బ్రదర్స్ టైమ్ ఏంటి ఇలా నడుస్తోంది?
ఇదే తరహా పరిస్థితి కొన్ని నెలల క్రితం కార్తీ నటించిన వా వాతియార్ సినిమాకు కూడా ఎదురైంది. నలన్ స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం విడుదలకు ముందు ఆర్థిక వివాదాల్లో చిక్కుకుంది.
స్టార్ హీరోల సినిమాలకు భారీ హైప్ ఉండటం కొత్త విషయం కాదు. కానీ ఇటీవల బ్రదర్స్ సూర్య, కార్తీ సినిమాల విషయంలో విడుదల రోజునే ఎదురవుతున్న ఆర్థిక అడ్డంకులు మాత్రం కొత్త చర్చకు దారితీస్తున్నాయి. మొన్న కార్తీ సినిమా వా వాతియార్ ఇబ్బందులు ఎదుర్కొంటే.. ఇప్పుడు సూర్య నటించిన కరుప్ప కూడా అదే తరహా సమస్యల్లో చిక్కుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సూర్య నటించిన తాజా చిత్రం కరుప్పు తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదల కావాల్సి ఉంది. అయితే విడుదల రోజునే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమిళనాడు సీఎం విజయ్ నుంచి ఉదయం 9 గంటల ప్రత్యేక షోలకు అనుమతి వచ్చినప్పటికీ.. అనేక ప్రాంతాల్లో మార్నింగ్ షోలు రద్దయ్యాయి. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని థియేటర్లలో ప్రదర్శనలు నిలిచిపోయాయి. అమెరికాలో ప్రీమియర్స్ ఆగిపోవడం మరింత చర్చనీయాంశమైంది.
ఆ పరిస్థితిపై నిర్మాత ప్రభు స్పందిస్తూ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. గత చిత్రాలకు సంబంధించిన ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు పూర్తి కాకపోవడమే అసలు కారణమని సమాచారం. ప్రస్తుతం ఫైనాన్సియర్లతో చర్చలు జరుగుతున్నాయని, అవి సవ్యంగా పూర్తైతే మధ్యాహ్నం నుంచి షోలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇదే తరహా పరిస్థితి కొన్ని నెలల క్రితం కార్తీ నటించిన వా వాతియార్ సినిమాకు కూడా ఎదురైంది. నలన్ స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం విడుదలకు ముందు ఆర్థిక వివాదాల్లో చిక్కుకుంది. నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా చెల్లించాల్సిన కొన్ని బకాయిలపై కోర్టు జోక్యం చేసుకోవడంతో సినిమా విడుదల నిలిచిపోయింది. సంబంధిత చెల్లింపులు పూర్తి చేసిన తర్వాతే సినిమాకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అప్పట్లో కూడా అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆ రెండు సంఘటనలు ఇప్పుడు కోలీవుడ్ లో ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల మార్కెట్, భారీ ప్రమోషన్లు అన్నీ ఉన్నప్పటికీ.. రిలీజ్ ముందు ఫైనాన్స్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ముఖ్యంగా విడుదల తేదీ దగ్గర పడే వరకు పెండింగ్ బకాయిలు క్లియర్ చేయకుండా వదిలేయడం నిర్మాతలకు తలనొప్పిగా మారుతోంది.
సినిమా వ్యాపారం ఇప్పుడు పూర్తిగా అడ్వాన్స్ లు, డిజిటల్ హక్కులు, ఫైనాన్సియర్లపై ఆధారపడుతోంది. ఒక చెల్లింపు ఆలస్యం అయినా విడుదల వ్యవస్థ మొత్తం ప్రభావితమవుతోంది. థియేటర్లు చివరి నిమిషంలో షోలు ఆపేయాల్సి వస్తోంది. దీంతో అభిమానులే కాదు.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా నష్టపోతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం సూర్య, కార్తీ సినిమాలకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతోంది? అనే చర్చ నడుస్తోంది.
కానీ పరిశీలిస్తే సమస్య హీరోల వద్ద కాకుండా నిర్మాణ వ్యవస్థలోనే కనిపిస్తోంది. రిలీజ్ కు ముందు అన్ని ఆర్థిక లావాదేవీలు క్లియర్ చేయకుండా చివరి నిమిషం వరకు వాయిదా వేయడం వల్ల ఆ పరిస్థితులు వస్తున్నాయని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అభిమానుల ఆశ ఒక్కటే.. కరుప్పు సమస్య త్వరగా పరిష్కారమై కనీసం మధ్యాహ్నం షోల నుంచి అయినా సినిమా థియేటర్స్ లోకి రావాలని కోరుకుంటున్నారు.