డాక్టర్లను తయారుచేసిన యాక్టర్!
అయితే వారిలో కూడా రియల్ లైఫ్ హీరోలుంటారు. తాము సంపాదించిన సంపాదనలో నుంచి కొంత భాగాన్ని ఛారిటీకి ఉపయోగిస్తూ ఎంతోమందికి సాయపడుతూ ఉంటారు.;
ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలున్నారు. వారి యాక్టింగ్ కు, డ్యాన్స్‌కు, టాలెంట్ కు వాళ్లను అభిమానించే వాళ్లు కూడా ఎంతో మంది ఉంటారు. అలా అని వాళ్లంతా రియల్ లైఫ్ హీరోలైపోరు. కేవలం సినిమాల్లో నటించే రీల్ లైఫ్ హీరోలు మాత్రమే. అయితే వారిలో కూడా రియల్ లైఫ్ హీరోలుంటారు. తాము సంపాదించిన సంపాదనలో నుంచి కొంత భాగాన్ని ఛారిటీకి ఉపయోగిస్తూ ఎంతోమందికి సాయపడుతూ ఉంటారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ హీరో సూర్య ఈ కోవలోకే వస్తారు. మహేష్ బాబు తన పేరిట ఓ ఛారిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ రియల్ లైఫ్ సూపర్ స్టార్ గా నిలిస్తే, సూర్య అగరం అనే పేరుతో ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతో మంది విద్యను అందిస్తూ వారికి రియల్ హీరోగా నిలిచారు.
2006లో మొదలైన అగరం
2006లో చెన్నైలో అగరం అనే ఫౌండేషన్ ను ఏర్పాటు చేసిన సూర్య పేదల విద్యకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ, చదువకోవాలనే కోరిక ఉన్నా ఆ ఆశ తీరని పేద పిల్లలకు చేయూతనిస్తూ వస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే దాదాపు 8000 వేల మంది ఉన్నత విద్యను అభ్యసించగా అందులో 1800 మంది ఇంజనీర్లుగా ఎదిగి ఉన్నత స్థానాల్లో ఉన్నారు.
విద్యే ఆయుధంగా ముందుకెళ్తున్న అగరం
అగరం ఫౌండేషన్ స్టార్ట్ చేసి 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా చెన్నైలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఓ పెద్ద ఈవెంట్ ను నిర్వహించగా ఆ కార్యక్రమానికి శివ కుమార్, సూర్య, కార్తి, జ్యోతిక తో పాటూ కమల్ హాసన్, వెట్రిమారన్ మరియు ఇంకొంత మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. విద్య అనేది ఆయుధమని అగరం ఫౌండేషన్ నమ్ముతుందని, ఆ నమ్మకం ఇవాళ నిజమైందని ఎమోషనల్ అయ్యారు సూర్య.
ఎమోషనల్ అయిన సూర్య
విద్య అనేది కేవలం చదువు మాత్రమే కాదని, అది మన సంప్రదాయాన్ని నేర్పించేదని, వారి టాలెంట్ ను బయటకు తీసే పనిని అగరం ఫౌండేషన్ చేస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడే స్టూడెంట్స్ కు అగరం చేయూతనిస్తుందని చెప్పారు సూర్య. ఈ ఫౌండేషన్ ద్వారా 15 ఏళ్లలో 51 మంది వైద్య విద్యను అభ్యసించి, డాక్టర్లుగా మారిన వారిని చూస్తూ ఎమోషనల్ అయిన సూర్య, ఆ విద్యార్థులు మాట్లాడుతున్నప్పుడు కన్నీరు పెట్టుకున్నారు. సూర్య మంచి తనాన్ని చూసిన నెటిజన్లు ఆయన్ను అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.