తెలంగాణలో టికెట్ ధరల పెంపు.. హైకోర్టు 90 రోజుల రూల్..

తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ధరలు పెంచేందుకు ప్రభుత్వం కనీసం 90 రోజుల ముందే అనుమతులు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది.;

Update: 2026-01-20 12:45 GMT

తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ధరలు పెంచేందుకు ప్రభుత్వం కనీసం 90 రోజుల ముందే అనుమతులు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. విడుదలకు కొన్ని రోజుల ముందు హడావుడిగా ధరలు పెంచే పద్ధతికి చెక్ పడేలా కఠిన వైఖరి తీసుకుంది. మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి టికెట్ ధరల పెంపు అంశంలో రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్‌ కు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో సవాల్ చేయడంతో ఆ వ్యవహారం న్యాయస్థానం ముందుకు వచ్చింది. వాదనల సందర్భంగా పిటిషనర్ విజయ్ గోపాల్ కీలక అంశాలను మంగళవారం నాడు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సినిమా బడ్జెట్ ఎంత, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చారు, ఆదాయ వ్యయాల వివరాలు పరిశీలించకుండా హోంశాఖ టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తోందని ఆయన ఆరోపించారు.

నిర్మాతల నుంచి అఫిడవిట్ కూడా తీసుకోకుండా ధరలు పెంచడం ప్రజల హక్కులకు భంగం కలిగించడమేనని వాదించారు. ఆ ప్రక్రియ పూర్తిగా వాస్తవానికి దూరంగా జరుగుతోందని పిటిషన్‌ లో పేర్కొన్నారు. ది రాజా సాబ్ సినిమా విషయం జరిగిన దాన్ని ప్రస్తావించారు. కోర్టులో విచారణ జరుగుతుండగానే, జనవరి 8వ తేదీన అర్ధరాత్రి ఆ మూవీకి అనుమతి ఇస్తూ ప్రభుత్వం మెమో జారీ చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అంతేకాదు, అదే రోజు మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. అయితే ఆ ఉత్తర్వులను ప్రభుత్వ న్యాయవాది కోర్టు ముందు ప్రస్తావించలేదని పిటిషనర్ ఆరోపించారు. కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి.. న్యాయస్థానానికి తెలియజేయకుండా ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర తప్పిదమని హైకోర్టు అభిప్రాయపడింది. హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. ప్రభుత్వ న్యాయవాది కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది. అదే సమయంలో భవిష్యత్తుకు సంబంధించి కీలక మార్గదర్శకాలు ఇచ్చింది. ఇకపై ఏ సినిమా టికెట్ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నా, అది సినిమా విడుదలకు కనీసం 90 రోజుల ముందే ఖరారు చేసి ప్రకటించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఇది తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్–1955 ప్రకారం తప్పనిసరి నిబంధన అని న్యాయస్థానం గుర్తుచేసింది. చివరి నిమిషంలో ధరలు పెంచి ప్రజలపై భారం మోపిన పద్ధతికి ముగింపు పలకడమే తమ ఆదేశాల లక్ష్యమని కోర్టు పేర్కొంది. ఆ విధానాన్ని పాటించకపోతే, భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలను కూడా హైకోర్టు ఇచ్చింది. దీంతో టికెట్ ధరల పెంపు వ్యవహారంలో ప్రభుత్వం ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.

Tags:    

Similar News