అప్పట్లో సూపర్ స్టార్ పుట్టిన రోజు !
అలా 1974 మే 1న విడుదల అయిన అల్లూరి సీతారామరాజు కృష్ణ వందవ చిత్రం. ఇలా అతి తక్కువ సమయంలో వంద చిత్రాలలో నటించి సరికొత్త రికార్డు సృష్టించిన ఏకైక హీరోగా కృష్ణను చెప్పాల్సి ఉంటుంది.
సూపర్ స్టార్ అంటే కృష్ణ అన్నది ఫిక్స్. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేనే లేదు. తెలుగు సినీ రంగంలో తేనె మనసులు సినిమాతో 1965 లో ప్రవేశించి 2015 వరకూ యాభై ఏళ్ళ పాటు నిర్విరామంగా 350 పైగా చిత్రాలలో హీరోగానే నటిస్తూ ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందించిన కృష్ణ పేరు చెబితే మాస్ ఆడియన్స్ కి ఒక కిక్. తెలుగు సినిమా ఎగ్జిబిటర్లకు ఒక మహదానందం. నిర్మాతలకు ఆయన కొంగు బంగారం. కొత్త దర్శకులకు ఆయన అతి పెద్ద అండ. కొత్త నటీ నటులకు ఎంతో వెన్ను దన్ను. ఏడాదికి 18 కి పైగా సినిమాలు రోజులు మూడు షిఫ్టులు ఇలా అలుపెరగని సినీ ప్రయాణం తొలి పదేళ్ళ పాటు సాగింది. అలా 1974 మే 1న విడుదల అయిన అల్లూరి సీతారామరాజు కృష్ణ వందవ చిత్రం. ఇలా అతి తక్కువ సమయంలో వంద చిత్రాలలో నటించి సరికొత్త రికార్డు సృష్టించిన ఏకైక హీరోగా కృష్ణను చెప్పాల్సి ఉంటుంది.
వరస రికార్డులే :
అలా తన సినీ వేగాన్ని ఎవరూ ఊహించలేనంతగా స్పీడ్ గా కొనసాగిస్తూ 1982 నాటికి కృష్ణ ఈనాడు సినిమాతో 200వ చిత్రం మైలు రాయిని కూడా సక్సెస్ ఫుల్ గా దాటేశారు. ఆ మీదట పదమూడేళ్ళకు 1995 నాటికి మూడు వందల చిత్రాల నటుడిగా కృష్ణ తెలుగు సీమలో మరో రికార్డు నెలకొల్పారు. ఈ పదమూడేళ్ళ కాలంలోనే చిరంజీవి, బాలయ్య వెంకటేష్, నాగార్జున వంటి యంగ్ హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చి గట్టి పోటీ ఇచ్చారు. అయినా సరే కృష్ణ తన పరుగు ఎక్కడా ఆపలేదు. అందుకే మరో వంద చిత్రాలను అవలీలగా హీరోగానే చేసి చూపించారు. ఈ మధ్యలో వచ్చిందే బ్లాక్ బస్టర్ సింహాసనం మూవీ. అది 1985 మార్చి 21న రిలీజ్ అయి సూపర్ స్టార్ సత్తా ఏంటో చాటి చెప్పింది. 1995 నుంచి 2015 మధ్యలో మరో ఇరవై ఏళ్ళలో కృష్ణ హీరోగా తన చివరి మజిలీ పూర్తి చేశారు. ఈ క్రమంలో మరో 50 చిత్రాలకు పైగా నటించారు. మొత్తానికి సూపర్ స్టార్ కృష్ణ జోరు చూపించారు.
తెలుగు సినిమాకు హంగులు :
ఆంతే కాదు సినీ సీమలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు కృష్ణ. తొలి సినిమా స్కోప్, 70 ఎం ఎం తో పాటు ఎన్నో సాంకేతిక విలువలను పరిచయం చేశారు. తొలి కౌబాయ్ మూవీ తెలుగు సీమకు పరిచయం చేసినా అల్లూరి వంటి స్వాతంత్ర్య సమరయోధుడు జీవితాన్ని వెండి తెర మీద డేరింగ్ అండ్ డేషింగ్ గా ఆవిష్కరించినా కృష్ణ కే చెల్లింది. కురుక్షేత్రం చిత్రాన్ని అత్యంత సాంకేతిక విలువలతో నిర్మించడమే కాదు మొత్తం భారతాన్ని వెండి తెర మీద పండించిన తీరు కూడా క్రిష్ణ కే సాధ్యం అని చెప్పాలి. రైతు బిడ్డగా అయినా కార్మికుడుగా అయినా విప్లవ వీరుడిగా అయినా ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే సత్తా కృష్ణ కు ఉంది. ఆ ఆహార్యం, ఆ గంభీర వాచకం ఆయనకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. కేవలం నటుడిగానే కాదు నిర్మాతగా స్టూడియో అధినేతగా కూడా ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు సేవ చేశారు. దర్శకుడిగా 17 చిత్రాలు తీసి తన అభిరుచిని చాటుకున్నారు. ఇలా కృష్ణ సాహసం ఆయన పట్టుదల తెలుగు సినిమాని మరో పది మెట్లు ఎక్కించాయనడంలో సందేహం అయితే లేదు.
ఆ రోజు ప్రత్యేకం :
ఇక కృష్ణ పుట్టిన రోజు మే 31న వచ్చేది. ప్రతీ ఏటా ఆ సమయంలో ఆయన ఊటీలో షూటింగ్ పెట్టుకునేవారు. అక్కడికే నిర్మాతలు దర్శకులు అంతా వెళ్ళి ఆయనకు గ్రీటింగ్స్ చెప్పేవారు. మొత్తం అక్కడ అంతా ఒక కోలాహలం ఆహ్లాదకరమైన వాతావరణం నిండి ఉండేది. మరో వైపు చూస్తే కృష్ణ పుట్టిన రోజు అంటే చాలు ఆనాటి తెలుగు దిన పత్రికలకు పండుగ. అప్పట్లో దిన పత్రికలలో ఒక పేజి మాత్రమే సినిమా వార్తలకు కేటాయించేవారు. అయితే కృష్ణ బర్త్ డే అంటూ చాలా రోజుల ముందు నుంచే స్పెషల్ పేజెస్ తో ఆయన తాజా చిత్రాలు రానున్న చిత్రాలతో పోస్టర్లతో తీసుకొచ్చిన అనుబంధ పత్రికలతో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చేది. మార్కెట్ లోకి అది రాకుండానే అడ్వాన్స్ రిజర్వేషన్స్ చేయించుకుని అభిమానులు వాటిని అందుకునే వారు అంటే సూపర్ స్టార్ క్రేజ్ అంటే ఏంటో చెప్పకనే చెబుతుంది. పుట్టిన రోజు సందడి అంటే ఒకే ఒక్క హీరోది. అది సూపర్ స్టార్ కృష్ణది అని తెలుగు సినీ పరిశ్రమ నాటికీ నేటికీ తలచుకుంటుంది. కృష్ణ స్పూర్తిని తీసుకోవాలీ అంటే ఎక్కువ సినిమాలు చేయడం అందరికీ ఉపాధి అందేలా చూసుకోవడమే అని సినీ హితైషులు చెబుతారు.