వెండి తెరను మించిన నిజ జీవిత నాటకం!
వెండితెరపై కనిపించే తారల జీవితాలు ఎంతో వైభవంగా, విలాసవంతంగా ఉంటాయని సామాన్య ప్రేక్షకులు భావి స్తుంటారు.
వెండితెరపై కనిపించే తారల జీవితాలు ఎంతో వైభవంగా, విలాసవంతంగా ఉంటాయని సామాన్య ప్రేక్షకులు భావిస్తుంటారు. కానీ ఆ రంగుల వెలుగుల వెనుక ఊహించని చీకట్లు, కన్నీళ్లు, గుండెను పిండేసే విషాదాలు దాగి ఉంటాయి. ఇలాంటి నాటకీయమైన, కన్నీటి గాథకు సజీవ సాక్ష్యం జుబేదా బేగం. ఆమె జీవితం సినిమా స్క్రిప్ట్ ను మించిన మలుపులతో రాజరికం, ప్రేమ, చివరకు ఘోరమైన విషాదంతో ముగిసిన అపురూప కథనం. జుబేదా బేగం భారతీయ చలనచిత్ర రంగానికి పరిచయమైన తొలి తరం నటీమణులలో ఒకరు. అందం, అభినయంతో మూకీ సినిమాల కాలం నుండి టాకీ సినిమాల వరకు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
వెండితెరపై ఆమె కనిపిస్తే చాలు కలెక్షన్ల వర్షం కురిసేది. అప్పట్లోనే రికార్డు స్థాయి పారితోషకాలు తీసుకుని స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. అయితే తెరపై నవ్వులు చిందించినంత కాలం ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ప్రశాంతతకు ఆమడదూరంలోనే ఉండిపోయింది. జుబేదా జీవితాన్ని మార్చేసిన మలుపు జోధ్‌పూర్ మహారాజా హన్వంత్ సింగ్‌తో ఏర్పడిన పరిచయం. జుబేదా అందానికి, వ్యక్తిత్వానికి ముగ్ధుడైన మహారాజా జుబేదాను అమితంగా ప్రేమించారు. అనేక సామాజిక అడ్డంకులు, రాజకుటుంబ నియమాలను ఎదిరించి 1950లో రెండవ భార్యగా చేసుకున్నారు.
ఈ ప్రేమ వివాహంతో జుబేదా కంటిపాప లాంటి సినీ రంగాన్ని, స్టార్ ఇమేజ్‌ను వదిలేసి జోధ్‌పూర్ ప్యాలెస్‌లో అడుగుపెట్టారు. ఒక సాధారణ నటి నుండి ఒక సంస్థానానికి రాణిగా మారిన జుబేదా ప్రయాణం అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న స్టార్ నటి రాజభవనంలో అడుగుపెట్టాక అపరిచితురాలిగా మిగిలిపోవడమే ఇక్కడి అసలు విషాదం. రాజభవనంలో అడుగుపెట్టిన జుబేదాకు అక్కడ ముళ్లబాట మాత్రమే ఎదురైంది. అప్పటికే పెళ్లయిన మహారాజుకు జుబేదా రెండో భార్య కావడం పైగా సినిమా రంగానికి చెందిన మహిళ కావడంతో రాజకుటుంబం, అక్కడి సమాజం ఆమెను ఎన్నడూ మనస్ఫూర్తిగా అంగీకరించలేదు.
మహారాణి హోదా దక్కినప్పటికీ ప్యాలెస్ గోడల మధ్య జుబేదా నిరంతరం ఒంటరితనాన్ని, అవమానాలను, ఒక రకమైన సామాజిక అణచివేతను అనుభవించాల్సి వచ్చింది. వెండితెరపై నటనతో ప్రపంచాన్ని శాసించిన ఆ సామ్రాజ్ఞి నిజజీవితంలో కనీస హక్కుల కోసం, గుర్తింపు కోసం పోరాడాల్సి రావడం కాలం చేసిన విచిత్రమైన విధి నాటకం. అయితే విధి ఆమెకు ఆ కొద్దిపాటి సంతోషాన్ని కూడా ఎంతో కాలం ఉంచలేదు. 1952లో జరిగిన ఓ ఘోర విమాన ప్రమాదం జుబేదా జీవితాన్ని అత్యంత విషాదకరంగా ముగించింది.
మహారాజా హన్వంత్ సింగ్ స్వయంగా నడిపిన చిన్న విమానం కూలిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జీవితంలో ఎన్నో ఆశలు, ఆశయాలు ఉన్న తరుణంలో జుబేదా కథ అలా అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఈ ప్రమాదం వెనుక అనేక అనుమానాలు, కుట్ర కోణాలు ఉన్నాయనే ప్రచారం ఇప్పటికీ వీడని రహస్యంగానే మిగిలిపోయింది. జుబేదా మరణించిన దశాబ్దాల తర్వాత ఆమె కుమారుడు (ప్రముఖ సినీ విమర్శకుడు ఖాలిద్ మొహమ్మద్) అందించిన కథ ఆధారంగా శ్యామ్ బెనెగల్ `జుబేదా` టైటిల్ తో ఆమె జీవిత గాథను వెండితెరపై ఆవిష్కరించి ప్రేక్షకులను కన్నీరు పెట్టించారు. నటిగా ఎందరికో ఆనందాన్ని పంచిన జుబేదా నిజజీవితంలో విషాద నాయికగా మిగిలిపోవడం సినీ చరిత్రలో చెరిగిపోని కన్నీటి అధ్యాయం గా మిగిలిపోయింది.