అఖండ 2 ఇష్యూ.. సురేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
'అఖండ 2' విడుదల వాయిదా పడటం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆర్థిక వివాదాల కారణంగా చివరి నిమిషంలో సినిమా ఆగిపోవడం అందరినీ కలచివేసింది.;
'అఖండ 2' విడుదల వాయిదా పడటం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆర్థిక వివాదాల కారణంగా చివరి నిమిషంలో సినిమా ఆగిపోవడం అందరినీ కలచివేసింది. ఈ విషయంపై సీనియర్ నిర్మాత సురేష్ బాబు స్పందించారు. నందు హీరోగా నటించిన 'సైక్ సిద్ధార్థ' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన, 'అఖండ 2' ఇష్యూ గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు చాలా బ్యాలెన్స్డ్ గా సమాధానం ఇచ్చారు.
నిజానికి మంచి సినిమాలను ఎంకరేజ్ చేయడం, ఎక్కడైనా సమస్య వస్తే దాన్ని సాల్వ్ చేయడం ఇండస్ట్రీ పెద్దల బాధ్యత ప్రస్తుత సినిమా ఇష్యూ మీద మీ స్పందన ఏమిటని మీడియా నుంచి ఒక ప్రశ్న ఎదురైంది. దీంతో సురేష్ బాబు స్పందిస్తూ.. ఇది అనుకోకుండా వచ్చిన డిస్ప్యూట్. ఎవరూ ఇలా జరగాలని కోరుకోరు అని అన్నారు. సమస్య పరిష్కారానికి తాను కూడా ప్రయత్నించానని పరోక్షంగా హింట్ ఇచ్చారు.
ఆర్థిక లావాదేవీల గురించి చర్చిస్తూ.. "ఇవి బిజినెస్ మేటర్స్. వీటిని పబ్లిక్ లో డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. దురదృష్టవశాత్తు ఇప్పుడు బిజినెస్ పార్ట్ ఎక్కువగా బయటకు వచ్చేస్తోంది. ప్రతి ఒక్కరూ ఇంత అప్పు ఉంది, అంత ప్రాబ్లం ఉంది అని మాట్లాడుకుంటున్నారు. ఆడియెన్స్ కు కావాల్సింది సినిమా చూడటం మాత్రమే. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ తో వారికి పని లేదు" అని సురేష్ బాబు అభిప్రాయపడ్డారు.
గతంలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయని, కానీ అప్పుడు ఇంతలా బయటకు రాలేదని గుర్తుచేశారు. నిర్మాతలు ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఇలాంటివి సాల్వ్ అవుతాయని, అయితే కొన్నిసార్లు టైమింగ్ వల్ల ఇలా జరుగుతుంటుందని అన్నారు. 'అఖండ 2' నిర్మాతలు కూడా ఈ సమస్యను పరిష్కరించుకుంటారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.
సినిమా ఆలస్యం అవ్వడం బాధాకరమే అయినా, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని, ప్రేక్షకులు మంచి సినిమాను చూసే అవకాశం వస్తుందని సురేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దల జోక్యంతో సమస్య కొలిక్కి వస్తుందని, ఇండస్ట్రీలో ఇలాంటివి సహజమేనని ఆయన మాటల్లో అర్థమవుతోంది. మొత్తానికి సురేష్ బాబు వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అద్దం పడుతున్నాయి. ఆర్థిక విషయాలు రచ్చకెక్కడం కంటే, అంతర్గతంగా పరిష్కరించుకోవడం మంచిదని ఆయన సూచించారు.