags:    

Similar News