పాన్ ఇండియా తెలుగు చిత్రాలు.. నిర్మాత శిరీష్ క్వశ్చన్స్ ఏంటి?
తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి, పర్సంటేజీ విధానం అమలుపై చర్చ మరింత వేడెక్కుతోంది.
తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి, పర్సంటేజీ విధానం అమలుపై చర్చ మరింత వేడెక్కుతోంది. హైదరాబాద్ లో తెలంగాణ ఎగ్జిబిటర్స్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో నిర్మాత శిరీష్ రెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న షేరింగ్ విధానం గురించి ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.
శిరీష్ రెడ్డి మాట్లాడుతూ.. "ఇప్పుడు తెలుగు సినిమా అనేది కేవలం రీజనల్ సినిమా కాదు. పాన్ ఇండియా స్థాయికి వెళ్లింది. హై బడ్జెట్ సినిమా అంటే ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అనే భావన ఏర్పడింది. అలాంటప్పుడు బెంగళూరు, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో అమలవుతున్న పర్సంటేజీ విధానం తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఉండకూడదు?" అంటూ ప్రశ్నించారు. తెలుగు సినిమాలను దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నప్పటికీ, మన సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి మాత్రం వీక్ గా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే శిరీష్ రెడ్డి వ్యాఖ్యల్లో ఇండస్ట్రీ వ్యవస్థపై అసంతృప్తి కనిపించిందనే అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. "మన సినిమా, మన హీరోలు, మన డైరెక్టర్లు.. కానీ మన థియేటర్ల పరిస్థితి ఏమిటి? పుష్ప మూవీని ఇండియా అంతా ఎంజాయ్ చేశారు. కానీ మనమక్కెడ చేశాం?" అన్న ఆయన ప్రశ్న చర్చకు దారితీసింది. ముఖ్యంగా మల్టీప్లెక్సులు ఇప్పటికే పర్సంటేజీ మోడల్ ద్వారా లాభపడుతున్నాయని, సింగిల్ స్క్రీన్లకు మాత్రం అదే అవకాశం లేకపోవడం సరైన విధానం కాదని పలువురు భావిస్తున్నారు.
ప్రస్తుతం థియేటర్ల వ్యవస్థలో పెద్ద మార్పులు వస్తున్నాయని ఎగ్జిబిటర్లు కూడా చెబుతున్నారు. ఒకప్పుడు సినిమాలు వారాల తరబడి ఆడేవని, ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని గుర్తుచేస్తున్నారు. ఎఫ్ 2 వంటి కొన్ని చిత్రాలు మాత్రమే ఎక్కువ కాలం ప్రదర్శితమయ్యాయని, ప్రస్తుతం పెద్ద సినిమాలు కూడా రెండు మూడు వారాలకే పరిమితమవుతున్నాయని అంటున్నారు. ఇటీవల విడుదలైన సినిమాల రన్ కూడా తక్కువ రోజుల్లో ముగుస్తోందని వారు చెబుతున్నారు.
ఒకేసారి ఎక్కువ థియేటర్లలో సినిమాలు విడుదల కావడం, ఓటీటీ ప్రభావం, ఫస్ట్ వీక్ కలెక్షన్లపై పెరిగిన దృష్టి వంటి అంశాలు సింగిల్ స్క్రీన్లపై ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాత రెంటల్ విధానం కొనసాగించడం తమకు భారంగా మారుతోందని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. ప్రస్తుతం మల్టీప్లెక్సులు పర్సంటేజీ షేరింగ్ విధానంలో లాభాలు పొందుతున్నాయని, అదే విధానం సింగిల్ స్క్రీన్లకు కూడా అమలు చేస్తే పరిస్థితి కొంత మెరుగవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
కోవిడ్ తర్వాత థియేటర్ రంగం ఇంకా పూర్తిగా కోలుకోలేదని, నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసి రిస్క్ ను పంచుకునే విధానం అవసరమని అభిప్రాయపడుతున్నారు. పర్సంటేజీ సిస్టమ్ అమలు చేస్తే కలెక్షన్లకు అనుగుణంగా ఆదాయం పంచుకోవచ్చని, దీంతో చిన్న థియేటర్లకు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తెలుగు సినిమా వ్యవస్థలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఫ్యూచర్ ఎలా ఉండబోతుందన్న ప్రశ్న ఇప్పుడు చర్చగా మారింది.