ఇడుపు కాయితం గోడవ.. భాషను చంపుకోవద్దంటూ ఎమోషనల్ అప్పీల్!

తెలుగు నాట ఉన్న ప్రతి మాండలీకానికి ఒక గొప్ప నేపథ్యం ఉందనే విషయాన్ని నరేష్ ఈ వీడియోలో ప్రత్యేకంగా గుర్తు చేశారు.

Update: 2026-06-29 03:57 GMT

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇడుపు కాయితం అనే సినిమా టైటిల్ చుట్టూ పెద్ద వివాదమే నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆంధ్రా వర్సెస్ తెలంగాణ అనే స్థాయిలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి దారుణంగా ట్రోల్ చేసుకుంటున్నారు. కేవలం ఒక సినిమా పేరును అడ్డుపెట్టుకుని కొందరు కావాలనే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న తీరు చాలా ఆందోళన కలిగిస్తోంది. ఈ వివాదం రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో సీనియర్ నటుడు నరేష్ స్పందిస్తూ నెటిజన్లకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు.

ఎవరో ఒకరిద్దరు ఆకతాయిలు చేసిన నెగటివ్ కామెంట్లను పట్టుకుని ఒక సినిమా టైటిల్ ను ఏకంగా ఒక పెద్ద జాతీయ సమస్యగా మార్చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా ఇంటర్నెట్ లో జరుగుతున్న ఈ కాంట్రవర్సీని చూస్తుంటే తనకు చాలా బాధగా ఉందని ఆయన చెప్పారు. ఇలాంటి చిన్న విషయాలను సాకుగా తీసుకుని ఒక గొప్ప మాండలీకాన్ని తక్కువ చేసి మాట్లాడటం ఒక తెలుగువాడిగా సిగ్గుతో తలదించుకునేలా చేస్తోందని ఆయన తన మనసులోని మాటను పంచుకున్నారు.

తెలుగు నాట ఉన్న ప్రతి మాండలీకానికి ఒక గొప్ప నేపథ్యం ఉందనే విషయాన్ని నరేష్ ఈ వీడియోలో ప్రత్యేకంగా గుర్తు చేశారు. అది తెలంగాణ కోనసీమ ఉత్తరాంధ్ర లేదా రాయలసీమ ఇలా ఏ ప్రాంత మాండలీకమైనా సరే దాని వెనుక ఎంతోమంది పోరాటాలు దాగి ఉన్నాయని ఆయన వివరించారు. మన భాషలోని ఈ అద్భుతమైన వైవిధ్యాన్ని చూసి మనం గర్వపడాలి తప్ప ఇలా ఒకరినొకరు కించపరుచుకోవడం ఏమాత్రం సరికాదని సూచించారు. మన భాషను గౌరవించుకోవాల్సిన బాధ్యత నేటి తరం నెటిజన్ల చేతుల్లోనే ఉందన్నారు.

ఇతర భాషల నుంచి వచ్చే సినిమాలను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించే తీరును నరేష్ ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించారు. తమిళం నుంచి వచ్చిన కరుప్పు కన్నడ నుంచి వచ్చిన కాంతార లాంటి ఎన్నో డబ్బింగ్ సినిమాలను మనవాళ్లు నెత్తిమీద పెట్టుకుని సూపర్ హిట్స్ చేశారని ఆయన గుర్తు చేశారు. పక్క రాష్ట్రాల భాషలను అంతలా గౌరవించే మనం మన సొంత భాషలోని ఒక పదాన్ని పట్టుకుని ఇలా ఆన్లైన్ వేదికగా రచ్చ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

సినిమాను కేవలం ఒక వినోద సాధనంగానే చూడాలని దానికి భాషను ప్రాంతీయ భావోద్వేగాలను ముడిపెట్టి పనిగట్టుకుని వివాదాలు సృష్టించొద్దని నరేష్ విజ్ఞప్తి చేశారు. మన సొంత భాషను మనమే ఇలా అకారణంగా అవమానించుకుంటే అంతకంటే సిగ్గుచేటు మరొకటి అస్సలు ఉండదని ఆయన చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. అనవసరమైన పట్టింపులకు పోయి మనలో మనం కొట్టుకోవడం వల్ల అంతిమంగా నష్టపోయేది మన ఇండస్ట్రీనే అనే ముఖ్యమైన విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఆయన నెటిజన్లను కోరారు.

ఈ అనవసరమైన వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టడానికి తెలుగు భాషా సంఘం తక్షణమే కలుగజేసుకుని బాధ్యత తీసుకోవాలని నరేష్ కోరారు. అలాగే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మీడియా సామాన్య నెటిజన్లు అందరూ కలిసికట్టుగా స్పందించి ఈ చెత్త ట్రోలింగ్ కల్చర్ కు ఎండ్ కార్డ్ వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక సీనియర్ నటుడిగా ఇండస్ట్రీ శ్రేయస్సు కోరి నరేష్ చేసిన ఈ రిక్వెస్ట్ ట్రోలర్స్ మైండ్ సెట్ లో ఎంతవరకు మార్పు తీసుకొస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News