ఈ సూర్యను తమిళులు ఒప్పుకుంటారా?
తెలుగులో ఓ మాదిరిగా ఆడిన సినిమాను.. తమిళులు మాత్రం సూర్య కెరీర్లో నంబర్‌వన్ చిత్రంగా నిలబెట్టారు.
తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకడైన సూర్యకు చాలా ఏళ్ల నుంచి సరైన విజయం లేదు. ఇలాంటి టైంలో సమ్మర్లో రిలీజైన కరుప్పు సినిమా ఈ మే నెలలో రిలీజై పెద్ద హిట్టయింది. నిజానికి అది గొప్ప సినిమా ఏమీ కాదు. కంటెంట్ పరంగా సూర్య ఫిల్మోగ్రఫీలో టాప్‌లో నిలిచే ఎన్నో సినిమాలకు ఇది దరిదాపుల్లో కూడా ఉండదు. అయినా అది ఆయన కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
తెలుగులో ఓ మాదిరిగా ఆడిన సినిమాను.. తమిళులు మాత్రం సూర్య కెరీర్లో నంబర్‌వన్ చిత్రంగా నిలబెట్టారు. ఒకప్పుడు విభిన్నమైన, బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలకే పట్టం కట్టి తమ అభిరుచిని చాటుకున్న తమిళ ప్రేక్షకులు కొన్నేళ్ల నుంచి ఎక్కువగా రొటీన్ సినిమాలనే నెత్తిన పెట్టుకుంటున్నారు. విజయ్ నటించిన ఎన్నో చిత్రాలు అందుకు రుజువు. జననాయగన్ లాంటి పేలవమైన సినిమా కూడా 300 కోట్లు దాటిందంటే ఏమనాలి?
చిత్రమైన విషయం ఏంటంటే.. ఈ మధ్య తెలుగు దర్శకులు తమిళ హీరోలతో మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. కానీ వాటికి తమిళంలో సరైన ఆదరణ ఉండట్లేదు. ధనుష్‌తో వెంకీ అట్లూరి తీసిన సార్ మూవీ తెలుగులో ఆడినంత బాగా తమిళంలో ఆడలేదు. అదే దర్శకుడు తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న దుల్కర్ సల్మాన్‌తో లక్కీ భాస్కర్ తీస్తే తెలుగులో గొప్ప సినిమాగా పేరు తెచ్చుకున్న చిత్రాన్ని తమిళులు ఏవరేజ్ చేశారు.
ఇక శేఖర్ కమ్ముల... ధనుష్ హీరోగా రూపొందించిన కుబేర తెలుగులో సూపర్ హిట్టయి, తమిళంలో మాత్రం ఫ్లాప్ అయింది. తమ హీరోలు వేరే దర్శకులు మంచి సినిమాలు తీస్తే వాటిని తమిళ ప్రేక్షకులు ఓన్ చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇప్పుడు సూర్య హీరోగా వెంకీ అట్లూరి తీసిన విశ్వనాథ్ అండ్ సీన్స్ ఈ శుక్రవారం తమిళ, తెలుగు భాషల్లో పెద్ద ఎత్తున రిలీజవుతోంది. ఇది తమిళంలో తీసి తెలుగులోకి అనువదించిన సినిమా కావడం గమనార్హం.
ప్రోమోలు చూస్తే స్యూర్ షాట్ హిట్ అనిపిస్తోంది. కానీ తెలుగు దర్శకులు తమిళ స్టార్లతో తీసే సినిమాలను లైట్ తీసుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా అక్కడ ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి. కరుప్పు లాంటి రొటీన్ మాస్ మూవీలో సూర్యను ఆదరించిన అక్కడి ఆడియన్స్.. భిన్నమైన, కంటెంట్ రిచ్ సినిమాలా కనిపిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్‌లో ఆయన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో మరి?