డైరెక్టర్ అన్నదొకటి.. బయటకొచ్చిందొకటా?

వాస్తవానికి మూడేళ్ల క్రితం దర్శకుల రౌండ్ టేబుల్ కార్యక్రమంలో వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ పెద్ద దుమారానికి దారితీశాయి.

Update: 2026-06-29 04:04 GMT

సినీ సెలబ్రిటీలు ఎక్కడ ఏం మాట్లాడినా ఆ కామెంట్స్ వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రోజులివి. పూర్తి వీడియోను చూడకుండా, అందులోని కొన్ని సెకన్ల క్లిప్లను మాత్రమే చూసి అభిప్రాయాలు ఏర్పరుచుకోవడం సాధారణమైపోయింది. ఒక కామెంట్ ను సందర్భం నుంచి విడదీసి వైరల్ చేయడం వల్ల కొత్తకొత్త వివాదాలు పుట్టుకొస్తున్నాయి.

తర్వాత అసలు విషయం బయటకు వచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. దర్శకుడు వెంకటేష్ మహా వ్యవహారం మరోసారి ఆ విషయాన్ని చర్చలోకి తీసుకొచ్చింది. కేరాఫ్ కంచరపాలెంతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ మహా, ఆ తర్వాత ఉమా మహేశ్వర ఉగ్రరూపస్యతో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా రూపొందిన రావు బహదూర్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

మూడేళ్ల క్రితం తన వ్యాఖ్యలపై వచ్చిన వివాదానికి మరోసారి స్పందించారు. ఆ సమయంలో తాను ఏ కమర్షియల్ సినిమాను విమర్శించలేదని వెంకటేష్ మహా స్పష్టం చేశారు. తాను మాట్లాడింది పూర్తిగా అల్ట్రా వయలెన్స్ ఉన్న సినిమాల గురించి మాత్రమేనని చెప్పారు. అయితే తన కామెంట్స్ ను మధ్యలో కట్ చేసి, మరోలా చూపించారని పేర్కొన్నారు. పూర్తి కన్వర్జేషన్ బయటకు రాకపోవడంతో కమర్షియల్ సినిమాలకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు ప్రచారం జరిగిందని అన్నారు.

తనకు కమర్షియల్ సినిమాలపై ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదని, అలాంటి చిత్రాలను గౌరవిస్తానని వెంకటేష్ మహా చెప్పారు. అయితే సమాజంపై ప్రభావం చూపే వైలెన్స్ ను ప్రోత్సహించే కథల విషయంలో మాత్రం తాను వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉంటానని వివరించారు. దర్శకులుగా తమకు సామాజిక బాధ్యత కూడా ఉంటుందని చెప్పడమే తన ఉద్దేశమని వెల్లడించారు.

వాస్తవానికి మూడేళ్ల క్రితం దర్శకుల రౌండ్ టేబుల్ కార్యక్రమంలో వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ పెద్ద దుమారానికి దారితీశాయి. ఒక సినిమా కథను పరోక్షంగా ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలను చాలామంది కేజీఎఫ్ పై విమర్శలుగా భావించారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. కేవలం రెండు సినిమాలు మాత్రమే తీసిన దర్శకుడు, భారీ కమర్షియల్ చిత్రాలను విమర్శిస్తున్నాడంటూ విమర్శలు కూడా వచ్చాయి.

ఆ వివాదం తర్వాత వెంకటేష్ మహా ఒకసారి క్లారిటీ ఇచ్చినా, ఇప్పుడు రావు బహదూర్ ప్రమోషన్స్ లో భాగంగా మరోసారి మాట్లాడారు. తాను మాట్లాడిన వీడియోను ఎడిట్ చేయడం వల్లే అపార్థం జరిగిందని, పూర్తి వీడియో చూసి ఉంటే అసలు విషయం అందరికీ అర్థమయ్యేదని చెప్పారు. ఈ ఘటన మరోసారి సోషల్ మీడియా ప్రభావంపై చర్చకు దారి తీసింది.

ప్రస్తుతం చిన్న వీడియో క్లిప్స్, షార్ట్ కట్స్ ఆధారంగా అభిప్రాయాలు ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అనవసర వివాదాలు, వ్యక్తిగత విమర్శలు కూడా పెరుగుతున్నాయి. వెంకటేష్ లేటెస్ట్ కామెంట్స్ తో అప్పటి వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆయన చెప్పిన క్లారిటీని కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు అప్పటి వ్యాఖ్యలే వివాదానికి కారణమని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మొత్తం విషయం తెలుసుకోకుండా వైరల్ క్లిప్‌ ల ఆధారంగా నిర్ణయాలకు రావడం ఎంతవరకు సరైందనే ప్రశ్నకు వెంకటేష్ మహా ఇష్యూ ఎగ్జాంపుల్ గా నిలిచింది.

Tags:    

Similar News