డ్రగ్స్‌ తీసుకుంటే ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి: దిల్ రాజు

తెలంగాణను డ్రగ్స్‌ లేని రాష్ట్రంగా మార్చడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు.;

Update: 2025-06-26 15:35 GMT

తెలంగాణ ప్రభుత్వం మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమం చర్చకు కేంద్రంగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ ప్రముఖులు దిల్ రాజు, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. డ్రగ్స్‌ అనే మాయలో పడిన యువతను బయటకు తీయాలనే లక్ష్యంతో వారు చేసిన వ్యాఖ్యలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఈ కార్యక్రమంలో ముఖ్యంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన మాట్లాడుతూ “మలయాళ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌కు పాల్పడినవారిని బహిష్కరిస్తున్నారు. అలాంటి విధానాన్ని మన తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అమలుచేయాలి. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా, నిర్మాతగా, తెలుగు సినీ పరిశ్రమ తరపున నేను దీనిపై చర్చించనున్నాను. డ్రగ్స్‌కు పాల్పడిన వారిని పరిశ్రమ నుంచే నిష్క్రమించేలా చేయాలి. అప్పుడే సమాజానికి గట్టి సందేశం వెళుతుంది” అంటూ స్పష్టం చేశారు.

తెలంగాణను డ్రగ్స్‌ లేని రాష్ట్రంగా మార్చడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు. యువత భవిష్యత్తు దెబ్బతినకూడదని, అందుకోసం సినీ పరిశ్రమ కూడా ప్రభుత్వానికి తోడుగా నిలవాలన్న దృఢ సంకల్పం ఆయన మాటలలో వ్యక్తమైంది. ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమలో ఒకరిపై ఎలాంటి అనుమానం వచ్చినా ఆ విషయాన్ని విచారించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, దేశాన్ని బలహీనపరచాలంటే యుద్ధం అవసరం లేదని, యువతను డ్రగ్స్‌ వ్యసనానికి గురి చేయడమే సరిపోతుందన్న ఆవేదన వ్యక్తం చేశారు. “స్నేహితులు కూడా డ్రగ్స్ తీసుకుంటే దూరంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండేందుకు శారీరక శ్రమ, మంచి అలవాట్లు ఎంతో అవసరం” అని సూచించారు.

రామ్ చరణ్‌ మాట్లాడుతూ, తాను చిన్నప్పటినుంచి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నానని, ఇప్పుడు తండ్రిగా ఇది తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు. “డ్రగ్స్‌ వల్ల కుటుంబాలు నశించిపోతున్నాయి. అందరూ కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించాలి. వ్యాయామం చేయాలి, మంచి పనులు చేయాలి. ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌ వ్యతిరేక యోధులవ్వాలి” అని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News